Miss World Beauties: ఏపీలో ప్రపంచ సుందరీమణుల సందడి
ABN , Publish Date - Aug 19 , 2025 | 09:54 PM
గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ప్రపంచ సుందరీమణులు మంగళవారం సందడి చేశారు. తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో గ్రామంలో మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ, మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ పర్యటించారు. డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని సుందరీమణులు దర్శించుకున్నారు.
కృష్ణాజిల్లా గుడివాడ, ఆగస్టు19 (ఆంధ్రజ్యోతి): గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ప్రపంచ సుందరీమణులు ఇవాళ(మంగళవారం) సందడి చేశారు. తెలుగు సంప్రదాయ వస్త్రధారణలో గ్రామంలో మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ (Miss World Opal Suchata Chuyang), మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ (Miss Asia Krishna Gravidj) పర్యటించారు. డోకిపర్రు మహాక్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వర స్వామిని సుందరీమణులు దర్శించుకున్నారు. మంగళ హారతులు ఇచ్చి కుంకుమ బొట్లు పెడుతూ గ్రామస్తులు సుందరీమణులకు స్వాగతం పలికారు. దేవస్థాన ప్రాంగణంలో భారతదేశ సాంప్రదాయ కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు చూసి సుందరీమణులు మురిసిపోయారు.
సుధారెడ్డి సేవా కార్యక్రమాలు ఆదర్శం: ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ
మరోవైపు.. కృష్ణా జిల్లా డోకిపర్రు గ్రామంలో సుధారెడ్డి ఫౌండేషన్ – మెయిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌ను మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ, మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్, సుధారెడ్డి ఫౌండేషన్ అధినేత సుధారెడ్డి ప్రారంభించారు. ముఖ్యఅతిథులుగా మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ, మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ మీడియాతో మాట్లాడారు. గ్రామీణ మహిళల ఆరోగ్య రక్షణ కోసం సుధారెడ్డి చేస్తున్న కార్యక్రమం అభినందనీయమని ప్రశంసించారు. పేద మహిళలకు ఆరోగ్యాన్ని సంరక్షించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని తెలిపారు. మిస్ వరల్డ్ గ్లోబల్ అంబాసిడర్ సుధారెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు తమలాంటి వారికి ఆదర్శనీయమని కొనియాడారు. గ్రామీణ మహిళలు తప్పనిసరిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ సూచించారు.
16 ఏళ్లకే తాను బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డానని ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ తెలిపారు. అవగాహనతో తొలి దశలోనే వైద్యం తీసుకున్నానని దానితో బ్రెస్ట్ క్యాన్సర్‌ను జయించానని ఉద్ఘాటించారు. మహిళల్లో ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పుకొచ్చారు. తొలి దశలోనే గుర్తిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చని తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలకు వస్తుందని సుధారెడ్డి ద్వారా తెలుసుకున్నానని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని వెల్లడించారు. తొలి దశలోనే బ్రెస్ట్ క్యాన్సర్ వ్యాధిని గుర్తించి తగ్గించుకోవచ్చని ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ పేర్కొన్నారు.
మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే సమాజం అభివృద్ధి: కృష్ణా గ్రావిడెజ్
మహిళలు ఆరోగ్యంగా, బలంగా ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని మిస్ ఆసియా కృష్ణా గ్రావిడెజ్ తెలిపారు. క్యాన్సర్ మహమ్మారిని తరిమికొట్టేందుకు మున్ముందు మరిన్ని అవగాహన కార్యక్రమాలు చేపడతామని కృష్ణా గ్రావిడెజ్ చెప్పుకొచ్చారు. ఇటువంటి మంచి కార్యక్రమాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని తెలిపారు. మహిళల్లో ఎక్కువగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహనతో పాటు తొలి దశలోనే చికిత్స అవసరమని చెప్పుకొచ్చారు. SR ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు మెడికల్ సపోర్ట్ ఉండటం చాలా గ్రేట్ అని కృష్ణా గ్రావిడెజ్ పేర్కొన్నారు.
ఈ భూమిలో ఏదో మహత్యం: సుధారెడ్డి
సుధారెడ్డి ఫౌండేషన్ – మెయిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని సుధారెడ్డి ఫౌండేషన్ అధినేత సుధారెడ్డి తెలిపారు. మహిళల్లో క్యాన్సర్ మరణాల పెరుగుతున్న కారణంగా తొలిదశగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ భూమిలో ఏదో మహత్యం ఉందని.. అందుకే ప్రపంచ సుందరి వచ్చి మన మధ్యలో కూర్చొన్నారని తెలిపారు. తాము హైదరాబాద్‌లో ఉన్న తమ మనస్సు అంతా ఇక్కడే ఉంటుందని వెల్లడించారు. ఇక్కడ త్వరలో హాస్పిటల్ కట్టబోతున్నామని చెప్పుకొచ్చారు. ఈ గ్రామానికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని వివరించారు. P4 కింద గుడ్లవల్లేరు మండలాన్ని దత్తత తీసుకున్నామని ఉద్ఘాటించారు. గ్రామంలో ప్రజలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు. వారికి చిన్న సహాయం అందిస్తే తిరిగి వారు కోలుకుంటారని అన్నారు. తాము గ్రామ ప్రజల రుణం తీర్చుకుంటున్నామని సుధారెడ్డి తెలిపారు. బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కలిగించేలా పింక్ పవర్ రన్ 2.0 ఈవెంట్ కార్యక్రమాన్ని ఆగస్టు 28వ తేదీన హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహిస్తామని సుధారెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీకి బిగ్ షాక్... కీలక నేతపై కేసు
నన్ను చంపేందుకు వైసీపీ నేత ప్లాన్ చేశారు: కావ్యా కృష్ణారెడ్డి
Read Latest AP News and National News