Pattabhi: పరకామణి కేసు.. త్వరలోనే దుష్ట చతుష్టయం జైలుకెళ్లడం ఖాయం: పట్టాభి
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:34 PM
తిరుమల పరకామణి కేసుకు సంబంధించి పట్టాభి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా ఈ కేసు రాజీ తీర్మానం జరిగిన పాలకమండలి సమావేశంలో కరుణాకర్ రెడ్డి పాల్గొన్న ఫోటోను పట్టాభి బయటపెట్టారు.
తిరుపతి, నవంబర్ 29: తిరుమల పరకామణి కేసుకు సంబంధించి టీడీపీ నేత, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి (TDP Leader Pattabhi) సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. పరకామణి కేసు రాజీ తీర్మానం జరిగిన పాలకమండలి సమావేశంలో ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పక్కన కూర్చుని ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి ఫోటోను ఈ సందర్భంగా పట్టాభి బయటపెట్టారు. నిజమైన దుష్ట చతుష్టయం వైవీ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, చెవిరెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలే అంటూ కామెంట్స్ చేశారు. చోరీ బయటపడిన ఏప్రిల్ 19 నుంచే ఆ కేసును నీరు గార్చటానికి వీరందరూ పూనుకున్నారని ఆరోపించారు. అందుకే కేసు పెట్టేప్పుడే 379, 381 మాత్రమే పెట్టారని.. సెక్షన్ 409ని ఉద్దేశపూర్వకంగా పెట్టలేదని మండిపడ్డారు.
జగన్ మోహన్ రెడ్డికి, వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన తిరుమల వన్ టౌన్ సీఐ కీలక పాత్ర పోషించారని ఆరోపించారు. ఏప్రిల్ 29న దొంగతనం బయటపడితే... మే 12న, మే 18న ఆస్తులు రాయించుకున్నారని... మే 30న చార్జిషీట్ వేశారన్నారు. జూన్ 19న టీటీడీ పాలకమండలి సమావేశంలో టేబుల్ అజెండాగా పెట్టారని ఆయన తెలిపారు. చార్జిషీట్ వేయక ముందే ఆస్తులు ఎలా రాయించుకుంటారని ప్రశ్నించారు. పరకామణి చోరీ వెనుక వీరు లేకపోతే... ఇంత త్వరత్వరగా ఎందుకు స్పందించారని నిలదీశారు. టీటీడీ రూల్ నెంబర్ 159 ప్రకారం ఆస్తులు రాయించుకోవాలంటే 30 రోజుల ముందు పత్రికల్లో ప్రకటన ఇవ్వాలని... అలా ఏమీ జరగలేదని చెప్పుకొచ్చారు. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి అయిన వెంటనే లోక్ అదాలత్‌లో రాజీకి తీర్మానం చేశారని పట్టాభి అన్నారు.
అలాగే.. భూమన కరుణాకర్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి ఆస్తులు 2004లో తుడా ఛైర్మన్, 2006లో టీటీడీ ఛైర్మన్ కాక ముందు ఎంత? ఆ తరువాత ఎంత అనే వివరాలను మీడియా సమావేశంలో పట్టాభి వెల్లడించారు. 2004కు ముందు రెండు చిన్న ప్లాట్లు ఉన్న భూమన కరుణాకర్ రెడ్డికి ఆ తరువాత కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరాలకు ఎకరాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. భూమన కరుణాకర్ రెడ్డి, అభియనయ్ రెడ్డిల ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులు కొన్న సంవత్సరాలను చూడమంటూ మీడియాకు చూపించారు.
అబద్ధాలను తడబడకుండా చెప్పే వైసీపీ స్కూళ్లకు ప్రిన్సిపాల్ జగన్ మోహన్ రెడ్డి అని... ఆయన శిక్షణలో వీరంతా తడబడకుండా అబద్ధాలు చెప్పటంలో దిట్టలు అయ్యారంటూ ఎద్దేవా చేశారు. పరకామణి కేసులో ఫిర్యాదుదారుడు సతీష్ హత్యవెనుక భూమన పాత్ర ఉందని... నిజాలు బయటకు రాకూడదనే అతన్ని హత్య చేశారని ఆరోపించారు. అతి త్వరలోనే ఘోరానికి పాల్పడిన దుష్టచతుష్టయం జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ‘భూమన నువ్వు నైలు నదిలో ఉన్న ముసళ్లను కాదు... జైలు సెల్‌లో దోమలను, సెల్‌లోని గోడలకు ఉన్న బల్లులను లెక్కిస్తువులే సిద్ధంగా ఉండు’ అంటూ పట్టాభి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇవి కూడా చదవండి..
వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం: త్రీ మెన్ కమిటీ
ఆ జిల్లాలను అలర్ట్ చేయండి... దిత్వా తుఫానుపై అధికారులతో హోంమంత్రి
Read Latest AP News And Telugu News