Raghurama Krishnam Raju: 60 రోజులు రాకుంటే అనర్హతే
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:57 AM
గతంలో ఎంపీగా, విపక్ష నాయకుడిగా, సీఎంగా పని చేసిన జగన్‌కు శాసన సభ నిబంధనలు తెలియవా అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
ఈ నిబంధన రాజ్యాంగంలోనే ఉంది
అసెంబ్లీ నియమాలూ చెబుతున్నాయ్
ఈ విషయాలు జగన్‌కు తెలియనివా?
కావాలంటే ఆన్‌లైన్‌లో చూసుకోవచ్చు
డిప్యూటీ స్పీకర్ రఘురామ వ్యాఖ్యలు
ప్రతిపక్ష హోదా చాక్లెట్టో.. బిస్కెట్టో కాదు మారాం చేస్తే ఇవ్వడానికి: మంత్రి అనిత
సభను బహిష్కరిస్తే వేటే: యనమల
కాళ్ల/ఒంగోలు కార్పొరేషన్/కొండపి/తునిరూరల్, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): ‘‘గతంలో ఎంపీగా, విపక్ష నాయకుడిగా, సీఎంగా పని చేసిన జగన్‌కు శాసన సభ నిబంధనలు తెలియవా?.’’ అని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. పశ్చిమగోదావరి జిల్లా పెద అమిరంలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ సభ్యుడు ఎవరైనా సభాపతి అనుమతి తీసుకోకుండా వరుసగా 60 రోజులపాటు సమావేశాలకు హాజరుకాకపోతే ఆ సభ్యుడు అనర్హులవుతారని తెలిపారు. ఈ విషయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 190(4)లో చాలా స్పష్టంగా ఉందన్నారు. అదేవిధంగా అసెంబ్లీ నిబంధనావళిలోని క్లాజ్ 187(2)లో కూడా స్పష్టంగా పేర్కొన్నారని తెలిపారు. అసెంబ్లీ రూల్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, కావాలంటే చూసుకోవచ్చని సూచించారు. వైసీపీ అధ్యక్షుడు, సలహాదారులు, ఎమ్మెల్యేలు ఆ నిబంధనలను పరిశీలిస్తే.. ఎవరు ఎవరిని తప్పుదోవ పట్టిస్తున్నారనేది అర్థం అవుతుందన్నారు. ‘‘సభలో ప్రతిపక్ష సభ్యులకు ఎంత సమయం ఇవ్వాలి.. అనేది ఆయా పార్టీల బలాబలాలను బట్టి ఉంటుంది. సభ జరిగినన్నాళ్లు ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంలో రెండు ప్రశ్నలు వైసీపీ సభ్యులకు వస్తున్నాయి. కానీ, వాళ్లు ఎవరూ సభలో ఉండటం లేదు. సభ్యత, సంస్కారంతో మాట్లాడితే.. సభలో కాస్త ఎక్కువ సమయం ఇచ్చే అవకాశాలు ఉంటాయి.’’ అని తెలిపారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ భాగ్యం పోయింది: అనిత
‘‘వైసీపీ అధినేత జగన్ అడుగుతున్న ప్రతిపక్ష హోదా అనేది చాక్లెట్టో.. బిస్కెట్టో కాదు. చిన్నపిల్లాడిలా మారాం చేయగానే ఇవ్వడానికి. అది ప్రజలు ఇవ్వాలి.’’ అని హోం మంత్రి వంగలపూడి అనిత ఎద్దేవా చేశారు. ఆదివారం ఒంగోలుకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘రాజకీయాల్లో ఎమ్మెల్యే హోదా గొప్ప వరం. అసెంబ్లీలో ఒక్కసారి అయినా అధ్యక్షా అని మాట్లాడాలని ఉంటుంది. జగన్ పుణ్యమా అని వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ భాగ్యం లేకుండా పోయింది. అసెంబ్లీకి రాకుండా బయట ఉండి విమర్శలు చేస్తే ఎలా.’’ అని ఆమె ప్రశ్నించారు. నాడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఒక్కరే అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని, టీడీపీ ఎమ్మెల్యేలంతా సభలో నిలబడి పోరాడారని అనిత గుర్తు చేశారు. జగన్ ప్రస్తుతం పులివెందులకు ఎమ్మెల్యే మాత్రమేనన్నారు. ఆ హోదాలోనే ఆయన అసెంబ్లీలో మాట్లాడాలన్నారు.
విధ్వంస పాలకులు మళ్లీ రాకూడదు
విధ్వంస పాలకులు 30 ఏళ్లపాటు అధికారంలోకి రాకూడదని అనిత అన్నారు. అలాంటి వారు మళ్లీ వస్తే అభివృద్ధిలో రాష్ట్రం వెనుకబడిపోతుందన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా మర్లపాడులో మంత్రి గొట్టిపాటి రవికుమార్, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామితో కలిసి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్, దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు, దివంగత నేత పరిటాల రవి విగ్రహాలను ఆదివారం ఆమె ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వంలో కేసు నమోదు కాని టీడీపీ నాయకుడు, కార్యకర్త లేరని ఆమె తెలిపారు. అలాంటి చీకటి రోజులు మళ్లీ వద్దని, విధ్వంస పాలకులు అధికారంలోకి రాకూడదని అన్నారు.
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి..!
ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన జగన్ అసెంబ్లీని బహిష్కరిస్తాననడం ముమ్మాటికీ అనర్హత పరిధిలోకే వస్తుందని టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడ జిల్లా తునిలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. అనర్హత వేటు నిబంధన ఏమిటంటూ జగన్ అడగటం హాస్యాస్పదమన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 188, 190(4) చదివితే అర్థం అవుతుందని తెలిపారు. ఎమ్మెల్యేలు వరుసగా 60 రోజులపాటు సభకు రాకపోతే వారిపై అనర్హత వేటు వేయవచ్చని యనమల తెలిపారు.