AP Assembly: రెండో రోజుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 10:42 AM
గత ప్రభుత్వం అనేక బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రులకు పెట్టారని... దీని వల్ల మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు ఉన్నాయని నజీర్ తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 19: ఏపీ అసెంబ్లీ సమావేశాలు (AP Assemby Session) రెండవ రోజు ప్రారంభమయ్యాయి. సభ మొదలవగానే స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రస్తుతం సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లో బకాయిలపై ఎమ్మెల్యే మహ్మద్ నజీర్ అడిన ప్రశ్నకు మంత్రి సత్యకుమార్ (Minister Satyakumar) సమాధానం ఇచ్చారు. ఆసుపత్రులకు 110 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని.. గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రికి 4 కోట్లు 9 లక్షలు పెండింగ్‌లో ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.
గత ప్రభుత్వం అనేక బకాయిలు ప్రభుత్వ ఆసుపత్రులకు పెట్టారని... దీని వల్ల మెయింటెనెన్స్ కూడా ఇబ్బందులు ఉన్నాయని నజీర్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పేరుతో ప్రభుత్వం మార్కు అని ఒక రెగ్యూలేషన్‌తో 40 శాతం వెనెక్కి తీసుకున్నారన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నిధులు లేక ఎంతో ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకొచ్చారు. వైసీపీ ప్రభుత్వం మార్కు పేరుతో నిధులు డైవర్ట్ చేశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ పేరుతో ప్రైవేటు ఆసుపత్రులకు దారాదత్తం చేశారన్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన నిధులు వాటికే ఉంచాలి అని మంత్రిని కోరుతున్నట్లు మహ్మద్ నజీర్ పేర్కొన్నారు.
మంత్రి సత్య కుమార్ సమాధానం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 457 కోట్లు ప్రభుత్వం చెల్లించిందని తెలిపారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి 20 కోట్లకు పైగా బకాయిలు చెల్లించామన్నారు. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ అని చెపుతున్నారని.. కానీ ఇది నిలిచిపోలేదని అన్నారు. అయితే ఎన్టీఆర్ వైద్యసేవ అని పేరు మారిందని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా 13 లక్షల 42వేల మంది అంటే 90 వేల మంది అధికంగా లబ్ది పొందారన్నారు. 4070 కోట్లు రూపాయలు చెల్లించామని... అంటే 200 కోట్లు ఎక్కువకు పెరిగిందన్నారు. 2023-24 సంవత్సరంలో 45 శాతం పెనాల్టీలు అంటే 3 కోట్ల వరకూ వసూలు చేశారని చెప్పారు. గత ఏడాది నిభందనలు పాటించని ఆసుపత్రుల నుంచి రూ.19 కోట్లకు పైగా వసూలు చేశామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించాలన్నారు. పెద్ద ఆసుపత్రులకు మార్కు లాంటి రెగ్యూలేషన్ తీసేయాలి అని కోరుతున్నామన్నారు. ఈ రెగ్యూలేషన్ తీసేస్తే 4 కోట్లు కాదు 8 కోట్లు వస్తాయని వెల్లడించారు.
ఆరోగ్యశ్రీ అని ఎమ్మెల్యే ప్రశ్న అడిగారని అయితే ఎన్టీఆర్ వైద్య సేవ పేరుతోనే బ్రాండింగ్ జరగుతోందని స్పష్టం చేశారు. గుంటూరులో క్యాన్సర్ సెంటర్‌లో అతి ఖరీదైన ఎక్యూప్‌మెంట్ తీసుకువచ్చామని సభలో తెలిపారు మంత్రి. పూర్వవిద్యార్ధులు రూ.90 కోట్లతో నిర్మించిన బ్లాక్‌లో అన్ని ఎక్యూప్‌మెంట్‌లు ఇస్తున్నామని మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
వాటిపై క్లారిటీ ఇవ్వండి: జ్యోతుల నెహ్రూ
ఎన్టీఆర్ వైద్య సేవపై కొన్ని పత్రికలు తప్పుడు వార్తలు రాస్తున్నాయని.. వాటిపై మంత్రి మరింత క్లారిటీ ఇవ్వాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కోరారు. ప్రైవేటు, నెట్వర్క్ ఆసుపత్రులకు గత ప్రభుత్వం నుంచి రూ.2222 కోట్లు బకాయిలు ఈ ప్రభుత్వానికి వచ్చిందన్నారు. గత సంవత్సరంలో బకాయిలు చెల్లించగా రూ.557 కోట్లు బకాయిలు ఉన్నాయన్నారు. ప్రతిపక్షం అనేక అపోహలను ప్రజల్లో తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
కాంగ్రెస్ సర్కార్‌పై హరీష్ సెటైరికల్ కామెంట్స్
మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు
Read Latest AP News And Telugu News