Deputy CM Pawan Kalyan: గ్రామాల అభివృద్ధికి ఉద్యోగులే కీలకం: పవన్
ABN , Publish Date - Dec 10 , 2025 | 01:52 PM
ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉండే సాధక బాధకాలపై తనకు అవగాహన ఉందని ఆయన చెప్పుకొచ్చారు.
అమరావతి, డిసెంబర్ 10: పల్లె దేశానికి వెన్నెముక కాబట్టే పంచాయతీరాజ్ శాఖను కోరుకున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan) అన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ అధికారులు సిబ్బందితో మాటా మాంతీ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. కొన్ని సందర్భాల్లో నిర్ణయం తీసుకుంటే తప్పు.. తీసుకోకుంటే ఒప్పు అయిన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పుకొచ్చారు. అయినా కూడా తన పని తాను చూసుకుంటూ ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ సీఎంగా తన సొంత తెలివి తేటలు ఏమీ కూడా వాడలేదన్నారు. బలమైన అధికారులు తనతో ఉన్నారని.. రిఫామ్స్ తీసుకువచ్చి పనిచేశారని అన్నారు.
వారికి ఎదుగుదల ఎంతో ముఖ్యం..
వెంకటకృష్ణ, శశిభూషణ్, కృష్ణతేజ వంటి వారు తనతో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు సాధిస్తున్నామని వెల్లడించారు. గతంలో చాలా అంశాల్లో పారదర్శకత లేదని తన దృష్టికి తీసుకు వచ్చారని.. సమీక్షల సమయాల్లో చిన్న చిన్న మార్పులు తీసుకువచ్చి పని చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించామని తెలిపారు. తన తండ్రి ఒక ప్రభుత్వ ఉద్యోగి అని.. తనకు ఉద్యోగులంటే ఎనలేని గౌరవం ఉందని పేర్కొన్నారు. ఇంట్లో, ఆఫీసుల్లో ఉద్యోగులకు ఉండే సాధక బాధకాలపై తనకు అవగాహన ఉందని చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు ఏమి చేయాలని ఆలోచన చేస్తే.. రిఫామ్స్ తేవాలని అధికారులు చెప్పారని అన్నారు. కష్టపడి పని చేసే వారికి ఎదుగుదల ఎంతో ముఖ్యమని భావించి అమలు చేశామని డిప్యూటీ సీఎం అన్నారు.
ఉద్యోగుల ఇబ్బందులు పట్టించుకోలేదు...
గత ప్రభుత్వంలో రోడ్లు, మౌలిక వసతులను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. వారు ఉద్యోగుల ఇబ్బందులను కూడా కనీసం పట్టించుకోలేదన్నారు. తాము ఉద్యోగుల ఇబ్బందులు, గ్రామాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళికలు అమలు చేశామని తెలిపారు. పంచాయతీరాజ్ శాఖలో దాదాపు రెండు లక్ష్లల మంది అవుట్ సోర్సింగ్‌లో ఉన్నారని.. వీరికి పదోన్నతలు ఎలా చేయాలనే అంశంపై మాట్లాడితే వెంకటకృష్ణ వెనెముకలాగా పనిచేశారని తెలిపారు. నేటికీ మన దగ్గర వ్యవస్థలు బలంగా ఉన్నాయంటే వెంకట కృష్ణ, శశిభూషణ్ లాంటి అధికారులు ఉండటమే కారణమని చెప్పారు.
ఉద్యోగుల బాగోగులు కోరుకుంటా...
ఇదంతా ఒక్కరు చేసింది కాదని.. అందరూ సమిష్టిగా అధికారుల సమూహం పని చేయడం ద్వారానే ఈ ఫలితాలు వచ్చాయన్నారు. తాను ఎక్కడా జోక్యం చేసుకోలేదని.. క్లీన్ గవర్నెన్స్ కావాలని మాత్రమే అధికారులకు చెప్పానని తెలిపారు. తన తండ్రి తాలూకా అనుభవం తనకు పని చేసింది కాబట్టే.. సీనియారిటీ, క్యాపబులిటీ చూడాలని మాత్రమే చెప్పానన్నారు. బదిలీలు, పదోన్నతులపై అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా సిఫార్సు లెటర్లు ఇచ్చారని.. అయితే వారు సిఫార్సు చేసిన అధికారికి అర్హత ఉంటేనే చేయాలని స్పష్టంగా చెప్పామన్నారు. ఉమ్మడి ఏపీలో కూడా ఈ విధానం అమలు కాలేదని.. ఈ కూటమి ప్రభుత్వంలోనే సాధ్యం అయ్యిందని పవన్ చెప్పారు. ఉద్యోగి కొడుకుగా... ఉద్యోగుల బాగోగులు కోరుకునే వ్యక్తినని తెలిపారు. నేడు పూర్తి పార్శదర్శకంగా పదోన్నతలు చేశామన్నారు. ఇదే స్పూర్తితో గ్రామాలలో మంచి సేవలు అందించాలని కోరుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ కూడా సంపదను పెంచిన తర్వాత హక్కుల గురించి, జీతాల పెంపు గురించి మాట్లాడాలని ఉద్యోగులకు తెలిపారు. ఆర్థిక వ్యవస్థ గాడిన పడకుండా.. అన్నీ ఒకేసారి చేయలేం అనేది గుర్తించాలని పవన్ అన్నారు.
సీఎం సహకారం వల్లే...
ప్రధాని నరేంద్ర మోడీ సహకారం, సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీలో అనేక సంస్కరణలు తీసుకు వస్తున్నామని.. అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇప్పుడు సంస్కరణల ద్వారా పదోన్నతలు ఎలా వచ్చాయో అందరికీ బాగా తెలుసన్నారు. గ్రూప్ 1 ద్వారా ఎంపీడీఓలు, డీడీలుగా పదోన్నతిని చట్టబద్ధంగా అమలు చేశామని అన్నారు. సీఎం చంద్రబాబు సహకారం వల్లే నేడు ఇంతమందికి పదోన్నతులు కల్పించకలిగామన్నారు. పంచాయతీ కార్యదర్శి పేరును.. పంచాయతీ డెవలప్ మెంట్ ఆఫీసర్‌గా మార్చామని.. 73వ రాజ్యాంగ సూర్తితో గ్రామాలలో డీడీఓ కార్యాలయాలను ప్రారంభించామన్నారు. ఎంపీడీఓ కార్యాలయాల్లో పూర్తిస్థాయి సిబ్బందితో పని చేసేలా చేశామని చెప్పారు.
చూస్తూ ఊరుకోం...
అన్ని స్థాయిల ఉద్యోగులు ఒకే చోట నుంచి పని చేసేలా సౌకర్యాలు కల్పించామన్నారు. మహిళలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేధింపులు రాకుండా చూడాలని సూచించారు. ఉద్యోగులపై దాడి జరిగితే మాత్రం క్షమించేది లేదని.. వారి రక్షణ చాలా ముఖ్యమని స్పష్టం చేశారు. అది ప్రజాప్రతినిధి అయినా, రాజకీయ నేత అయినా చర్యలు తీసుకుంటామని అన్నారు. తన శాఖ పరిధిలో ఉన్న అధికారిని దూషిస్తే.. చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఉద్యోగులు, సిబ్బందికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని పవన్ తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో ఉద్యోగులదే కీలక బాధ్యత అని.. మరింత విస్తృతంగా సేవలు అందించాలని అన్నారు.
ఇవి ఆరంభం మాత్రమే...
ప్రస్తుతం తీసుకు వచ్చిన సంస్కరణలు నేడు ఆరంభం మాత్రమే అని.. ముందు ముందు చట్టబద్ధంగా మరిన్ని సంస్కరణలు చేస్తామని వెల్లడించారు. ‘ప్రతి ఉద్యోగి నా శాఖల్లో నా కుటుంబ సభ్యుడే.. ప్రజలకు సేవలు చేయడం మీ వంతు.. మిమ్మల్ని మంచిగా చూడటం మా బాధ్యత. మీకు ప్రమోషన్లు వస్తే ఎంత ఆనందం చూపారో.. మీ వద్దకు వచ్చే పౌరుడు కూడా మీ సేవలు ద్వారా అంతే ఆనందం పొందాలి. తప్పు చేస్తే నాతో సహా ఎవరైనా శిక్షార్హులే అనేది అందరూ గుర్తుంచుకోండి. పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్‌లో ఉన్న బిల్లులను ఆమోదించాలని కమీషనర్‌ను కోరుతున్నాను’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
సర్పంచ్‌ల నిర్లక్ష్యంపై పవన్ కళ్యాణ్ సీరియస్
18 నెలల తర్వాత.. గుడివాడలో కొడాలి నాని ప్రత్యక్షం
Read Latest AP News And Telugu News