Mahatma Gandhi National Rural Employment Guarantee Act: ఉపాధి... ఉసూరు
ABN , Publish Date - Dec 20 , 2025 | 06:05 AM
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రాం రాం చెప్పేసింది. దాని స్థానంలో గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ .....
ఏపీ స్పీడ్‌కు కొత్త స్కీమ్ బ్రేకులు
ఎంజీ నరేగా స్థానంలో జీ రామ్ జీ
పేరుతోపాటు ప్రయోజనాల్లోనూ మార్పులు
ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు..విభజన తర్వాతా ఏపీకి ఊరటనిచ్చిన స్కీం
గ్రామాలు అభివృద్ధి ‘బాట’లోకి..
సిమెంట్ రోడ్లు, డ్రెయిన్లు, అంగన్వాడీ భవనాలు మినీ గోకులాల రూపంలో శాశ్వత ఆస్తులు
కరువు పనులు దొరకడంతో వలసలు తగ్గుముఖం
12 ఏళ్లలో రూ. 87 వేల కోట్ల ప్రయోజనం
పైసా వాటా లేకుండా రూ.52 వేల కోట్ల వేతనాలు
ఇప్పుడు రాష్ట్ర వాటా 40 శాతం భరించాల్సిందే..
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రాం రాం చెప్పేసింది. దాని స్థానంలో గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ (జీ రామ్ జీ) పథకాన్ని తీసుకొచ్చింది. పేరుతోపాటు అమలు తీరూ మారింది. ఇది ఏపీకి శరాఘాతమే అని నిపుణులు పేర్కొంటున్నారు. ‘ఉపాధి హామీ’లో కేంద్రం నూరు శాతం వేతనాలను భరించేది. ఇప్పుడు అందులో 40 శాతం రాష్ట్రాలు భరించాలని చెప్పడంతో, ఈ పథకం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ పథకం వినియోగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల్లో అత్యంత ఉపయోగకరమైన ఉపాధి హామీ పథకం మన రాష్ట్రానికి కల్పతరువనే చెప్పాలి. మొదట మన రాష్ట్రంలోనే ఉపాధి హామీ పథకాన్ని అనంతపురం జిల్లాలో 20 ఏళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఏటా దేశంలోనే ప్రగతిలో మనమే ముందుంటూ వచ్చాం. ఏటా కేంద్రం విడుదల చేసే ఉపాధి నిధుల్లో సింహభాగం ఆంధ్రప్రదేశ్‌కు చేరుతున్నాయి. దేశ వ్యాప్తంగా ‘ఉపాధి’ అవార్డులు కూడా మన రాష్ట్రమే దక్కించుకుంటోంది. విభజన తర్వాత కేంద్రం నుంచి ఏపీకి మొత్తం మొత్తం రూ.87 వేల కోట్లు ఇప్పటివరకు ఉపాధి నిధులు అందాయి. సిమెంట్ రోడ్లు, డ్రైన్లు, అంగన్‌వాడీ భవనాలు, పంచాయతీ భవనాలు, మినీ గోకులాలు తదితర శాశ్వత ఆస్తులను ఈ నిఽధులతో సమకూర్చారు. ఇందులోంచి.. శ్రామికుల ఖాతాల్లో భత్యాలు జమ చేశారు.
పని.. నాడు హక్కు..
కేంద్రం తెచ్చిన జీ రామ్ జీ చట్టంతో రాష్ట్రాలపై పెనుభారం పడనున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. పాత చట్టంలో.. పనులు అడిగిన శ్రామికులకు వెంటనే పనికల్పించారు. 15 రోజుల్లోపే వేతనాలు అందించారు. ఆలస్యమైతే, ఆ కాలానికి పరిహారంతోపాటు నిరుద్యోగ భృతి అందించారు. తాజా చట్టం నార్మేటివ్ విధానాన్ని తీసుకురానుంది. అంటే, రాష్ట్రాలకు ఇంత బడ్జెట్ అని కేటాయిస్తారు. ఆ బడ్జెట్ పరిమితుల్లోనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందువల్లే ఉపాధి పథకంలో ఏపీకి స్పీడ్‌కు బ్రేకులు పడనున్నాయని అధికారులు చెబుతున్నారు.
పాత చట్టంలో..
శ్రామికుల వేతనాలు నేరుగా కేంద్రం నుంచి వారి ఖాతాల్లో జమ అయ్యేవి. అందుకోసం రాష్ట్ర వాటా చెల్లించాల్సిన అవసరం లేదు. మెటీరియల్ నిధుల విషయంలో కేంద్రం 75శాతం మంజూరుచేస్తే, రాష్ట్రం 25శాతం భరించేది. ఏటా సుమారు రూ.8 వేల కోట్లకు పైగా కేంద్రం నుంచి ఉపాధి నిధులు రాష్ట్రానికి అందుతున్నాయి. ఇందులో మెటీరియల్ నిధుల కోసం మనం వాడే నిధులు రూ.2500 కోట్ల నుంచి రూ.3వేల కోట్ల వరకు ఉంటాయి. అందులో రాష్ట్ర వాటా రూ.600 కోట్ల నుంచి రూ.750 కోట్ల దాకా ఉంటుంది. మిగిలిన రూ.7 వేల కోట్లకు పైగా రాష్ట్రానికి కేంద్ర నిధులందేవి.
ఇక రాం.. రాం..
కొత్త చట్టం ప్రకారం.. మొత్తం రూ.8 వేల కోట్లకు గాను రాష్ట్ర ప్రభుత్వం రూ.3,200కోట్లు తన వాటాగా చెల్లించాల్సి వస్తుంది. దీంతో కేంద్రం నుంచి కేవలం రూ.4,800 కోట్లు మాత్రమే లభిస్తాయి. దీంతో నిధులకు భారీగా గండిపడుతుంది. అంతేకాకుండా ఇంత మొత్తంలో రాష్ట్ర వాటా చెల్లించాల్సిన రావడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా భారీగా నిధులు అడగడానికి సంశయిస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
పెద్ద తంటాగా మారిన ‘వాటా’
గత ఏడేళ్లుగా కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా చెల్లించలేకపోవడం వల్ల పలు పథకాలను సద్వినియోగం చేసుకోలేని దుస్థితిలో ఏపీ ఉంది. జగన్ హయాంలో జల్ జీవన్ మిషన్ విషయంలో ఇదే జరిగింది. దానివల్ల ఈ పథకం ఫలాలు ఐదేళ్లూ సద్వినియోగం చేసుకోలేకపోయాం. కూటమి సర్కారు వచ్చిన తర్వాత కూడా కేంద్ర ప్రాయోజిత పథకాలకు చెల్లించాల్సిన వాటా సమీకరించుకోవడంలో ఆపసోపాలు పడుతోంది. ఈ నేపధ్యంలో ఉపాధి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించి ఈ పథకాన్ని అమలు చేయడం దుర్లభం అవుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
ఎంజీ నరేగా రాకతో..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని (ఎంజీ నరేగా) 2005లో చట్టరూపంలో తెచ్చారు. పనులు కల్పించడంతోపాటుగా ఈ పథకంలో నీటి సంరక్షణ, గ్రామీణ రోడ్లు, భూఅభివృద్ధి, గ్రామాల్లో అన్ని రకాల మౌలిక వసతుల కల్పన చేపట్టారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత పెద్ద గ్రామీణ ఉపాధి పథకంగా ఎంజీ నరేగా పేరుగాంచింది. ఈ పథకం గ్రామాల రూపురేఖలను మార్చేసింది. వ్యక్తిగత ఆస్తులతో పాటు పంచాయతీ ఆస్తుల సమకూర్చడంలో దీని పాత్ర మరువలేనిది.
8 వేల కోట్లు: ఏటా ఏపీలో వినియోగిస్తున్న ఏంజీ నరేగా నిధులు ఇందులో రాష్ట్ర వాటా 700 కోట్లు
87 వేల కోట్లు: విభజన తర్వాత ఇప్పటిదాకా ఖర్చుచేసిన ఉపాధి నిధులు ఇందులో రాష్ట్ర వాటా రూ.8 వేల కోట్లు
52 వేల కోట్లు: గత 12 ఏళ్లలో ఉపాధి శ్రామికులకు చెల్లించిన వేతనాలు
31 వేల కోట్లు: పుష్కర కాలంలో రాష్ట్రానికి అందిన మెటీరియల్ నిధులు
4 వేల కోట్లు: సిబ్బందికి వేతనాలు
262 కోట్లు: గత 12 ఏళ్లలో కల్పించిన పనిదినాలు