Tirupati Bomb Threat: తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపుల కలకలం..
ABN , Publish Date - Oct 06 , 2025 | 03:52 PM
తిరుపతిలో వరస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. నగరంలో ఇటీవల నాలుగు చోట్ల బాంబులు పెట్టినట్లు మెయిల్స్ పంపిన కేటుగాళ్లు.. తాజాగా మరోసారి అదే తరహాలో వ్యవహరించారు.
తిరుపతి: నగరంలో మరోసారి బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపింది. తిరుపతి ఎస్వీ వ్యవసాయ వర్సిటీకి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. వర్సిటీ దగ్గర సీఎం చంద్రబాబు పర్యటన కోసం హెలిప్యాడ్ ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ దగ్గర ఐఈడీ బాంబులు పెట్టినట్టు ఈ-మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు హెలిప్యాడ్ పరిసరాల్లో బాంబు స్క్వాడ్, పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.
అయితే గతంలోనూ తిరుపతి నగరానికి బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చిన విషయం తెలిసిందే. నాలుగు చోట్ల ఆర్డీఎక్స్ పేలుడు పదార్థాలు పేలనున్నాయి.. అంటూ టీటీడీ డోనార్ సెల్‌కు మెయిల్స్ వచ్చాయి. మెయిల్‌తో బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్లతో తిరుపతితోపాటు తిరుమల్లోనూ అధికారులు జల్లెడ పట్టారు. తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు, అనుమానాస్పద వస్తువులు దొరకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, అప్పుడు కూడా.. సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపులు రావడం గమనార్హం. అసలు బెదిరింపులకు ఎవరు పాల్పడుతున్నారు..? ఎందుకు పాల్పడుతున్నారు..? ఈ బెదిరింపుల వెనక రాజకీయ లేదా వ్యక్తిగత కుట్రలు ఉన్నాయా..? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. తాజా బెదిరింపుల నేపథ్యంలో తిరుపతిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు