Tirupati Road Accident: దైవదర్శనానికి వెళ్తుండగా ప్రమాదం.. భార్య మృతి
ABN , Publish Date - Dec 30 , 2025 | 11:25 AM
తిరుపతిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరు ప్రయాణిస్తున్న బైక్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.
తిరుపతి, డిసెంబర్ 30: వైకుంఠ ఏకాదశి సందర్భంగా దంపతులు ఆలయానికి బయలుదేరారు. తెల్లవారుజామునే తమ బైక్‌లో ఆలయానికి వెళ్తున్న వారికి ఊహించని ప్రమాదం వెంటాడింది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందింది. తిరుపతిలోని గరుడ వారధి ఫ్లైఓవర్ శ్రీనివాసం సమీపంలో ఈరోజు (మంగళవారం) తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. దైవదర్శనానికి వెళ్తూ ఇలా రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
జీవకోన రాజీవ్ గాంధీ కాలనీకి చెందిన భార్యాభర్తలు ద్విచక్ర వాహనంలో అప్పలాయగుంట దైవదర్శనానికి బయలుదేరారు. ఈ క్రమంలో గరుడ వారధి ఫ్లైఓవర్ శ్రీనివాసం సమీపంలో వీరి బైక్‌ను గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. వెంటనే భార్యా భర్తలు ఇద్దరు కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భార్య అక్కడికక్కడే మృతి చెందింది. భర్తకు తీవ్ర గాయాలు అయ్యాయి.
మృతురాలు డి.చంద్రకళ (40)గా గుర్తించారు. భర్త నాగరాజుకు గాయాలు కావడంతో స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందిన వెంటనే తిరుపతి ఈస్ట్ పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి తరలించారు. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. బైక్‌ను ఢీకొన్న వాహనాన్ని కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
శ్రీవారి ఆలయంలో ముక్కోటి ఏకాదశి శోభ.. స్వామిని దర్శించుకున్న ప్రముఖులు
శ్రీనివాస మంగాపురంలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు
Read Latest AP News And Telugu News