Share News

CM Chandrababu Naidu: ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!

ABN , Publish Date - Dec 20 , 2025 | 06:10 AM

తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్న ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాటలో పయనించేందుకు భారీ ఎత్తున నిధులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించారు....

CM Chandrababu Naidu: ఆర్థిక ఒత్తిడిలో ఉన్నాం..ఆదుకోండి!

  • భారీగా నిధులివ్వండి: సీఎం చంద్రబాబు

సీమను ఉద్యాన హబ్‌గా మార్చేందుకు మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్థిక సాయం అందించండి. 2026-27 బడ్జెట్‌లో సీమకు హార్టీకల్చర్‌ డెవల్‌పమెంట్‌ ప్యాకేజీని ప్రకటించండి.

రాజధాని నిర్మాణానికి రుణ సహకారం అందించిన తరహాలోనే నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు కూడా కేంద్రం చేయూతనందించాలి. 2026-27 బడ్జెట్‌లో ఆర్థిక సహాయం చేయండి.

- ఆర్థిక మంత్రి నిర్మలతో చంద్రబాబు

  • ఢిల్లీలో అమిత్‌షా, నిర్మల, సీఆర్‌ పాటిల్‌,సోనోవాల్‌, పురీ, ఖట్టర్‌లతో వరుస భేటీలు

  • అభివృద్ధి బాటపట్టేందుకు సాయం చేయండి

  • విద్య, స్కిల్‌, వ్యవసాయం, ఎంఎ్‌సఎంఈ,హౌసింగ్‌, రోడ్లకు పూర్వోదయ నిధులివ్వండి

  • సాస్కీ కింద 10 వేల కోట్లు కేటాయించండి

  • ఉద్యాన హబ్‌గా సీమ.. 41 వేల కోట్లివ్వండి

  • బడ్జెట్‌లో హార్టీకల్చర్‌ ప్యాకేజీ ప్రకటించండి

  • నల్లమలసాగర్‌ ప్రాజెక్టుకు సహకరించండి

  • బెజవాడ, విశాఖ మెట్రోలను ఆమోదించండి

  • రాష్ట్రంలోని 65 లక్షల ఎల్‌పీజీ కనెక్షన్లను‘ఉజ్వల’ పథకం పరిధిలోకి తీసుకురండి

  • కేంద్ర మంత్రులకు చంద్రబాబు విజ్ఞాపనలు

  • అమిత్‌షాతో తాజా రాజకీయాలపైనా చర

న్యూఢిల్లీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్న ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి బాటలో పయనించేందుకు భారీ ఎత్తున నిధులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించారు. శుక్రవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. కీలక ప్రాజెక్టులకు నిధుల మంజూరు కోరారు. తాజ్‌ హోటల్లో అమిత్‌షాను చంద్రబాబు కలిశారు. రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందన, రూ.లక్షల కోట్లతో కుదుర్చుకున్న ఎంవోయూల గురించి కూడా తెలియజేశారు. జగన్‌ విధ్వంసక పాలనతో కుదేలైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. వివిధ కేంద్ర మంత్రులతో సమావేశాల వివరాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఉభయులూ చర్చించారు.


‘పూర్వోదయ’ గ్రోత్‌ ఇంజన్‌గా ఏపీ

రాష్ట్రం ‘పూర్వోదయ’ గ్రోత్‌ ఇంజన్‌గా మారుతుందని నిర్మలా సీతారామన్‌తో సీఎం అన్నారు. పార్లమెంటు ప్రాంగణంలోని ఆర్థిక మంత్రి కార్యాలయంలో ఆమెతో సమావేశమయ్యారు. ‘విద్య, నైపుణ్యకల్పన, వ్యవసాయం, ఎంఎ్‌సఎంఈ, హౌసింగ్‌, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు పూర్వోదయ నిధులు అందించాలి. ఈ పథకం కింద ప్రాధాన్య క్రమంలో చేపట్టే ప్రాజెక్టులకు పాలనాపరమైన నిబంధనలను సరళీకృతం చేయాలి. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా దీని నిధులను వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వాలి. సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టండి. విశాఖలో యూనిటీ మాల్‌ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్‌లాక్‌ బ్రిడ్జి పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో మూడు వర్కింగ్‌ వుమెన్‌ హాస్టళ్ల నిర్మాణాల పూర్తికి నిధులివ్వండి. వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్మాణం, ఎంఎ్‌సఎంఈ పార్కులు, హౌసింగ్‌, వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులివ్వండి. ఈ పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.10,054 కోట్లు మంజూరు చేయండి’ అని విజ్ఞప్తి చేశారు.

జల్‌జీవన్‌ మిషన్‌లో కేంద్రం వాటా విడుదల చేయండి

శ్రమశక్తి భవన్‌లో కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌తో సీఎం సమావేశమయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్‌ జీవన్‌ మిషన్‌ అమలు కోసం రాష్ట్రానికి అదనంగా రూ.1,000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. రాష్ట్రప్రభుత్వ వాటాగా రూ.524.41 కోట్లు ఖర్చు చేశామని, కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని కోరారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎ్‌సవై)-ఆర్‌ఆర్‌ఆర్‌ పథకం కింద చెరువులు, కాలువల పునరుద్థరణకు ప్రతిపాదనలు సిద్థం చేశామని.. దీనికి సంబంధించి కేంద్రం వాటా నిధులు వెంటనే విడుదల చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సాగునీటి సామర్థ్యం గణనీయంగా పెంచుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.


షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌ అభివృద్ధికి సహకరించండి..

దుగరాజపట్నాన్ని నేషనల్‌ మెగా షిప్‌ బిల్డింగ్‌ క్లస్టర్‌గా త్వరితగతిన ఆమోదించాలని కేంద్ర షిప్పింగ్‌ మంత్రి సోనోవాల్‌కు సీఎం విజ్ఞప్తి చేశారు. నేషనల్‌ మెగా షిప్‌బిల్డింగ్‌, షిప్‌ రిపేర్‌ క్లస్టర్‌ అభివృద్థికి పూర్తిగా సహకరించాలని కోరారు. ‘చిప్‌ టు షిప్‌’ విజన్‌కు అనుగుణంగా నౌకానిర్మాణ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు. షిప్‌బిల్డింగ్‌, షిప్‌ రిపేర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు రాష్ట్రప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. ప్రాజెక్టు టెక్నో ఎకనామిక్‌ ఫీజిబిలిటీ రిపోర్ట్‌ (టీఈఎ్‌ఫఆర్‌) సిద్థమైందని.. నౌకా నిర్మాణానికి అనుబంధ ఎంఎ్‌సఎంఈ యూనిట్లు, కామన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో సమగ్ర క్లస్టర్‌గా అభివృద్థి చేసేలా ప్రణాళికలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో తొలిదశలో రూ.1,361 కోట్లతో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో చేపట్టిన 4 ఫిషింగ్‌ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని మంత్రికి విన్నవించారు. జువ్వలదిన్నె హార్బర్‌కు మాత్రమే కేంద్రం నుంచి రూ.138.29 కోట్లు మంజూరయ్యాయని, మిగిలిన మూడింటికి ఇంకా సాయం అందలేదని తెలిపారు. ఇప్పటివరకు రాష్ట్రప్రభుత్వం రూ.782.29 కోట్లు ఖర్చు చేసిందని, ఫేజ్‌-1 పూర్తికి ఇంకా రూ.440.91 కోట్లు అవసరమన్నారు. ప్రకాశం జిల్లా వాడ్రేవు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని కోరారు. మొత్తం రూ.590.91 కోట్లు అందించాలని అభ్యర్థించారు. కాగా.. చంద్రబాబు ఢిల్లీలో క్రెడాయ్‌ జాతీయ కాన్‌క్లేవ్‌లో కూడా పాల్గొన్నారు. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌కు చంద్రబాబు విన్నవించారు. నెల్లూరు జిల్లాలో బీపీసీఎల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ రిఫైనరీ ప్రాజెక్టు శంకుస్థాపనకు హాజరుకావాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురీకి సీఎం విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులోని కేంద్ర మంత్రి కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు.


సీమకు ఉద్యానవన ప్యాకేజీ..

రాయలసీమలో ఉద్యానవన అభివృద్ధి ప్యాకేజీకి ఆర్థిక సాయం కోరుతూ నిర్మలకు చంద్రబాబు వినతిపత్రం అందజేశారు. ‘ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న 18 పంటలను సాగు చేస్తున్నాం. సీమ జిల్లాల్లో విస్తరించిన 93 ఉద్యానవన క్లస్టర్లతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 33.7 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలుగుతోంది. ఎగుమతులకు వీలైన ఉద్యాన ఉత్పత్తులు పెద్దఎత్తున ఈ ప్రాంతంలో పండుతున్నాయి. ప్రస్తుతం ఉన్న 8.48 లక్షల హెక్టార్ల హార్టీకల్చర్‌ సాగును 2029 నాటికి 12.28 లక్షల హెక్టార్లకు విస్తరించాలని నిర్ణయించాం. ఈ ప్రాంతంలో నీటి వనరులను మెరుగుపరచడంతో పాటు ఉద్యాన ఉత్పత్తుల ఎగుమతికి రోడ్లు, రైలు, ఓడరేవులు, ఎయిర్‌ కార్గో సహా లాజిస్టిక్స్‌ పార్కుల వంటి సౌకర్యాలు కల్పించాల్సి ఉంది’ అని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని కరువు పీడిత ప్రాంతాలకు గోదావరి వరద జలాలను తరలించడానికి తలపెట్టిన పోలవరం-నల్లమలసాగర్‌ లింక్‌ ప్రాజెక్టుకు సహకారం అందించాలని కోరారు. మూడు దశలుగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకయ్యే వ్యయాన్ని వివరిస్తూ మంత్రికి లేఖ సమర్పించారు. ప్రాజెక్టు ప్రాథమిక రిపోర్టును కేంద్ర జలశక్తి శాఖకు అందించామని.. దీనికి ఆమోదం తెలిపిన వెంటనే డీపీఆర్‌ను సమర్పిస్తామని తెలిపారు.

Updated Date - Dec 20 , 2025 | 07:07 AM