Sharannavaratri 2025: బాలా త్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
ABN , Publish Date - Sep 22 , 2025 | 09:24 AM
వినాయక పూజతో ఉత్సవాలకు ఈవో శీనానాయక్ అంకురార్పణ చేశారు. అమ్మవారి పూజలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు.
విజయవాడ, సెప్టెంబర్ 22: ప్రసిద్ధ పుణ్యక్షేతం ఇందికీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయంలో (Kanaka Durgamma Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. కలెక్టర్ లక్ష్మీశా, సీపీ రాజశేఖర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆలయ అధికారులు అమ్మవారికి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. వినాయక పూజతో ఉత్సవాలకు ఈవో శీనానాయక్ అంకురార్పణ చేశారు. అమ్మవారి పూజలో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ హరిజవహర్ లాల్, కమిషనర్ రామచంద్రమోహన్ పాల్గొన్నారు. అనంతరం బాలత్రిపురసుందరి అలంకరణలో ఉన్న అమ్మవారిని ఆనం, అనిత, సుజనాచౌదరి తొలి దర్శనం చేసుకున్నారు. ఉత్సవాల సందర్భంగా పూజా మందిరం, యాగశాలను మంత్రి ఆనం, సుజనా ప్రారంభించారు. దాత నరసింహరావును మంత్రులు, అధికారులు అభినందించారు.
ఈరోజు (సోమవారం) ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు ఆలయ అధికారులు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. దుర్గమ్మ దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈఏడాది అమ్మవారు 11 అలంకారాల్లో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈనెల 29 మూలా నక్షత్రం రోజున అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆ రోజు అన్ని ప్రోటోకాల్ దర్శనాలను రద్దు చేశారు. మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఆరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుర్గమ్మకు పట్టువస్త్రాలను సమర్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రజలకు దసరా శుభాకాంక్షలు: ఎమ్మెల్యే
మరోవైపు.. దుర్గమ్మను ఎమ్మెల్యే సుజనా చౌదరి దర్శించుకున్నారు. దర్శనానంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ఏర్పాట్లు చాలా బాగా చేశారని కొనియాడారు. శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు 11 రోజులపాటు దుర్గమ్మ భక్తులకు దర్శనం ఇస్తారని తెలిపారు. దసరా ఉత్సవాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని కోరుకున్నానరి.. అందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Navaratri Durga Pooja: దుర్గమ్మ పూజలకు వేళాయె
Vijayawada: ఇంద్రకీలాద్రికి దసరా శోభ
Read Latest AP News And Telugu News