Share News

Amaravati Restart : అమరావతికి జయం

ABN , Publish Date - May 02 , 2025 | 04:18 AM

అమరావతిలో రూ.57,962 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. 14 మంది ప్రముఖులతో ప్రధాని పర్యటన రెండు గంటల 30 నిమిషాలు కొనసాగనుంది

Amaravati Restart : అమరావతికి జయం

2.0 కు సర్వం సిద్ధం

  • నేడు ప్రధాని చేతుల మీదుగా పనులకు శ్రీకారం

  • రూ.49,040 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన

  • మరో రూ.8 వేల కోట్ల పనులకూ పచ్చజెండా

  • మధ్యాహ్నం 2.55కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు

  • అక్కడి నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడికి

  • వేదికపై మోదీ, బాబు, పవన్‌ సహా 14 మంది

  • రెండున్నర గంటల పాటు ప్రధాని పర్యటన

  • సభకు వచ్చే ప్రజల కోసం 8 వేల బస్సులు

  • అడ్డంకులు అధిగమించి అడుగు ముందుకు

  • నాడు రాజధాని నిర్మాణానికి ప్రధాని శ్రీకారం

  • నేడు అదే మోదీ చేతుల మీదుగా పునరుద్ధరణ

  • జగన్‌ కారణంగా ఐదేళ్ల కాల హరణం

  • కూటమి రాగానే మళ్లీ అమరావతిపై దృష్టి

  • ఇక పరుగు తీయనున్న రాజధాని పనులు

అమరావతి, మే1(ఆంధ్రజ్యోతి): ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. శుక్రవారం అమరావతి నిర్మాణ పనులకు మోదీ చేతుల మీదుగా శ్రీకారం చుట్టనున్నారు. రూ.49,040 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. వీటితో పాటు మరో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. శుక్రవారం మధ్యాహ్నం కేరళలోని తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని మోదీ గన్నవరం రానున్నారు.


గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో వెలగపూడి చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో సభా వేదిక వద్దకు చేరుకుంటారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొంటారు. ప్రధాన వేదికపై పరిమితంగా 14 మంది వీఐపీలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలి వస్తున్నారు. వారి కోసం 8 వేల బస్సులు ఏర్పాటు చేశారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాలకే మొత్తం 6,600 బస్సులు కేటాయించారు.

మంత్రుల బృందం పర్యవేక్షణ

ప్రధాని సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రుల బృందం నిరంతరాయంగా పర్యవేక్షిస్తోంది. ప్రధాని మోదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని వెల్లడించింది. పర్యవేక్షణకు నియమితులైన పయ్యావుల కేశవ్‌, పి.నారాయణ, కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్‌తో కూడిన మంత్రుల బృందం గురువారం సభావేదిక ప్రాంగణంలో సంబంధిత అధికారులతో ఏర్పాట్లను సమీక్షించింది. అనంతరం ప్రధాన సభా వేదికను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని పర్యటనకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు తరలి రానున్నారని, వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విస్తృతమైన ఏర్పాట్లు చేశామని వివరించారు. ప్రతి బస్సుకు ఒక ప్రభుత్వ అధికారిని ఇన్‌చార్జిగా పెట్టడంతో పాటు 25 బస్సులకు ఒక ప్రత్యేక ఇన్‌చార్జి అధికారిని నియమించినట్టు చెప్పారు. ఎక్కడా ఆటంకాలు కలగకుండా సభాస్థలికి చేర్చే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. బస్సులు బయలుదేరే సమయంలోనే అల్పాహారం, తాగునీరు ఇవ్వడంతో పాటు దారి మధ్యలో మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు.


సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ పార్కింగ్‌ ప్రాంతాల్లో కూడా భోజన వసతి కల్పించామని, సభానంతరం తిరిగి గమ్యస్థానాలకు బయలుదేరే ముందు రాత్రి భోజనం కూడా అందిస్తామని అన్నారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య బృందాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ.. అమరావతి రాజధాని నిర్మాణానికి 29 గ్రామాల ప్రజలు సుమారు 34 వేల ఎకరాలను ఇచ్చారని, వారందరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని కోరారు. ఇప్పటికే సీఎం ఆదేశాల మేరకు రాజధాని రైతులకు ఆహ్వానాలను అందించామని తెలిపారు. పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ మాట్లాడుతూ.. అమరావతి పనుల పునఃప్రారంభానికి వస్తున్న ప్రధాని కార్యక్రమానికి గతంలో ఎన్నడూ లేని రీతిలో అద్భుతమైన ఏర్పాట్లు చేశామన్నారు. ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడి అమరావతి రాజధానిని నాశనం చేసిందన్నారు. తిరిగి అమరావతి పనులను ప్రారంభించుకోవడం రాష్ట్రమంతా గర్వించదగ్గ పరిణామమన్నారు.

రెండున్నర గంటల పాటు మోదీ పర్యటన

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనను పురస్కరించుకుని అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి రానున్న మోదీ.. రాజధాని అమరావతి కార్యక్రమంలో పాల్గొని తిరిగి సాయంత్రం 5.20కి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళతారు. మొత్తంగా మోదీ రెండున్నర గంటలు రాష్ట్ర పర్యటనలో ఉంటారు.


రూ.57,962 కోట్ల ప్రాజెక్టులు

  • రాజధాని అమరావతిలో రూ.49,040 కోట్ల వ్యయంతో 74 ప్రాజెక్టుల పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌, హైకోర్టు భవనాలతో పాటు ఇతర ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తారు.

  • రాజధాని పనులతో పాటు మరో రూ.8 వేల కోట్ల ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. రూ.1,459 కోట్లతో కృష్ణా జిల్లా నాగాయలంకలో డీఆర్‌డీవో చేపట్టే క్షిపణి ప్రయోగ కేంద్రానికి, రూ.100 కోట్లతో విశాఖలో డీపీఐఐటీ చేపట్టే యూనిటీ మాల్‌కు, రూ.293 కోట్లతో గుంతకల్లు వెస్ట్‌-మల్లప్ప గేట్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి నిర్మాణానికి, రూ.3,176 కోట్లతో ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టే 6 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

  • రూ.3,680 కోట్లతో నిర్మాణం పూర్తి చేసుకున్న 8 జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభిస్తారు.

  • రూ.254 కోట్లతో నిర్మించిన 3 రైల్వే ట్రిప్లింగ్‌, డబ్లింగ్‌ ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు.


ఇవి కూడా చదవండి..

Raj Kasireddy: ఏపీ లిక్కర్ స్కాం.. రాజ్ కేసిరెడ్డికి ఎదురుదెబ్బ

Andhra Liquor Scam: లిక్కర్ స్కామ్.. ఎస్కేప్‌‌కు దిలీప్ యత్నం.. పట్టేసుకున్న సిట్

Chandrababu MSME Parks: రైతులను పారిశ్రామికవేత్తలను చేస్తాం.. పరిశ్రమలు పెట్టండి

Updated Date - May 02 , 2025 | 04:18 AM