Vijayawada Police Alert: బీ కేర్ ఫుల్.. నానో బనానా మాయలో పడొద్దు
ABN , Publish Date - Sep 16 , 2025 | 03:59 PM
నానో బనానా మాయలో పడొద్దంటూ విజయవాడ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ఒక పోస్టర్‌ను సైతం విడుదల చేశారు.
విజయవాడ: నానో బనానా.. ప్రతి ఒక్కరి నోటా ఇప్పుడు ఇదే మాట. ఎవరి మొబైల్‌లో చూసినా.. ఎవరి స్టేటస్‌లు చూసినా ఆ ఫోటోలే దర్శనమిస్తున్నాయి. చూసేందుకు అద్భుతంగా ఉన్నా.. దాని వెనక పెద్ద తతంగమే నడుస్తోంది. ఈ నానో బనానా పేరుతో కొందరు కేటుగాళ్లు దొరికిందే ఛాన్స్ అన్నట్లు ప్రజలను మోసం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బిగ్ అలర్ట్ ప్రకటించారు. నానో బనానా విషయంలో ప్రజలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. ఎన్టీఆర్ కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు ఈ మేరకు ఒక పోస్టర్‌ను సైతం విడుదల చేశారు. సదరు యాప్ పేరుతో వచ్చే లింక్స్ కానీ వాటిని ఉపయోగించి ఫొటోలు, వీడియోలు షేర్ చేసి ఇబ్బందుల్లో పడొద్దంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
గూగుల్ జెమినీ ఇటీవల తీసుకొచ్చిన ఏఐ టూల్ 'నానో బనానా'. ఈ టూల్ ద్వారా నెటిజన్లు తమ ఫొటోలను, వీడియోలను షేర్ చేసి వాటిని కావాల్సిన నమూనాల్లో తయారు చేసుకోవచ్చు. ఈ టూల్ ద్వారా జనరేట్ చేసిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. ఒకరిని చూసి మరొకరు ఈ ఏఐ టూల్ వాడి తమకు నచ్చిన ఫొటోలను, వీడియోలను షేర్ చేసి కొత్తగా జనరేట్ చేసుకుంటున్నారు. అయితే, ఇదే పేరుతో మోసాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సోషల్ మీడియాలో నానో బనానా పేరుతో సైబర్ నేరగాళ్లు లింక్స్ షేర్ చేసి డబ్బు కాజేస్తున్నారని, అలాంటి లింక్స్, యాప్ లోకి వెళ్లి ఫొటోలు, వీడియోలు అప్‌లోడ్ చేయొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయడం గానీ, యాప్స్‌ని ఉపయోగించడం గానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయొద్దని సూచిస్తున్నారు. ఇప్పటికే ఎవరికైనా మీ డేటా ఇచ్చేసి ఉంటే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయవచ్చని లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చని పోలీసులు కోరుతున్నారు.
Also Read:
వైఎస్ వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం..
జగన్ అసెంబ్లీకి రా.. తేల్చుకుందాం..మంత్రి ఆనం స్ట్రాంగ్ సవాల్
For More Latest News