Share News

PM Modi: కేసీఆర్‌ ఎలా ఉన్నారు?

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:40 AM

బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ‘‘కేసీఆర్‌ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది...

PM Modi: కేసీఆర్‌ ఎలా ఉన్నారు?

  • ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమనండి

  • ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పానని చెప్పండి

  • తనను కలిసిన బీఆర్‌ఎస్‌ ఎంపీలతో ప్రధాని

న్యూఢిల్లీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆరోగ్యంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. ‘‘కేసీఆర్‌ ఎలా ఉన్నారు? ఆరోగ్యం ఎలా ఉంది? ఆయన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోమనండి. ఇవన్నీ నేను ప్రత్యేకంగా చెప్పమన్నానని చెప్పండి’’ అని తనను కలిసి బీఆర్‌ఎస్‌ ఎంపీలకు మోదీ చెప్పారు. బీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు కేఆర్‌ సురేశ్‌రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ధీకొండ దామోదర్‌రావు.. శుక్రవారం పార్లమెంట్‌లో ప్రధాన మంత్రిని ఆయన కార్యాలయంలో కలిశారు. సిరిసిల్ల వరకూ నిర్మిస్తున్న నేషనల్‌ హైవే 365బిని వేములవాడ మీదుగా కోరుట్ల వరకూ విస్తరించాలని వినతిపత్రం సమర్పించారు. ఈ అంశాన్ని ఇప్పటికే తమ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కేంద్రం దృష్టికి తీసుకొచ్చిన విషయాన్ని మోదీకి గుర్తు చేశారు. ఈ రహదారిని విస్తరించేందుకు కేంద్ర మంత్రి అధికారికంగా మాట ఇచ్చిన విషయాన్ని వివరించారు. ఈ రహదారిని విస్తరించడం వల్ల ఆధ్యాత్మిక పర్యాటకం అభివృద్థి అవుతుందని తెలిపారు. ధవళేశ్వరం బ్రిడ్జ్‌ మాదిరిగా మిడ్‌ మానేరుపై రోడ్‌ కమ్‌ రైల్‌ బ్రిడ్జిని ఏర్పాటు చేసి, వేములవాడ మీదుగా కోరుట్లలో ఎన్‌హెచ్‌-63ని కలిపేలా విస్తరించాలని కోరారు. కరీంనగర్‌ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్‌-కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా వంతెన పనుల విషయంలోనూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. కేసీఆర్‌ ఆరోగ్యం గురించి ఎంపీలను ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. ఇటీవలే తెలంగాణ బీజేపీ ఎంపీలకు క్లాస్‌ పీకిన నరేంద్ర మోదీ.. ప్రత్యేకంగా కేసీఆర్‌ గురించి అడగడం, తన మాటగా కేసీఆర్‌కు చెప్పాలని సూచించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - Dec 20 , 2025 | 06:52 AM