Share News

Chandrababu Quantum Talk: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణుల్లో భారతీయులే అధికం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Dec 23 , 2025 | 11:21 AM

ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్‌గా ఎదిగిందన్నారు.

Chandrababu Quantum Talk: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐటీ నిపుణుల్లో భారతీయులే అధికం: సీఎం చంద్రబాబు
Chandrababu Quantum Talk

అమరావతి, డిసెంబర్ 23: అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ కేంద్రం ఏర్పాటుతో సాంకేతికంగా భారీ ముందడుగు వేస్తున్న ఏపీ ప్రభుత్వం.. ఆ రంగంలో నైపుణ్యాలను పెంచేందుకు కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా విద్యార్థులతో 'క్వాంటమ్ టాక్ బై సీఎం సీబీఎన్' పేరిట నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్వాంటమ్ ప్రోగ్రామ్‌లో వివిధ అంశాలను ప్రజెంటేషన్ ద్వారా విద్యార్ధులకు సీఎం వివరించారు. 25 ఏళ్ల క్రితం ఐటీ విజన్ రూపొందించి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నామని గుర్తుచేశారు. అమెరికాకు సిలికాన్ వ్యాలీ లాగే భారత్ క్వాంటమ్ వ్యాలీగా అమరావతిని తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. విజ్ఞానం భారతీయుల డీఎన్ఏలోనే ఉందని... క్రీస్తు పూర్వం 2500లోనే భారతీయులు అర్బన్ ప్లానింగ్ చేశారని వెల్లడించారు. ఆయుర్వేద, తక్షశిల, నలంద యూనివర్సిటీలు, సిల్క్ రూట్ లాంటి అంశాలను సాధించామన్నారు.


ప్రపంచానికి చాటి చెప్పారు..

గణితంలో జీరోను, అడ్వాన్స్డ్ ఆస్ట్రానమీ లాంటి రంగాల్లో ఎప్పుడో నైపుణ్యాన్ని భారతీయులు సాధించారని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆర్థికంగా బంగారు పిచ్చుక అనే పేరు భారత్‌కు ఉండేదని చెప్పుకొచ్చారు. 2 వేల ఏళ్ల క్రితమే ప్రపంచ జీడీపీలో 40 శాతం భారత్ నుంచే వచ్చేదని.. ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని విద్యార్ధులకు వివరించారు. హరిత విప్లవం, పారిశ్రామిక విప్లవం కంటే టెక్నాలజీ అందిపుచ్చుకుని సేవల రంగంలో విప్లవం సాధించామన్నారు. వైద్యులు, ఇంజనీరింగ్, ఐటీ నిపుణులు ఇతర దేశాలకు వెళ్లి భారతీయుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు. మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా, జీఎస్టీ లాంటి సంస్కరణలతో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే అని.. వారిలోనూ ఏపీ నుంచి వెళ్లిన వారే ఉన్నారని సీఎం పేర్కొన్నారు.


అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా...

ఇప్పుడు మన యువత భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తోందన్నారు. ప్రధాని మోదీ రూపొందించిన వికసిత్ భారత్ లక్ష్యంతో మన దేశం అగ్రశ్రేణి ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతోందని అన్నారు. 30 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా భారత్ తయారవుతోందని తెలిపారు. టెక్నాలజీ, ఇన్ఫ్రా డ్రివెన్ , సస్టెయినబుల్, ఫ్యూచర్ రెడీ ఎకనామీగా భారత్ ఎదుగుతోందన్నారు. ఐటీ విప్లవం అందిపుచ్చుకుని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ నిపుణులను తయారు చేసి ప్రపంచానికి అందించామని అన్నారు. సైబరాబాద్ నిర్మాణం ద్వారా హైదరాబాద్ ఐటీ గ్లోబల్ హబ్‌గా ఎదిగిందన్నారు. సుందర్ పిచాయ్, సత్య నాదెళ్ల, అరవింద్ కృష్ణ లాంటి భారతీయులే గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి దిగ్గజ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు.


గ్లోబల్ హబ్‌గా విశాఖ..

విశాఖలోనూ ఇప్పుడు గూగుల్ అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయబోతోందని సీఎం అన్నారు. గతంలో ఐటీఈఎస్ లాంటి సేవల్ని వివిధ దేశాలకు ఇక్కడి నుంచే అందించామని వివరించారు. విశాఖ ఇప్పుడు డేటా సెంటర్లకు గ్లోబల్ హబ్‌గా మారుతోందని.. ఇక్కడి నుంచే సీ కేబుల్ లాంటి వ్యవస్థ కూడా ఏర్పాటు అవుతోందని తెలిపారు. నాలెడ్జి ఎకానమీ, క్వాంటమ్ వ్యాలీగా అమరావతి ఉంటుందని... తిరుపతి స్పేస్ సిటీగా నిర్మితం అవుతోందని.. అలాగే అనంతపురం, కడప లాంటి ప్రాంతాలు ఎలక్ట్రానిక్స్ ఏరో స్పేస్ కేంద్రాలుగా ఉంటాయని చెప్పుకొచ్చారు. విశాఖ- చెన్నై, చెన్నై - బెంగుళూరు, బెంగుళూరు- హైదరాబాద్ కారిడార్‌లు అతిపెద్ద పారిశ్రామిక కారిడార్లుగా మారుతున్నాయని విద్యార్ధులకు తెలియజేశారు. ఏపీని క్వాంటమ్ తోపాటు గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా మారుస్తున్నామని సీబీఎన్ స్పష్టం చేశారు.


క్వాంటమ్ విప్లవాన్ని అందిపుచ్చుకోండి..

వచ్చే 20 ఏళ్లలో రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఇప్పుడే కార్యరూపం ఇస్తున్నామని తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఓ ఎకో సిస్టమ్‌ను తయారు చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. భారత్‌లో నైపుణ్యాలు ఉన్నప్పటికీ , క్వాంటమ్ రంగంలో మరింత పెట్టుబడుల విస్తృతి పెరగాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా పెద్దఎత్తున ఈ రంగంలో పెట్టుబడులు, నైపుణ్య కల్పన కోసం కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. ఐటీ విప్లవం లాగా ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ విప్లవాన్నీ భారతీయులు అందిపుచ్చుకోవాల్సి ఉందని సూచించారు. వైద్యం, విద్యుత్, సుస్థిర వ్యవసాయం, ఫైనాన్షియల్ మోడలింగ్, మెటీరియల్స్ డిస్కవరీ, వెదర్ ఫోర్ కాస్టింగ్ లాంటి అంశాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ పరిశోధనలు మానవాళికి ఉపకరిస్తాయన్నారు. ఏఐ, క్వాంటమ్, శాటిలైట్, డ్రోన్ లాంటి టెక్నాలజీలతో వివిధ రంగాల్లో సుస్థిరత సాధించే అవకాశం ఉంటుందని వెల్లడించారు. అతి తక్కువ వ్యయంతోనే ప్రజలకు సేవలు అందించవచ్చని... క్వాంటమ్ టెక్నాలజీ ద్వారా పరిశోధనలకు ఆకాశమే హద్దు అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

వరుస బాంబు బెదిరింపులు.. పోలీసులు సీరియస్.. ఏం చేయనున్నారంటే?

ఏపీలో మళ్లీ అదే సక్సెస్ ఫార్ములా.. క్వాంటం, ఏఐపై సీబీఎన్ ప్లాన్ ఇదే

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 23 , 2025 | 12:06 PM