Minister Satya Kumar: పీపీపీ విధానం లక్ష్యం అదే: మంత్రి సత్యకుమార్
ABN , Publish Date - Dec 23 , 2025 | 01:21 PM
సిద్ధార్థ వైద్య కళాశాల వసతిగృహం భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. విద్యార్ధులకు ఉన్నత వైద్య విద్య, ఉత్తమ చికిత్స లక్ష్యంగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వ అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
విజయవాడ, డిసెంబర్ 23: ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల బాలికల నూతన వసతి గృహ నిర్మాణ భవనాన్ని మంత్రి సత్య కుమార్ యాదవ్ (Minister Satyakumar Yadav), ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shivanath) ఈరోజు (మంగళవారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వైద్య కళాశాలలో బాలికల వసతిగృహం నిర్మాణానికి జగన్ రూ. 5 కోట్లు కూడా ఇవ్వలేదని.. నిధులు ఇవ్వని వ్యక్తికి పీపీపీ కళాశాలల గురించి మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. ఈ కళాశాల వసతి గృహం భవనం నిర్మాణం పూర్తి చేయడంలో జగన్ చేతులెత్తేశారని విమర్శించారు.
విద్యార్ధులకు ఉన్నత వైద్య విద్య, ఉత్తమ చికిత్సే లక్ష్యంగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వ అమలు చేస్తోందన్నారు. 80 శాతం పూర్తైన భవన నిర్మాణాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమని మండిపడ్డారు. త్వరలో మొత్తం 5 ఫ్లోర్లను విద్యార్ధులకు అందుబాటులోకి తెస్తామని అన్నారు. సిద్ధార్థ నర్సింగ్ కళాశాల విద్యార్థుల వసతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పష్టం చేశారు.
అందుకే పీపీపీ మోడల్ తెచ్చాం: ఎంపీ

మెడికల్ కాలేజీ హాస్టల్‌కు 2017లోనే రూ.21 కోట్లు నిధులు మంజూరు చేశారని.. గత ప్రభుత్వం నిధులు నిలిపివేయటంతో నిర్మాణ పనులు నిలిచిపోయాయని ఎంపీ కేశినేని శివనాథ్ మండిపడ్డారు. ఎన్డీయే కూటమి ప్రభుత్వం రాగానే మిగిలిన నిధులు మంజురు చేసి నిర్మాణం పూర్తి చేశామని తెలిపారు. హాస్పిటల్‌కు కావలసిన నిధులను చంద్రబాబు, మంత్రి సత్య కుమార్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధులను మంజూరు అయ్యేలా చూస్తామని చెప్పారు. క్యాన్సర్ చికిత్సకు పూర్తి సౌకర్యాలతో ప్రత్యేక ఆసుపత్రి అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. మారుమూల ప్రాంతాల్లోనూ కార్పొరేట్ వైద్యం అందేలా పీపీపీ మోడల్ తెచ్చామని ఎంపీ కేశినేని శివనాథ్ వివరించారు.
కాగా.. ఎంబీబీఎస్ విద్యార్థినులు, సీనియర్ రెసిడెంట్ మహిళా డాక్టర్స్ కోసం నూతన వసతి గృహ నిర్మాణ భవనాన్ని నిర్మించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు యార్లగడ్డ వెంకట్రావు, గద్దె రామ్మోహన్, కలెక్టర్ లక్ష్మీ శా, అడిషనల్ డి. ఏమ్. ఈ వెంకటేష్, సూపరింటెండెంట్ వెంకటేశ్వర రావు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?
ఏపీలో మళ్లీ అదే సక్సెస్ ఫార్ములా.. క్వాంటం, ఏఐపై సీబీఎన్ ప్లాన్ ఇదే
Read Latest AP News And Telugu News