Vijayawada Utsav: సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉత్సవాలు..
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:56 PM
విమర్శకుల నోర్లు మూయించేలా తక్కువ సమయంలోనే భారీ ఏర్పాట్లు చేశామని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పున్నమిఘాట్, గొల్లపూడిలో ఎగ్జిబిషన్, తుమ్మలపల్లిలో సంప్రదాయ నృత్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
విజయవాడ: దసరా పర్వదినాన విజయవాడ ఉత్సవ్-2025లో భాగంగా రేపు (గురువారం) కార్నివాల్ నిర్వహిస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. ఈ కార్నివాల్‌కు సీఎం చంద్రబాబు ముఖ్యఅతిథిగా హాజరవుతున్నారని ఆయన తెలిపారు. మూడు వేల మంది కళాకారులతో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ప్రదర్శనలు ఉంటాయని చెప్పుకొచ్చారు ఎంపీ. మైసూరు ఉత్సవాల స్థాయిలో విజయవాడ ఉత్సవాలు నిర్వహించామని స్పష్టం చేశారు. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందని, ఉత్సవాలకు లక్షలాది మంది తరలివచ్చారని వివరించారు.
విమర్శకుల నోర్లు మూయించేలా తక్కువ సమయంలోనే భారీ ఏర్పాట్లు చేశామని కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. పున్నమిఘాట్, గొల్లపూడిలో ఎగ్జిబిషన్, తుమ్మలపల్లిలో సంప్రదాయ నృత్యాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రతిచోటా ప్రజల నుంచి విశేష ఆదరణ వచ్చిందని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ఇంతకంటే రెట్టింపు స్థాయిలో విజయవాడ ఉత్సవాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. మైసూరు ఉత్సవాల తరహాలో అమ్మవారి ఆశీస్సులతో ఉత్సవాలు కొనసాగుతున్నాయని శివనాథ్ వివరించారు.
నిర్మాత సుంకర అనిల్..
అనంతరం విజయవాడ ఉత్సవాలపై నిర్మాత సుంకర అనిల్ మాట్లాడారు. విజయవాడకు ఏదో ఒకటి చేయాలనే ఆలోచన తనకు ఉందని చెప్పుకొచ్చారు. ఉత్సవాలలో తాను భాగస్వామ్యం కావడం చాలా ఆనందంగా ఉందన్నారు. వర్షాలు పడినా.. ప్రజల ఆదరణ మాత్రం తగ్గలేదని తెలిపారు. సినీ, సాంస్కృతిక రాజధానిగా విజయవాడ ఒక వెలుగు వెలిగిందని గుర్తు చేశారు. ఇప్పుడు ఆస్థాయిలో మళ్లీ గత వైభవం తెచ్చేలా విజయవాడ ఉత్సవ్ కార్యక్రమాలు ఉన్నాయని పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవ్ కమిటీ సభ్యులు రాత్రింబవళ్లు కష్టపడి పని చేశారని స్పష్టం చేశారు. నాలుగు ప్రదేశాలలో ఉత్సవాలు జరగడం ఎక్కడా లేదని వివరించారు. అన్ని చోట్లా ప్రజలు తరలివచ్చారని హర్షం వ్యక్తం చేశారు. రేపు సాయంత్రం నిర్వహించే కార్నివాల్ ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముత్తవరపు మురళీ కృష్ణ...
విజయవాడలో చాలా సంవత్సరాలుగా ఎగ్జిబిషన్లు లేవని ఉత్సవ కమిటీ చైర్మన్ ముత్తవరపు మురళీ కృష్ణ తెలిపారు. సినిమాలు తప్ప ప్రజలకు ఎటువంటి ఎంజాయ్‌మెంట్ లేదని పేర్కొన్నారు. అందుకే విజయవాడ వైబ్రంట్ పేరుతో ప్రజల్లో ఉత్సాహం తీసుకురావాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. ప్రభుత్వం, అధికారుల సహకారంతో విజయవాడ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ధీమా వ్యక్తం చేశారు. ఈ ఉత్సవాలతో ప్రజల్లోనూ ఒక వైబ్ వచ్చిందన్నారు. ఈ నేపథ్యంలో కార్నివాల్ విజయవాడలో ఘనంగా నిర్వహించేలా ప్లాన్ చేశామని పేర్కొన్నారు. వేలాది మందితో జరిగే ఈ కార్నివాల్ అద్భుతంగా ఉండబోతుందని మురళీ కృష్ణ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
బిహార్ ఓటర్ల తుది జాబితా విడుదల చేసిన ఈసీ
26/11 దాడుల తర్వాత పాక్‌తో యుద్ధం వద్దని చెప్పిన ఆమెరికా.. చిదంబరం వెల్లడి