Kondapalli Srinivas: చంద్రబాబు విధానాలే నా విజయానికి కారణం: మంత్రి కొండపల్లి
ABN , Publish Date - Dec 13 , 2025 | 03:29 PM
ఐటీ రంగంలో 16 ఏళ్ళు రాణించానంటే చంద్రబాబు నాయుడు ఆనాడు ఏర్పాటు చేసిన విధానాలే కారణమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. భారత్ వైపు ప్రపంచం చూస్తోందన్నారు.
అమరావతి, డిసెంబర్ 13: ఏ రాష్ట్రంలో లేని విధంగా నూతన పారిశ్రామిక విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Minister Kondapalli Srinivas) అన్నారు. ఏపీ చాంబర్స్ బిజినెస్ ఎక్స్ పోలో మంత్రి మాట్లాడుతూ.. పాతికేళ్ళ క్రితం చంద్రబాబు ఎలా ఆలోచించారో చూశామని.. ఐటీకి భవిష్యత్తు ఉంటుందని, నాటి యువతను ప్రోత్సహించారని గుర్తుచేశారు. అవసరమైన మౌళిక సదుపాయాలను ఆ నాడు ఏర్పాటు చేశారని తెలిపారు. తాను ఐటీ రంగంలో 16 ఏళ్ళు రాణించానంటే చంద్రబాబు నాయుడు ఆనాడు ఏర్పాటు చేసిన విధానాలే కారణమని చెప్పుకొచ్చారు. ప్రతీ ప్రొడక్ట్ కూడా భారత సమాజంలో విక్రయించే అవకాశం ఉంటుందని.. ప్రపంచంలో వాడే ప్రతీ వస్తువు భారత్‌లో వినియోగిస్తారని తెలిపారు.
భారత్ వైపు ప్రపంచం చూస్తోందన్నారు. భారత్‌లో పెట్టుబడులు ఎలా పెట్టాలని.. భారత్ మార్కెట్‌లో ఎలా అడుగు పెట్టాలనే దానిపై ప్రపంచ దేశాలు చూస్తున్నాయని వెల్లడించారు. ఈ మేరకు ఎన్డీఏ ప్రభుత్వం, ప్రధాని పని చేస్తున్నారని అన్నారు. డ్రోన్ టెక్నాలజీ, ఏరో స్పేస్, బయో టెక్నాలజీ ఇలా అనేక రంగాల్లో క్లస్టర్‌లను ఏర్పాటు చేశారని మంత్రి తెలిపారు. చంద్రబాబు నాయుడు పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా పని చేస్తున్నారన్నారు. చిన్న తరహా పరిశ్రమలు అన్నీ ఆ దిశగా అడుగులు వేయాలని.. పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని సూచనలు చేశారు.

పెద్ద పరిశ్రమలు వచ్చే దగ్గర చిన్న తరహా పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయని.. వాటిని చిన్న తరహా పరిశ్రమల పారిశ్రామిక వేత్తలు వినియోగించుకోవాలని సూచించారు. వ్యవసాయ ఉత్పత్తులకు భారత్‌లో మంచి డిమాండ్ ఉందని.. అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా పని చేయాలన్నారు. భారత్‌లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎక్కువగా తయారు అవుతాయని.. వీటికి అంతర్జాతీయ మార్కెట్ కల్పించే దిశగా అడుగులు వేయాలని చెప్పుకొచ్చారు. స్థానిక ఉత్పత్తులను గుర్తించి వాటికి తగ్గట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌కు వెళ్లి.. ఉన్న సమస్యలు అక్కడ వివరిస్తే.. పారిశ్రామిక భవిష్యత్తుకు కావాల్సిన పరిష్కారాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇటువంటి సిద్ధాంతం ప్రపంచంలో జర్మనీలో ఉందన్నారు. విద్యార్ధులను పారిశ్రామిక రంగానికి అనుసంధానం చేసే వ్యవస్థ ఇది అని తెలిపారు. మంత్రి నారా లోకేష్.. ఈ వ్యవస్థను దగ్గర ఉండి మానిటర్ చేస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్‌ను కేటాయించారని చెప్పారు. వెంచర్ క్యాపిటల్ క్రియేట్ చేసి.. మానిటైజ్ చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఏ విధంగా అడుగులు వేస్తుందో తెలుసుకోవాలని అన్నారు.
ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త విధానాన్ని అందరూ వాడుకోవాలని... యువత తమ ఆలోచనలను ఆచరణలో పెట్టాలని అన్నారు. మీ ఐడియాకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కార్యరూపం ఇస్తుందన్నారు. రుణ, మార్కెట్, ప్రాజెక్ట్ తయారీ సహా ఇతర సహకారాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు. మార్కెట్‌ను ఏ విధంగా పెంచుకోవాలనే దానిపై అందరూ కృషి చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
రోజాపై టీడీపీ నగరి నేతల ఫైర్...
పులులు, సింహాలన్నారు.. గ్రామ సింహాలయ్యారు.. కొడాలిపై మంత్రి ఎద్దేవా
Read Latest AP News And Telugu News