Instagram Fraud: నానమ్మ వైద్యానికి సాయం కోరిన యువకుడికి ఊహించని షాక్..
ABN , Publish Date - Oct 21 , 2025 | 03:36 PM
హర్షసాయి ఫౌండేషన్ నుంచి సహాయం ఆశించి మోసపోయానని నల్లచెరువు మండలం గొల్లపల్లికి చెందిన భయ్యప్ప అనే యువకుడు వాపోయాడు. తన నాయనమ్మ అనారోగ్యంతో ఉండడంతో వైద్యం చేయించడానికి హర్షసాయి ఫౌండేషన్‌ను పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మెసేజ్ చేశాడు యువకుడు.
శ్రీ సత్యసాయి జిల్లా, అక్టోబర్ 21: సైబర్ నేరగాళ్ల మోసానికి ఎంతో మంది తమ సొమ్మును పోగొట్టుకున్న ఘటనలు ఎన్నో చూశాం. వివిధ రకాలుగా వ్యక్తులకు ఫోన్‌లు చేసి వారిని నమ్మబలికి పెద్ద మొత్తంలో దోచేస్తారు కేటుగాళ్లు. సైబర్ నేరగాళ్ల విషయంలో అలర్ట్‌గా ఉండని పక్షంలో సర్వం కోల్పోవడం ఖాయం. సైబర్ నేరగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అనేక సార్లు చెప్పినప్పటికీ కొందరు మాత్రం వారి మోసపు వలలో చిక్కుతూనే ఉంటారు. తాజాగా జిల్లాకు చెందిన ఓ యువకుడిని బురిడీ కొట్టించారు కేటుగాళ్లు.
యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ హర్షసాయి ఫౌండేషన్ పేరుతో ఆర్థిక సాయం అంటూ యువకుడిని మోసం చేశారు. హర్షసాయి ఫౌండేషన్ నుంచి సహాయం ఆశించి మోసపోయానని నల్లచెరువు మండలం గొల్లపల్లికి చెందిన భయ్యప్ప అనే యువకుడు వాపోయాడు. తన నాయనమ్మ అనారోగ్యంతో ఉండడంతో వైద్యం చేయించడానికి హర్షసాయి ఫౌండేషన్‌ను పేరుతో ఉన్న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మెసేజ్ చేశాడు యువకుడు. హర్షసాయి ఫౌండేషన్ నుంచి సహాయం పొందాలంటే మొదట కొంత మొత్తం డబ్బులు కట్టాలంటూ భయ్యప్ప నుంచి విడతల వారీగా 1,80,000 రూపాయలు దండుకున్నారు సైబర్ నేరగాళ్లు.
నాయనమ్మ వైద్యం ఖర్చులకు సరిపడా 3,50,000 నగదు ఇస్తామని చెప్పి తన వద్ద డబ్బులు ఫోన్ పే చేయించుకున్నారని యువకుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఆర్థిక సహాయం చేయకపోగా తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే సైబర్ నేరగాళ్లు బెదిరిస్తున్నారని యువకుడు తెలిపాడు. హర్షసాయి ఫౌండేషన్‌కు చెందిన ప్రతినిధులుగా చెప్పుకుంటున్న మధుబాబు, సౌమ్య అనే ఇద్దరు వ్యక్తులు తనతో ఫోన్లో మాట్లాడి బెదిరింపులకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చాడు. హర్షసాయి ఫౌండేషన్ చేతిలో మోసపోయిన తనకు న్యాయం చేయాలంటూ సైబర్ క్రైం పోలీసులకు యువకుడు భయ్యప్ప ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి విషయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైం పోలీసులు మరోసారి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
భీమవరం డీఎస్పీపై పవన్ సీరియస్..
పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ
Read Latest AP News And Telugu News