Deputy CM Pawan Kalyan: అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టండి
ABN , Publish Date - Sep 19 , 2025 | 07:36 AM
అసెంబ్లీలో సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పనులుపై కూడా చర్చించాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
మీ నియోజకవర్గాల్లో సమస్యలపై నివేదిక ఇవ్వండి
శాంతిభద్రతలు, సోషల్ మీడియాపైనా చర్చించండి
3 రోజుల్లో మళ్లీ కలుద్దాం
నేరుగా మంత్రులతోనే మాట్లాడదాం
ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం పవన్
అమరావతి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో సంక్షేమంతో పాటు నియోజకవర్గ అభివృద్ధి పనులుపై కూడా చర్చించాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం జనసేన శాసన సభపక్ష కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యేలతో ఆయన సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ‘ఎమ్మెల్యేలంతా సభలో జరిగే చర్చల్లో కచ్చితంగా పాల్గొనాలి. సమస్యలను సభ దృష్టికి తీసుకురావాలి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు మనం చేయవద్దు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేపడితేనే ప్రజలు మళ్లీ చాన్స్ ఇస్తారు. కాబట్టి ఎమ్మెల్యేలు అన్ని అంశాలపై అవగాహన కల్పించుకుని సభలో జరిగే చర్చల్లో పాల్గొనాలి. రాష్ట్రంలో గంజాయి, ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదు. శాంతిభద్రతల సమస్యా ఉంది. దీనిపై సభలో చర్చించండి. సోషల్ మీడియాలో విచ్చలవిడిగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ చేస్తున్న వ్యాఖ్యలు అందరికీ ఇబ్బందికరంగానే తయారయ్యాయి. ఈ అంశంపై సీరియ్‌సగా స్పందించాలి’ అని పవన్ సూచించారు.మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పలు సూచనలు చేశారు.
ఎమ్మెల్యేలతో ముఖాముఖి...
సమావేశం అనంతరం ఒక్కొక్క ఎమ్మెల్యేతో పవన్ వ్యక్తిగతంగా మాట్లాడారు. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు ఏమిటి? వాటి పరిష్కారానికి తీసుకున్న చర్యలు ఏమిటి? జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి అధికారులతో సంబంధాలు ఎలా ఉన్నాయి? వారి నుంచి అందుతున్న సహకారం .. తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ సమగ్ర చిత్రాన్ని రెండు రోజుల్లో రాతపూర్వకంగా ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా మరోసారి సమావేశం నిర్వహిస్తామని వారికి స్పష్టం చేశారు. ఈలోగా తమ చేతికి వచ్చిన నివేదికల ఆధారంగా మంత్రులతో నేరుగా మాట్లాడతామని చెప్పారు. సమస్య పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితిని నిర్ణయిస్తామని తెలిపారు.
తొలిసారి మండలికి నాగబాబు
మండలి సభ్యుడిగా నాగబాబు తొలిసారి హాజరయ్యారు. గురువారం ఉదయం అసెంబ్లీకి వచ్చిన ఆయన తొలుత జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. తొలిసారి మండలిలోకి అడుగుపెడుతున్న అన్నయ్యను పవన్ కల్యాణ్ అలింగనం చేసుకుని అభినందనలు తెలిపారు. నాగబాబు రాకతో మండలిలో ఆ పార్టీ సభ్యుల సంఖ్య రెండుకు పెరిగింది. ఇప్పటికే మండలిలో ఉన్న పిడుగు హరిప్రసాద్ పదవీ కాలం మార్చి 2027 వరకూ ఉండగా... నాగబాబు 2031 మార్చి వరకూ ఎమ్మెల్సీగా కొనసాగుతారు.