Good News To Farmers: కేంద్ర మంత్రికి ఫోన్.. క్షణాల్లో రాష్ట్రానికి..
ABN , Publish Date - Sep 08 , 2025 | 08:32 PM
ఎరువుల కేటాయింపు అంశంపై జరిపిన సమీక్షలోనే కేంద్ర మంత్రి నడ్డాతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 రేక్‌ల యూరియాను ఏపీకి కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు.
అమరావతి, సెప్టెంబర్ 08: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీకి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సోమవారం నాడు అమరావతిలో స్పందించారు. రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియా వస్తుందని, అది కాకినాడు పోర్టులో దిగుమతి అవుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న జిల్లాలకు యుద్ధ ప్రాతిపదికన దాన్ని తరలించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఏపీలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయని మంత్రికి అధికారులు వివరించారు.
యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎరువుల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి నడ్డాతో సీఎం చంద్రబాబు మాట్లాడారని.. అందువల్లే రాష్ట్రానికి యూరియా కేటాయింపులు జరిగాయని మంత్రి అచ్చెన్న వివరించారు. క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. రబీ సీజన్‌కు కేంద్రం 9.3 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను రాష్ట్రానికి కేటాయించిందని.. ఈ నేపథ్యంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు.
సమీక్షిస్తూ.. కేంద్ర మంత్రికి ఫోన్..
మరోవైపు అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని ఈ సందర్భంగా ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వలు ఉన్నాయని ఈ సందర్భంగా సీఎంకు ఉన్నతాధికారులు తెలిపారు. మరో 10 రోజుల్లో 23,592 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అధికారులు వివరించారు. నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఎరువుల కేటాయింపు అంశంపై జరిపిన సమీక్షలోనే కేంద్ర మంత్రి నడ్డాతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 రేక్‌ల యూరియాను ఏపీకి కేటాయించాలని కేంద్ర మంత్రిని సీఎం చంద్రబాబు కోరారు. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. వచ్చే రబీ సీజన్‌కు ఇప్పటి నుంచే యూరియా సరఫరా ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని సూచించారు. ఇక కర్నూలు మార్కెట్‌లో ఉల్లి కొనుగోళ్లు, మద్దతు ధరపైనా సమీక్ష చేశారు. ఉల్లి ధర క్వింటాకు రూ.1,200 తగ్గకుండా చూడాలని స్పష్టం చేశారు.
రైతులు ఎవరైనా క్వింటాకు రూ.1,200 కంటే తక్కువ ధరకు అమ్ముకుంటే... ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా కోడుమూరులో పురుగుమందు డబ్బాతో ఆత్మహత్య డ్రామా ఆడిన వారిపై విచారణ చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎంకు అధికారులు తెలిపారు. పంటను కనీసం మార్కెట్‌కు తీసుకు రాకుండా.. పురుగుమందు తాగినట్లు డ్రామా ఆడిన వారిపై చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వివరించారు.
అరకు కాఫీకి సోకిన 'కాయ తొలుచు' తెగులుపైనా సీఎం చంద్రబాబు సమీక్షించారు. కాఫీ తోటలకు సోకిన తెగులును ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. ఇప్పటివరకు 80 ఎకరాలకు మాత్రమే తెగులు సోకిందని.. అందులో 60 ఎకరాలు తొలగించామని అధికారులు వివరించారు. తురకపాలెం ఆరోగ్య పరిస్థితిపైనా ఎప్పటికప్పుడు సమీక్షించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
పెన్షన్లు, ఉచిత గ్యాస్, ఆర్టీసీ సహా వివిధ ప్రభుత్వ శాఖలు అందిస్తున్న పౌర సేవల్లో సంతృప్త స్థాయిపై సీఎం సమీక్షించారు. పౌర సేవల సంతృప్త స్థాయిపై ఇక నుంచి ప్రతీ వారం సమీక్షిస్తానని అధికారులకు ఆయన స్పష్టం చేశారు. ప్రజల నుంచి వ్యక్తమయ్యే అభిప్రాయాలను డేటా అన్‌లిటిక్స్ ద్వారా విశ్లేషిస్తామని స్పష్టం చేశారు. కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లు రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరిగేందుకు ఏ మేరకు ఉపకరిస్తుందో చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
ఇవి కూడా చదవండి..
నేపాల్ ప్రధాని హోమ్‌టౌన్‌ను తాకిన నిరసన సెగలు.. రాళ్లు రువ్విన ఆందోళకారులు
నేపాల్‌లో తీవ్ర ఉద్రిక్తత.. పార్లమెంట్‌పైకి దూసుకెళ్లిన యువత..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి