Share News

Illegal Registration: ప్రభుత్వ భూముల మాయం.. ప్రేక్షకపాత్రలో రిజిస్ట్రేషన్‌ సిబ్బంది..!

ABN , Publish Date - Dec 18 , 2025 | 08:23 AM

రాయచోటి జిల్లా కేంద్రం ఏర్పడిన కొంతకాలం రియల్‌ ఎస్టేట్‌ బాగానే నడిచింది. దాదాపు రెండు సంవత్సరాలుగా రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా పడిపోయి రిజిస్ట్రేషన్లు నత్తనడకన సాగుతున్న పరిస్థితి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఉంది.

Illegal Registration: ప్రభుత్వ భూముల మాయం.. ప్రేక్షకపాత్రలో రిజిస్ట్రేషన్‌ సిబ్బంది..!
Illegal Grama Kantha Registration

  • గ్రామ కంఠాలే ఆదాయ వనరులు

  • ఆస్తిని బట్టి రేట్‌ ఫిక్స్‌ చేస్తారు

  • వసూళ్ల బాధ్యత రైటర్లదే

  • ప్రేక్షకపాత్రలో రిజిస్ట్రేషన్‌ సిబ్బంది

రాయచోటి(కలెక్టరేట్‌), డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాయచోటి (Rayachoti) జిల్లా కేంద్రం ఏర్పడిన కొంతకాలం రియల్‌ ఎస్టేట్‌ (Real Estate) బాగానే నడిచింది. దాదాపు రెండు సంవత్సరాలుగా రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా పడిపోయి రిజిస్ట్రేషన్లు నత్తనడకన సాగుతున్న పరిస్థితి సబ్‌రిజిస్టర్‌ కార్యాలయంలో ఉంది. అయితే ఇదే అదునుగా చేసుకున్న కొంతమంది డాక్యుమెంట్‌ రైటర్లు గ్రామ కంఠాలను రిజిస్ట్రేషన్లకు తెరలేపారు. ఎకరాకు, రెండెకరాలకు రేట్లు ఫిక్స్‌ చేసి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు గ్రామానికి ఎంతో కొంత ప్రజల అవసరాల మేరకు గ్రామకంఠాలుగా కొంత భూమిని మిగిల్చి అందులో గడ్డివాములు, శ్మశానాలు, దిబ్బలు, పశువుల చావిడికి ఉపయోగించేవారు.


ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ పూర్తిగా పడిపోవడంతో రాయచోటి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల్లో రెవెన్యూ రికార్డుల్లో గ్రామ కంఠాలు అని కనిపిస్తే చాలు రిజిస్ట్రేషన్‌ చేయడానికి రాయచోటి సబ్‌ రిజిస్టర్‌ కార్యాలయం వారు ఇష్టానుసారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారని ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. ఇందుకోసం బ్రోకర్లు, కార్యాలయంలో ఉన్న ప్రైవేటు వ్యక్తులను వాడుకుంటున్నారని ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి, అక్రమాలు పునరావృత్తం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు ఉన్నప్పటికీ ఇక్కడ మాత్రం అవేవీ కనుచూపు మేర కనిపించడం లేదు. 2006-07 సంవత్సరాల్లో రాయచోటి చుట్టుప్రక్కల దాదాపు 500 ఎకరాల ప్రభుత్వ భూములు ఉండేవి. 2025 వచ్చే సరికి అవి కాస్త 50- 70 ఎకరాలకు కరిగిపోయాయి.


అధికారుల పర్యవేక్షణా లోపం

2022లో జిల్లా ఏర్పాటైన తర్వాత చిత్తూరు జిల్లా డీఆర్‌ను అన్నమయ్య జిల్లా డీఆర్‌గా బదిలీ చేశారు. ఆయన దాదాపు మూడు సంవత్సరాల పాటు ఇక్కడ సేవలందించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన తిరిగి చిత్తూరు జిల్లాకు బదిలీపై వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇన్‌చార్జి డీఆర్‌ను ప్రభుత్వం నియమించింది. అయితే ఆయన రాయచోటి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వైపు కన్నెత్తి చూడలేదని ఆరోపణలు బలంగానే ఉన్నాయి. డీఆర్‌ ఆఫీసులోను ఒక్కొక్క ఉద్యోగికి పూర్తి బాధ్యతలు అప్పగించి కాలం వెల్లదీస్తున్నారని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలోని సిబ్బంది చెబుతున్నారు. జిల్లా ఏర్పడిన తర్వాత రాయచోటి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని ఆరోపణలు కూడా బలంగానే ఉన్నాయి.


ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రికార్డులు

ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు దాచుకునేందుకు బ్యాంకులు ఎలా ఉపయోగపడతాయో సంపాదించుకున్న ఆస్తులు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో సక్రమంగా ఉండేలా చూసుకోవాల్సిన బాద్యత అధికారులపై ఉంటుంది. ఇలాంటి బాధ్యతలు పక్కన పెట్టి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో విలువైన పత్రాలు పెట్టి చోద్యం చూస్తున్న అధికారులు చాలా మంది ఉన్నారు. అందులో రాయచోటి సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం వారికి మొదటి స్థానం ఇవ్వక తప్పదు. ఏదో ఒక అధికారి పేరు, ఏదో ఒక నాయకుడి పేరు చెప్పి కార్యాలయం చుట్టూ తిరుగుతున్న ప్రైవేటు వ్యక్తులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని వాదనలు బలంగా ఉన్నాయి.


గతంలో చేశారేమో...

రాయచోటిలో గత ఏడాది నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాలు పూర్తిగా పడిపోయినందు వల్ల రిజిస్ట్రేషన్స్‌ కూడా చాలా తక్కువగా జరుగుతున్నాయి. గ్రామకంఠాలు రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని గతంలో చేశారేమో నేనైతే చేయడం లేదు. మాకు కంప్యూటర్‌ ఆపరేటర్లు సరైన వాళ్లు లేక ప్రైవేటు వ్యక్తులతో పనిచేయించుకుంటున్నాము. వాళ్ల చేతుల్లోకి రికార్డులు ఇచ్చామనే మాట అవాస్తవం. నేను వచ్చిన తర్వాత ఆఫీసును దాదాపు గాడిలో పెట్టగలిగాను.

- రమేశ్‌బాబు, సబ్‌ రిజిస్ట్రార్, రాయచోటి


ఈ వార్తలు కూడా చదవండి..

ఆధునాతనంగా మోడల్ పోలీస్‌స్టేషన్‌ల నిర్మాణం: హోంమంత్రి అనిత

ముగిసిన భవానీ దీక్షలు.. ఎంతమంది దర్శించుకున్నారంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Dec 18 , 2025 | 08:45 AM