AP Assembly Staff: ఏపీ అసెంబ్లీ సిబ్బంది నిర్లక్ష్యం.. వ్యక్తమవుతున్న నిరసనలు
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:56 AM
కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర దాటింది. ఈ ప్రభుత్వం పలు పథకాలు ప్రవేశపెట్టింది. అంతేకాకుండా వివిద పథకాలు పేర్లను సైతం మార్చింది. కానీ ఈ విషయాన్ని ఏపీ అసెంబ్లీ సిబ్బంది మాత్రం గుర్తించ లేదు. దీంతో అసెంబ్లీ సిబ్బంది వైఖరిపై సర్వత్ర నిరసన వ్యక్తమవుతోంది.
అమరావతి, సెప్టెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సిబ్బంది వ్యవహార శైలిపై సర్వత్రా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాదిన్నర దాటినా.. గత ప్రభుత్వం ప్రభావం వారిని ఇంకా వీడినట్లు లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు గురువారం అంటే.. సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమైనాయి. అసెంబ్లీ వేదికగా ప్రశ్నోత్తరాలు జరుగుతున్నాయి. అయితే ఈ సమయంలో.. వైసీపీ ప్రభుత్వ హయాంలోని పథకాల పేర్లే ప్రస్తావిస్తూ ఈ కార్యక్రమం కొనసాగుతోంది. దీంతో పలువురు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
జగన్ ప్రభుత్వంలో డా. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీగా అమలు చేసిన పథకం పేరును.. కూటమి ప్రభుత్వం డా. ఎన్టీఆర్ వైద్య సేవగా మార్చిన విషయం విదితమే. కానీ ఈ విషయాన్ని అసెంబ్లీ సచివాలయం ఇంకా గుర్తించకపోవడం గమనార్హం. ఈ రోజు జరిగే శాసనసభ ప్రశ్నోత్తరాలలో రెండు ప్రశ్నల్లో ‘ఆరోగ్యశ్రీ’ అంటూ ప్రస్తావన చేస్తూ అసెంబ్లీ సిబ్బంది పోస్ట్ చేశారు. అదీకాక పదే పదే ‘ఆరోగ్యశ్రీ’ అనే పదాన్ని వాడుతున్నారు. ప్రభుత్వం మారి చాలా కాలం అయినా.. ఇంకా అసెంబ్లీ సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేందుకు ఇదో ఉదాహరణ అనే ఒక చర్చ అయితే సాగుతోంది.
మరోవైపు అసెంబ్లీ వర్ష కాల సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. అదే రోజు.. అసెంబ్లీ లాబీల్లో మార్షల్స్ అతి ప్రవర్తనపై రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చాంబర్ నుంచి మంత్రి లోకేష్ బయటకు వస్తున్న సమయంలో.. లాబీల్లో ఇతరులను తప్పుకోండి.. తప్పుకోండంటూ మార్షల్స్ హడావుడి చేశారు. దీంతో మంత్రి నారా లోకేశ్ వెంటనే స్పందించారు. సభ్యుల వ్యవహారాల్లో మీకేం పని అంటూ వారిని మంత్రి లోకేష్ ప్రశ్నించారు. ఇంకా తాడేపల్లి ప్యాలెస్ పాలనలో ఉన్నామనుకుంటున్నారా? అంటూ వారికి చురకలు అంటించారు. బయటి వ్యక్తులు లోపలకు రాకుండా చూసుకోవాలి అంతే కానీ.. ఎమ్మెల్యేల వ్యవహారంలో జోక్యం చేసుకో వద్దంటూ మార్షల్స్‌కు మంత్రి నారా లోకేష్ హితవు పలికారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టండి
For More AP News And Telugu News