Share News

YSRCP Medical Scam: మెడికల్ స్కాం.. వైసీపీ కీలక నేత దందాలు వెలుగులోకి..

ABN , Publish Date - Jul 04 , 2025 | 09:35 AM

కదిరి వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మెడికల్ కళాశాలల అనుమతుల కోసం లంచం తీసుకోవడంపై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. వారం రోజుల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హరిప్రసాద్ ఇంట్లో బెంగళూరు సీబీఐ బృందం సోదాలు నిర్వహించారు.

YSRCP  Medical Scam: మెడికల్ స్కాం..  వైసీపీ కీలక నేత దందాలు వెలుగులోకి..
Medical College Scam

శ్రీ సత్యసాయి జిల్లా: కదిరి వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్‌ (YSRCP Leader Bathala Hariprasad) మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. మెడికల్ కళాశాలల అనుమతుల కోసం లంచం తీసుకోవడంపై సీబీఐ ఇప్పటికే కేసు నమోదు చేసింది. వారం రోజుల క్రితం కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలోని హరిప్రసాద్ ఇంట్లో బెంగళూరు సీబీఐ బృందం సోదాలు నిర్వహించింది. సీబీఐ దర్యాప్తులో హరిప్రసాద్ దందాలు వెలుగులోకి వచ్చాయి. మెడికల్ కళాశాల తనిఖీలకు వచ్చిన వారికి లంచం ఎర చూపినట్లు హరి ప్రసాద్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. అయితే.. హరిప్రసాద్‌కి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైసీపీ బీసీ సెల్ ఏపీ ఉపాధ్యక్షుడిగా హరిప్రసాద్ కొనసాగుతున్నారు. 2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి హరిప్రసాద్ టికెట్‌‌ని ఆశించాడు. హైదరాబాద్‌లో ఓ హాస్పిటల్‌ని హరిప్రసాద్ కుటుంబ సభ్యులు నడుపుతున్నారు.


హైదరాబాద్ శ్రీనగర్ కాలనీకి చెందిన డాక్టర్ అంకం రవిబాబు, విశాఖపట్నం అక్కయ్యపాలెం చెందిన డాక్టర్ కృష్ణ కిషోర్‌లతో కలిసి మెడికల్ కళాశాల నుంచి లంచాలు వసూలు చేసి ఎన్ఎంసీ సభ్యుడు డాక్టర్ వీరేంద్ర కుమార్ పంపినట్లు సీబీఐ దర్యాప్తులో బట్టబయలైంది. పలు ప్రైవేట్ వైద్య కళాశాలలకు కన్సల్‌టెంట్‌గా వ్యవహారిస్తూ తనిఖీలకు వచ్చిన సమయంలో డమ్మీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయడంలో బత్తల హరిప్రసాద్ కీలకపాత్ర పోషించాడని సీబీఐ అధికారులు గుర్తించారు.


ఎన్ఎంసీ లైసెన్స్ పునరుద్ధరణ కోసం లేఖలు తేవడం, లంచాలు వసూల్ చేయడంలో బత్తల హరిప్రసాద్ కీలకపాత్ర పోషించినట్లు సీబీఐ గుర్తించింది. విశాఖపట్నంలోని గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ వెంకట్ నుంచి రూ.50 లక్షలు వసూల్ చేసి ఆ మొత్తాన్ని డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా హవాలా రూపంలో ఢిల్లీకి హరి ప్రసాద్ పంపించినట్లు తెలుస్తోంది. ఇదే కేసుకు సంబంధించి గతంలో చత్తీస్‌గడ్‌లోని శ్రీ రావత్ పుర మెడికల్ కాలేజీకి చెందిన ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు మధ్యవర్తులు లంచం తీసుకుంటుండగా సీబీఐ అధికారులు పట్టుకున్నారు. ఈ కుంభకోణానికి సంబంధించి ఇప్పటివరకు కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ , ఉత్తరప్రదేశ్ , చత్తీస్‌గడ్, తెలంగాణ, ఏపీలోని 40 చోట్ల సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించారు.


ఈ స్కామ్‌లో ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర..

కాగా.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కామ్‌లో ఫాదర్ కొలంబో మెడికల్ హాస్పిటల్ పాత్ర ఉందని సీబీఐ అధికారులు గుర్తించారు. వరంగల్‌కు చెందిన ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ కొమిరెడ్డి జోసఫ్‌పై సీబీఐ అధికారులు కేసు నమోదు చేశారు. మెడికల్ కాలేజ్‌ల తనిఖీల కోసం పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు కొమిరెడ్డి జోసఫ్‌‌పై ఆరోపణలు వచ్చాయి. మెడికల్ కాలే‌జ్‌లను తనిఖీలు చేసి అనుకూలంగా నివేదికలు ఇచ్చేందుకు లంచాలు ఇచ్చినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ స్కాంలో 36 మందిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన డాక్టర్ల పాత్రపై కూడా కేసు నమోదైంది. కర్ణాటక ,రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గడ్ మెడికల్ కాలేజ్‌ల తనిఖీల్లో అక్రమాలు జరిగినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.


ఛత్తీస్‌గడ్‌కి చెందిన శ్రీ రావత్పూర్ సర్కార్ మెడికల్ కాలేజ్ డాక్టర్లు, బ్రోకర్లు మధ్యవర్తులుగా ఉన్నట్లు కనుక్కున్నారు. మెడికల్ కాలేజీలో తనిఖీలు చేసి డబ్బులు తీసుకున్నట్లుగా కొమిరెడ్డి జోసఫ్‌పై ఆరోపణలు వచ్చాయి. రెండు దఫాలుగా మెడికల్ కాలేజ్‌ల మధ్యవర్తి నుంచి కొమ్మిరెడ్డికి డబ్బులు వచ్చినట్లు సీబీఐ అధికారుల విచారణలో తేలింది. విశాఖపట్నం గాయత్రి మెడికల్ కాలేజ్ డైరెక్టర్ నుంచి రూ.50 లక్షల వసూల్ చేసినట్లు సమాచారం. డాక్టర్ కృష్ణ కిషోర్ ద్వారా ఢిల్లీకి హవాలా రూపంలో డబ్బులు తరలించినట్లు తెలుస్తోంది. మెడికల్ కాలేజ్‌లో క్లియరెన్స్ కోసం ఫాదర్ కొలంబో కాలేజ్‌కి రెండు విడతలుగా డబ్బులు వచ్చినట్లు సీబీఐ అధికారులు చెబుతున్నారు. కొలంబో మెడికల్ కాలేజ్ చైర్మన్ జోసఫ్ కొమిరెడ్డికి బ్రోకర్లు రూ. 60 లక్షలు ముట్టజెప్పారని సీబీఐ అధికారులు గుర్తించారు.


ఇవి కూడా చదవండి:

కాకాణికి మరో షాక్‌

శాంతి నారాయణకు తెలుగు వర్సిటీ పురస్కారం

For More AP News and Telugu News

Updated Date - Jul 04 , 2025 | 11:03 AM