CM ChandraBabu: పార్టీని అలా వదిలేస్తే అందరం మునుగుతాం
ABN , Publish Date - Feb 28 , 2025 | 03:08 PM
CM Chandra Babu: నాయకుల పని తీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు చెప్పారు. పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని వదిలేస్తే అందరం మునుగుతామని సీఎం చంద్రబాబు నాయడు హెచ్చరించారు.
అమరావతి: ఆర్థిక కష్టాలు ఉన్నా జాగ్రత్తగా ముందుకు వెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు. పార్టీని ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. ఇవాళ(శుక్రవారం) ఏపీ అసెంబ్లీ కమిటీ హాల్లో టీడీఎల్పీ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలసేపు ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో పార్టీ కేడర్‌కు చంద్రబాబు కీలక సూచనలు చేశారు. ఈ భేటీకి టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... రాబోయే ఎన్నికల్లో మళ్లీ గెలిచి రావాలనే పట్టుదలతో ఈ రోజు నుంచే కష్టపడి పని చేయాలని కేడర్‌కు సీఎం చంద్రబాబు సూచించారు.
రాబోయే ఎన్నికల్లో మీరందరూ మళ్లీ గెలవాలని అన్నారు. నాయకుల పని తీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పిస్తున్నానని చెప్పారు. తాను త్వరలో నేతలు, కార్యకర్తలను పిలిపించి ప్రత్యేకంగా మాట్లాడుతానని అన్నారు. కేడర్ పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సూచించారు. పార్టీని అలా వదిలేస్తే అందరం మునుగుతామని హెచ్చరించారు. అందుకనే పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టి పెట్టాలని చెప్పారు. అందరినీ కలుపుకొని వెళ్తేనే ముందుకెళ్లగలుగుతామని అన్నారు. దెబ్బతిన్న రోడ్లను రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నియోజకవర్గాల అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని చీఫ్ విప్ ఆంజనేయిలు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరారు. ఆర్థిక పరిస్థితి ఆధారంగా ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలో తాను చూస్తానని సీఎం చంద్రబాబు చెప్పారు.
ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకోవాలి..
‘‘ఎమ్మెల్యేలు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. అనవసరమైన విషయాలు మాట్లాడొద్దు. మనం పొరపాటు మాట్లాడితే ప్రతిపక్షం అవకాశంగా తీసుకొంటుంది. 2019 ఎన్నికల సమయంలో మాజీ మంత్రి వివేకా హత్యపై ‘‘నారా సుర రక్త చరిత్ర’’ అని రాశారు.. నిజమని నమ్మించారు. మనం ఆ సమయంలో సరిగ్గా ఎదుర్కోలేకపోయాం. వైసీపీ నేతలు జనాన్ని నమ్మించే ప్రయత్నం చేశారు. వివేక కుమార్తె సునీత కూడా నిజమని నమ్మింది. నిజం తెలిశాక ఆమె కోర్టుకు వెళ్లింది. ఇప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి అబద్ధాన్ని నిజమని నమ్మించే ప్రయత్నంలో ఉన్నారు. మొన్న జగన్ ఇంటిదగ్గర చెత్త తగులబడింది. దాని విషయంలో కూడా రచ్చ చేయాలని చూశారు. చివరకు సీసీటీవీ ఫుటేజ్ అడిగితే చేతులెత్తేశారు. ఎమ్మెల్యేలకు, ప్రజలకు, కేడర్‌కు మధ్య సమన్వయం కొరవడింది. దీనిపై సమన్వయ కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి’’ అని సీఎం చంద్రబాబు సూచించారు.
రాష్ట్ర బడ్జెట్‌పై విస్తృతమైన చర్చ జరుగాలి..
‘‘కేంద్ర బడ్జెట్ తరహాలోనే రాష్ట్ర బడ్జెట్‌పై కూడా విస్తృతమైన చర్చ జరుగాలి. ఏప్రిల్‌లోపు నామినేటెడ్ పదవులు అన్ని భర్తీ చేస్తాం. మార్కెట్ యార్డులు, దేవస్థానాలకు మీరు పేర్లు ఇవ్వాలి. పార్టీ పదవులు మహానాడులోపు పూర్తి చేయాలి. వేసవి కావడంతో అతిసార కేసులపై మంత్రులు అప్రమత్తంగా ఉండాలి. మంత్రి,, ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి ముందుకెళ్లాలి. ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలి. నాతో కలిసి పాత వాళ్లు ఎంతోమంది చాలా సంవత్సరాలు నుంచి ప్రయాణిస్తున్నారు. వాళ్లకు నా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనే విషయం వాళ్లకు తెలుసు. కొత్తవాళ్లు కూడా తెలుసుకోవాలి. అందరు కలిసి ప్రయాణం చేయాలి. సమైక్యాంధ్ర ఉద్యమ సమయంలో కూడా అంతా నన్ను రావద్దని చెప్పారు. చివరకు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు సమావేశం ఏర్పాటు చేసి నన్ను రమ్మన్నారు. చివరకు యరపతినేని సమావేశంతో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో మీటింగ్‌లు పెట్టాం. అలానే చాలా మలుపులు తిరిగి చివరకు 2014లో అధికారంలోకి వచ్చాను. అందుకనే కొన్ని విషయాల్లో మనం ముందుకు వెళ్లాలి’’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Botsa on Budget: ఏపీ బడ్జెట్‌పై బొత్స హాట్ కామెంట్స్
Gorantla Madhav: మరిన్ని చిక్కుల్లో గోరంట్ల మాధవ్.. వారి ఫిర్యాదుతో..
AP Agriculture Budget: రైతులకు గుడ్ న్యూస్..
Read Latest AP news And Telugu News