AP Assembly: సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Sep 26 , 2025 | 09:22 AM
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షా కాల సమాావేశాాల్లో భాగంగా ఇప్పటికే పలు బిల్లులు ఆమోదం పొందాయి. తాజాగా మరికొన్ని బిల్లులను ఈ రోజు మంత్రులు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
అమరావతి,సెప్టెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా శుక్రవారం అసెంబ్లీలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. విద్యా శాఖకు సంబంధించి పలు బిల్లులను విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రవేశపెట్టనున్నారు. బార్ కౌన్సిల్‌కు చెందిన న్యాయ విద్య, పరిశోధనకు భారత అంతర్జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ బిల్లును మంత్రి నారా లోకేష్ ప్రవేశపెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ విశ్వ విద్యాలయాల చట్ట సవరణతో పాటు విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను సైతం ఆయన సభలో ప్రవేశ పెట్టనున్నారు.
అలాగే నాలా చట్టం రద్దు బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. ఇక వేతన సవరణ చట్టం, వస్తు సేవల పన్ను సవరణల బిల్లులను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సభలో పెట్టనున్నారు. లాజిస్టిక్స్, ఉపాధి, పరిశ్రమలు తదితర అంశాలపై అసెంబ్లీలో లఘు చర్చ జరగనుంది. దీనికి సీఎం చంద్రబాబు సమాధానం ఇవ్వనున్నారు.
అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా గోరంట్లలో నీళ్ల ట్యాంకు, తుంగభద్ర దిగువ కాలువ, పాలిటెక్నిక్ కళాశాలలకు సొంత భవనాలపై సభ్యుల అడిగే పలు ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. డీబీటీ చెల్లింపులు, పాతపట్నంలో నూతన కోర్టు భవనం, ప్రభుత్వ రంగ సంస్థలలో స్థానికులకు ఉద్యోగాలు, గోదావరి వాటర్ గ్రిడ్ పనులు తదితర అంశాలపై అసెంబ్లీ వేదికగా నేడు చర్చ జరగనుంది.
పెందుర్తి నియోజకవర్గంలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, జల వనరుల శాఖ భూముల ఆక్రమణలపై సైతం సభ్యులు అడిగే పలు ప్రశ్నలకు మంత్రుల జవాబులు ఇవ్వనున్నారు. అలాగే శాసన మండలిలో సూపర్ సిక్స్‌తోపాటు వ్యవసాయ రంగ సమస్యలపై లఘు చర్చలు కొనసాగించనున్నారు.
ఇక శాసన మండలిలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా మెగా పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, ఫించన్ల లబ్ధిదారులు, నిషేధించిన ఔషదాలపై నియంత్రణ, ఎరువుల కొరత, గ్రామీణ, సెమి అర్బన్ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటు ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. పొగాకు, మిర్చి, మామిడి రైతులకు మద్దతు ధర, చౌక ధరల దుకాణాలను బలోపేతం చేయటం, అనంతపురం జిల్లాలో ఈ స్టాంపుల కుంభకోణం, పెండింగ్ రెవిన్యూ సమస్యలు, ఎన్టీఆర్ విద్యా సేవ పథకం బకాయిల ప్రశ్నలపై సైతం శాసన మండలిలో చర్చించనున్నారు.
ఇవి కూడా చదవండి
ఐటీ ఉద్యోగులకు ఎగిరి గంతేసేలాంటి వార్త
టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..!
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి