AP Assembly Sessions: ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలే లక్ష్యం...
ABN , Publish Date - Sep 22 , 2025 | 12:00 PM
ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. యువగలం పాదయాత్ర సందర్భంగా టీచర్లు ఈ సమస్య తన దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రాథమిక పాఠశాలల్ని, ప్రాథమికోన్నత పాఠశాలలో విలీనంపై నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రశ్నను అడిగారు. ఐదేళ్ల వైసీపీ హయాంలో చాలా ప్రైమరీ స్కూళ్లను అప్పర్ ప్రైమరీ స్కూళ్లలో విలీనం చేశారని ఆయన తెలిపారు. విలీనం వల్ల పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో 117 వల్ల చిన్న పిల్లలు విద్యకు దూరం అయ్యారని పేర్కొన్నారు. దీన్ని సానుకూలంగా పరిష్కరించాలని మంత్రి లోకేశ్‌ను కోరుతున్నట్లు వివరించారు.
ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ సమాధానం ఇచ్చారు. యువగలం పాదయాత్ర సందర్భంగా టీచర్లు ఈ సమస్య తన దృష్టికి తెచ్చారని గుర్తు చేశారు. ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలని అనేది తమ లక్ష్యమని పేర్కొన్నారు. మన బడి - మన భవిష్యత్తు కింద విద్యార్థుల సంఖ్య ఆధారంగా టీచర్ల నియామకం, గదుల నిర్మాణం చేపడుతున్నట్లు ఆయన వివరించారు. పాఠశాల భవన నిర్మాణాల కోసం దాతల సహకారం కోరుతున్నట్లు చెప్పారు. భవనాలపై దాతల పేర్లు ఉండేలా చూస్తామని చెప్పుకొచ్చారు.
ప్రభుత్వ పాఠశాలల్లో మంచి ఫలితాలు రావాలనేదే తన లక్ష్యమని ఉద్ఘాటించారు. ప్రభుత్వ బడుల్లో సీట్లు నిండి నో అడ్మిషన్ బోర్డులు పెట్టాలని తన ఉద్దేశమని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో వంద బడుల్లో అలాంటి పరిస్థితి ఉందని హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే వీలిన సమస్యకు పరిష్కారం చూపుతామని ఎమ్మెల్యే అరవిందబాబుకు మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
జమ్ము సరిహద్దులో పాకిస్తాన్ డ్రోన్ కదలికలు..బీఎస్ఎఫ్ గాలింపు చర్యలు