PESA Mahotsav Begins in Vizag: విశాఖలో ప్రారంభమైన పెసా మహోత్సవం
ABN , Publish Date - Dec 23 , 2025 | 08:34 AM
పెసా మహోత్సవాల్లో భాగం విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద రన్ ప్రారంభమైంది. ఈ రన్‌ను కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్ ప్రారంభించారు.
విశాఖపట్నం, డిసెంబర్ 23: విశాఖపట్నం ఆర్కే బీచ్‌లో పెసా మహోత్సవం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పెసా మహోత్సవం రన్‌ను కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ జాయింట్ సెక్రటరీ ముక్తా శేఖర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీ పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ మైలవరపు కృష్ణతేజ, జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులతోపాటు భారీగా ఉద్యోగులు పాల్గొన్నారు. రెండు రోజుల పాటు.. డిసెంబర్ 23, 24 తేదీల్లో జరిగే ఈ పెసా మహోత్సవానికి దేశంలోని 10 రాష్ట్రాల నుంచి 1500 మంది గిరిజన క్రీడాకారులు పాల్గొంటున్నారు. పోర్ట్ స్టేడియంలో కబాడీ ఫైనల్ నిర్వహించనున్నారు. ఖేలో ఇండియా ఆధ్వర్యంలో పది మహిళా, పది పురుష జట్లు ఈ కబడ్డీ పోటీల్లో భాగస్వామ్యం కానున్నాయి. అలాగే ఇండోర్, ఔట్‌డోర్ స్డేడియాల్లో పలు క్రీడల పోటీలతోపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే 200పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు.
లక్ష్యం ఇదే..
1996లో షెడ్యూల్డ్ ప్రాంతాలకు పంచాయతీల విస్తరణ (పెసా) చట్టం తీసుకొచ్చారు. గిరిజన షెడ్యూల్డ్ భూములకు పంచాయతీరాజ్ నిబంధనలు విస్తరించి.. ఆ భూములను సంరక్షించుకునే అధికారాన్ని ఈ చట్టం కల్పిస్తోంది. అందుకోసం ప్రతి ఏటా డిసెంబర్ 23, 24 తేదీల్లో.. పంచాయతీరాజ్, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖలు సంయుక్తంగా ఈ పెసా మహోత్సవాన్ని నిర్వహిస్తాయి.
అవగాహన కోసం..
చట్టంపై అవగాహన పెంచడం, భూమి, సహజ వనరులపై గిరిజనుల హక్కులను కాపాడటంతోపాటు వారి సంప్రదాయాలతోపాటు సంస్కృతిని పరిరక్షించడమే ఈ వేడుకల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం.
గతేడాది..
ఈ ఏడాది విశాఖ వేదికగా ఈ మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. గతేడాది మహారాష్ట్రలో నిర్వహించారు.
ఈ మహోత్సవాల్లో..
సంప్రదాయ క్రీడలు, సాంస్కృతిక వారసత్వం, గిరిజన వంటకాలను ప్రదర్శిస్తారు. అలాగే పెసా పోర్టల్, ఇండికేటర్స్, ట్రైనింగ్ మోడల్స్, ఈ బుక్ అతిథుల చేతుల మీదగా ఆవిష్కరిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభుత్వ పనులకు తక్కువ ధరకే సిమెంట్
కోటి సంతకాలు ప్రజలు చేశారా?: సత్యకుమార్
For More AP News And Telugu News