Anam Ramanarayana: కర్నూలులో అతిపెద్ద పరిపాలనా భవనం: మంత్రి ఆనం
ABN , Publish Date - Dec 13 , 2025 | 03:14 PM
ఆలయ భూములను పరివేక్షణ చేయడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. పురాతన ఆలయాలను పునర్నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు.
కర్నూలు, డిసెంబర్ 13: విజయవాడ తరువాత కర్నూలులో అతిపెద్ద పరిపాలన భవనం ఏర్పాటు చేశామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నగరంలో ఏపీ దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిపాలన భవన సముదాయాన్ని రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, టీజీ భరత్ ఈరోజు (శనివారం) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దేవాదాయ శాఖలో 95శాతం అమలు చేశామని చెప్పారు. వైదిక, ఆగమ శాస్త్రం ద్వారా ఉత్సవాలు, పూజా కార్యక్రమాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చిందని తెలిపారు.
వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నిర్యాణం రోజును ప్రభుత్వ అధికార కార్యక్రమంగా నిర్ణయించారని అన్నారు. అర్చకులకు కనీస వేతనం కింద రూ.15 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వేద విద్య నేర్చుకున్న వారికి సంభావణ రూపంలో రూ.3 వేలు ఇస్తున్నామన్నారు. టెంపుల్ టూరిజం డెవలప్‌మెంట్ కోసం మంత్రుల కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆలయ భూములను పరివేక్షణ చేయడానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామన్నారు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం రిటైర్డ్ ఐఎస్ఐను నియమించామని అన్నారు. పురాతన ఆలయాలను పునర్నిర్మాణం చేపట్టాలని నిర్ణయించామని.. రూ. 595 కోట్లతో 490 ఆలయాలను పునర్నిర్మాణం చేయబోతున్నామని వెల్లడించారు. 888 జీవో అమలుపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పేర్కొన్నారు.
మా ప్రభుత్వంతోనే సాధ్యం: మంత్రి టీజీ భరత్

గత ప్రభుత్వంలో అన్నీ శంకుస్థాపనలకే పరిమితమయ్యాయని.. కూటమి ప్రభుత్వం వచ్చాక అన్నింటినీ పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తున్నామని మంత్రి టీజీ భరత్ అన్నారు. రూ. 5 కోట్లతో దేవాదాయశాఖ పరిపాలన భవనం ప్రారంభించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నామని చెప్పారు. అభివృద్ధి తమ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వమే కొనసాగితే రాష్ట్రం అభివృద్ధిలో దేశంలో టాప్‌లో ఉంటుందని తెలిపారు. రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి టీజీ భరత్ వెల్లడించారు. కాగా.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గౌరు చరితా రెడ్డి, దస్తగిరి, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ డా.సిరి, శ్రీశైలం ఆలయ ఈవో శ్రీనివాస్ రావు, చైర్మన్ రమేష్ నాయుడు, డైరెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి...
త్వరలోనే లాటరీ విధానంలో ప్లాట్ల కేటాయింపు: మంత్రి నారాయణ
రోజాపై టీడీపీ నగరి నేతల ఫైర్...
Read Latest AP News And Telugu News