Share News

Revanth Reddy Govt: టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..!

ABN , Publish Date - Sep 26 , 2025 | 10:01 AM

రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మీ పథకం తెలంగాణలో సూపర్ సక్సెస్ అయింది. ఈ పథకం కారణంగా.. మహిళా ప్రయాణికులతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోతున్నాయి.

Revanth Reddy Govt: టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం..!

హైదరాబాద్, సెప్టెంబర్ 26: రాష్ట్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన మహాలక్ష్మీ పథకంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కిక్కిరిసి పోతున్నాయి. అలాగే విద్యార్థులు, ఉద్యోగులు సైతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. దీంతో బస్సు ప్రయాణాలను మరింత సులభతరం చేస్తూ స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. నగరంలో పైలట్ ప్రాజెక్ట్ చేపట్టి విద్యార్థులకు బస్ పాస్‌లను స్మార్ట్ కార్డుల రూపంలోకి మార్చాలని భావిస్తుంది.


ఆ తర్వాత మిగిలిన పాస్‌లతోపాటు మహాలక్ష్మి ఉచిత ప్రయాణ లబ్ధిదారులకు వీటిని జారీ చేయాలని టీజీఎస్‌ఆర్టీసీ అనుకుంటుంది. అందుకోసం దేశంలోని వివిధ ప్రధాన నగరాల్లో అమలవుతున్న స్మార్ట్ కార్డుల వ్యవస్థ తీరు తెన్నులను సైతం సంస్థ ఉన్నతాధికారులు పరిశీలిస్తున్నారు. ఈ విధానాన్ని జంట నగరాల్లో ప్రవేశ పెడితే.. ఎదురయ్యే సవాళ్లను వారు అంచనా వేస్తున్నారు.


దీని వల్ల లాభాలేంటి..?

  • స్మార్ట్ కార్డు విధానం అందుబాటులోకి వస్తే ఆధార్, ఇతర చిరునామా ధృవీకరణ కార్డుల అవసరం ప్రయాణికులకు ఉండదు.

  • ప్రతి నెల బస్ పాస్ రెన్యువల్ కోసం ఆర్టీసీ కౌంటర్లకు విద్యార్థులు వెళ్లవల్సిన అవసరం లేదు.

  • వీటిని డిజిటల్ పద్దతి ద్వారా రెన్యువల్ చేసుకోనే అవకాశం ఉంది.

  • ఏ మార్గంలో ఎంత మంది ప్రయాణిస్తున్నారనే వివరాలు ఆర్టీసీకి తెలిస్తే.. మిగిలిన మార్గాల్లో బస్సులను సర్దుబాటు చేయడానికి వీలు కలుగుతుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు.


పలు సవాళ్లు..

  • జంట నగరాల్లో నిత్యం 26 లక్షల మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. వారిలో సుమారు 72 శాతం అంటే.. అందులో 18 లక్షల మంది మహిళలే ఉన్నారు. వీరందరికీ కార్డులు జారీ చేయడం.. నిజంగా సవాలే అవుతుంది.

  • రోజూ ప్రయాణించే వారు మినహా ఇతరులు ఈ కార్డులు తీసుకుంటారా? అనే సందేహం అధికారుల్లో వ్యక్తమవుతోంది.

  • స్మార్ట్‌కార్డు లేని వారు బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తే.. వారికి ఎలాంటి వెసులుబాటు కల్పించాలనే అంశాలపై టీజీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోంది.

ఇవి కూడా చదవండి

సభలో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న మంత్రి నారా లోకేశ్

ఐటీ ఉద్యోగులకు ఎగిరి గంతేసేలాంటి వార్త

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Sep 26 , 2025 | 10:51 AM