MP Kesineni Shivnath: దేశంలోనే చంద్రబాబుది ప్రత్యేక స్థానం: ఎంపీ కేశినేని
ABN , Publish Date - Dec 30 , 2025 | 03:28 PM
ఉమ్మడి ఏపీ, విభజన ఏపీ అబివృద్ధిలో చంద్రబాబు ప్రస్తావన లేకుండా చరిత్ర లేదని ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎంత కోపం ఉన్నా.. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ముఖంలో కనిపించకుండా పని చేసే ఏకైక నేత చంద్రబాబు అని కొనియాడారు.
విజయవాడ, డిసెంబర్ 30: సీఎం చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) చరిత్ర రాయాలంటే ఎన్ని పేజీలు అయినా సరిపోవని ఎంపీ కేశినేని శివనాథ్ (MP Kesineni Shivanath) అన్నారు. మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ 15 ఏళ్ల ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన చంద్రబాబు పేరుతో బాయన శేఖర్ బాబు రాసిన పుస్తకాన్ని ఎంపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎంగా చంద్రబాబు చేసిన సేవలను గుర్తు చేసేలా రాసిన పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు ఆనందంగా ఉందన్నారు. సీఎంగా 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఎంతోమందికి స్పూర్తిదాయకమన్నారు.
అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కూడా ఆయన పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఏపీ, విభజన ఏపీ అబివృద్ధిలో చంద్రబాబు ప్రస్తావన లేకుండా చరిత్ర లేదన్నారు. ఎంత కోపం ఉన్నా.. ఎంత పని ఒత్తిడి ఉన్నా.. ముఖంలో కనిపించకుండా పని చేసే ఏకైక నేత చంద్రబాబు అని కొనియాడారు. చంద్రబాబు జీవితమే పెద్ద చరిత్ర అని.. దేశంలోనే ఆయనది ప్రత్యేక స్థానమని చెప్పుకొచ్చారు. దేశంలో నదుల అనుసంధానం చేయాలని అనేక మంది ప్రధానులు కలలుగంటున్నారని.. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కృష్ణా, గోదావరి నదులను అనుసంధానం చేసి చూపించారని తెలిపారు.
చంద్రబాబు ప్రవేశ పెట్టిన అనేక పథకాలు నేడు కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుని దేశం మొత్తం కూడా అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం అబివృద్ధి చెందాలన్నా, సంక్షేమం ముందుకు వెళ్లాలన్నా చంద్రబాబు వల్లే సాధ్యమని వెల్లడించారు. రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన ఏపీని అన్ని విధాలా గాడిలోపెట్టిన దార్శనికుడు చంద్రబాబు అని అన్నారు. ఆయన బాటలో ఆయనతో కలిసి తామంతా పని చేస్తున్నామని తెలిపారు. చంద్రబాబు గురించి అందరూ తెలుసుకునేలా పుస్తకం రాసిన శేఖర్ బాబుకు ఎంపీ కేశినేని శివనాథ్ ధన్యవాదాలు తెలియజేశారు.
ఇవి కూడా చదవండి...
శ్రీనివాస మంగాపురంలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి
Read Latest AP News And Telugu News