Share News

MP Mithun Reddy: విజయవాడకు ఎంపీ మిథున్‌రెడ్డి..

ABN , Publish Date - Sep 19 , 2025 | 09:08 AM

ఏసీబీ కోర్టు ఆదేశాలు నేపథ్యంలో వైసీపీ ఎంపీ పి. మిథున్ రెడ్డిని శుక్రవరం సిట్ అధికారులు విజయవాడకు తరలించారు. రెండు రోజులపాటు ఆయన్ని విజయవాడలో ఉంచనున్నారు.

MP Mithun Reddy: విజయవాడకు ఎంపీ మిథున్‌రెడ్డి..
YCP MP Mithun Reddy

రాజమండ్రి, సెప్టెంబర్19: లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని పోలీస్ కస్టడీకి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి శుక్రవారం ఉదయం విజయవాడకు సిట్ అధికారులు తరలించారు. సెప్టెంబర్ 19, 20 తేదీల్లో.. రెండు రోజుల పాటు ఆయన్ని సిట్ అధికారులు విచారించనున్నారు. లిక్కర్ స్కాంలో ఏ4గా ఉన్న మిథున్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


అయితే ఈ కేసులో మిథున్ రెడ్డిని ఐదు రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం విచారణ జరిపిన ఏసీబీ కోర్టు.. రెండు రోజుల పాటు ఆయన్ని పోలీసుల కస్టడీకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఈ నేపథ్యంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని శుక్రవారం ఉదయం విజయవాడకు తీసుకు వెళ్లారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు ఎంపీ మిథున్ రెడ్డిని విచారించేందుకు ఏసీబీ కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.


జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ఇప్పటికే పలువురిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో రూ. 3, 500 కోట్ల మేర స్కాం జరిగినట్లు సిట్ అధికారులు నిగ్గు తేల్చారు. ఈ కేసుకు సంబంధించిన ఇప్పటికే పలువురు నిందితులు.. ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు అరెస్ట్ అయి.. బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఇదే కేసులో ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టయ్యారు.


అనంతరం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. మిథున్ రెడ్డి సైతం బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. అయితే ఈ కేసులో ఏ4వ గా ఉన్న మిథున్ రెడ్డిని విచారించాలని.. ఈ నేపథ్యంలో తమకు అప్పగించాలంటూ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో రెండు రోజుల పాటు మిథున్ రెడ్డిని పోలీసుల కస్టడీకి ఇస్తూ..కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.


మరోవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో హైదరాబాద్‌ శంషాబాద్‌లో భారీగా నగదును సిట్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. వీటిని సైతం ప్రభుత్వం జప్తు చేసింది. ఇంకోవైపు ఈ స్కాం దర్యాప్తు చేసేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ అయింది.


ఆ క్రమంలో చెన్నై, హైదరాబాద్, న్యూఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు గురువారం ముమ్మర దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజ్ కసిరెడ్డికి చెందిన ఆస్తులు, నగదు స్వాధీనానికి సంబంధించిన అంశాల గురించి సిట్‌ అధికారులను ఈడీ ఆరా తీసినట్లు సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యం.. వ్యక్తమవుతున్న నిరసనలు

మారిన ఆరుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్‌ నోటీసులు

For More AP News And Telugu News

Updated Date - Sep 19 , 2025 | 09:20 AM