BC Janardhan Criticizes YCP: రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి వర్షాకాలం తర్వాతే..
ABN , Publish Date - Sep 23 , 2025 | 12:08 PM
రాష్ట్రంలో వంతెనలు, రోడ్లపై ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్న అంశం వాస్తవమే అని మంత్రి బీసీ జనార్ధన్ చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ హయాంలో వేసిన రోడ్లు.. తప్ప కొత్తగా వైసీపీ హయాంలో ఆర్ అండ్ బీ రోడ్లు అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
అమరావతి, సెప్టెంబర్ 23: ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా వంతెనల గురించి ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ప్రశ్నించారు. రోడ్లు - వంతెనలకు సంబంధించి సభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, బోడే ప్రసాద్, బండారు సత్యనందరావు, పులపుర్తి రామాంజనేయులు, కామినేని శ్రీనివాస్‌లు లేవనెత్తి సమస్యలపై రాష్ట్ర రోడ్లు , భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి (Minister BC Janardhan Reddy) సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో వంతెనలు, రోడ్లపై ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్న అంశం వాస్తవమే అని చెప్పుకొచ్చారు. గతంలో టీడీపీ హయాంలో వేసిన రోడ్లు తప్ప కొత్తగా వైసీపీ హయాంలో ఆర్ అండ్ బీ రోడ్లు అభివృద్ధి చేయలేదని విమర్శించారు.
వైసీపీ అనుభవరాహిత్యంతో గత 5 ఏళ్లుగా వంతెనలు, రోడ్లు మెయింటెనెన్స్ చేయకపోవడంతో నేడు ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. తమ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే రూ. 1080 కోట్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు గుంతల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దామని వెల్లడించారు. ఎన్డీబీ కింద గత ప్రభుత్వంలో వారు తీసుకున్న రుణాలు రూ. 1980 కోట్లు కట్టలేకపోయారని సభలో తెలిపారు. దీంతో ప్రతీ ఏడాది వేయాల్సిన దాదాపు 2500 కి.మీ రహదారులను అభివృద్ధి చేసే అవకాశం కోల్పోయామన్నారు.
సీఎం సూచన మేరకు పాట్ హోల్స్ పూర్తి చేయడం మాత్రమే కాకుండా, సింగిల్ లేయర్ల రహదారుల అభివృద్ధి చేస్తున్నామన్నారు. వర్షా కాలం పూర్తైన తర్వాత మిగిలిన రహదారులను అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 352 వంతెనలు పునర్ నిర్మాణం కోసం దాదాపు రూ.1430 కోట్లు అవసరమని చెప్పుకొచ్చారు. 16వ ఆర్ధిక సంఘం నిధులతో ఆయా వంతెనలను పునర్ నిర్మించేందుకు కృషి చేస్తున్నామన్నారు. త్వరలోనే రహదారుల అభివృద్ధికి, ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి, వాటిని పూర్తి చేసేందుకు కృషి చేస్తామని మంత్రి బీసీ జానార్ధన్ రెడ్డి సభలో వెల్లడించారు.
ఇవి కూడా చదవండి...
రెండో రోజు దుర్గమ్మ ఏ అలంకారంలో దర్శనమిస్తున్నారంటే
దానిపై వాయిదా తీర్మానం విడ్డూరం.. వైసీపీపై లోకేష్ మండిపాటు
Read Latest AP News And Telugu News