Srisailam Temple: శ్రీశైలంలో ఇలాంటివి చేయొద్దు.. చర్యలు తప్పవు.. ఈవో కీలక ఆదేశాలు
ABN , Publish Date - Dec 20 , 2025 | 09:28 AM
శ్రీశైలం దేవస్థానంలో అన్యమత ప్రార్థనలు, అసాంఘిక కార్యకలాపాలపై దేవస్థానం ఈవో ఆంక్షలు విధించారు. ఇలాంటివి చట్టరీత్యా నేరమని.. చర్యలు తప్పవని హెచ్చరించారు.
నంద్యాల, డిసెంబర్ 20: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబమల్లికార్జున స్వామి దేవాలయంలో (Srisailam Temple) అన్యమత ప్రార్థనలు, బోధనలు, రీల్స్ చేయడంపై దేవస్థానం కఠిన ఆంక్షలు విధించింది. దేవాలయంలో ఇలాంటివి చేయడం నేరమని.. చట్టరీత్యా చర్యలు తప్పవి దేవస్థానం ఈవో శ్రీనివాస్ రావు హెచ్చరించారు. శ్రీశైలం క్షేత్ర పరిధిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్యమత ప్రార్ధనలు చేయటం, ప్రచారాలు నిర్వహించటం నిషేధమని తెలిపారు. అన్యమత బోధనలకు సంబంధించిన కరపత్రాలను, పుస్తకాలను పంచటం, అన్యమతాలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించటం చట్టరీత్యా నేరమని అన్నారు.
శ్రీశైలం దేవస్థాన అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వీడియోలు తీయడం, డ్రోన్లు ఎగురవేయడం, సోషల్ మీడియాలో వ్యక్తిగత రీల్స్‌ను ప్రచారం చేయడం కూడా నిషేధమని స్పష్టం చేశారు. క్షేత్ర పరిధిలో ధూమపానం, మద్యపానం సేవించటం, జూదం ఆడటం, మాంసాహారాలు సేవించడం వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడటం కూడా చట్ట రీత్యా నేరమే అని అన్నారు. దేవాదాయ ధర్మాదాయ నిబంధనలను ఉల్లంఘించి, చట్ట విరుద్ధంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శ్రీశైలం ఆలయానికి వచ్చే భక్తులు ఈ నిబంధనలను పాటించి దేవస్థానం వారికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.
కాగా.. ఇటీవల ఓ యువతి శ్రీశైలం దేవాలయం ప్రాంగణంలో రీల్స్ చేయడం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. శ్రీశైలం ఆలయ నిబంధనలు ఉల్లంఘించారని, భక్తుల మనోభావాలు దెబ్బతీసేలా రీల్స్ చేశారంటూ నెటిజన్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తనపై వచ్చిన ట్రోల్స్‌పై స్పందించిన యువతి.. తాను సాంప్రదాయంగానే చీర కట్టుకుని రీల్స్ చేశానని, శ్రీశైలం ఆలయంలో రీల్స్ చేయలేదని చెప్పుకొచ్చింది. తప్పైతే క్షమించండి అంటూ యువతి వీడియోను రిలీజ్ చేసింది. ఈ క్రమంలో మరెవ్వరూ కూడా ఇలాంటివి చేయకుండా ఉండాలని ఈవో శ్రీనివాసరావు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి...
వణికిస్తున్న కోల్డ్‌వేవ్.. కనిష్ఠ స్థాయికి పడిపోతున్న ఉష్ణోగ్రతలు.. భయాందోళనలో ప్రజలు
ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!
Read Latest AP News And Telugu News