Newborn Baby Abandoned: అనంతపురంలో దారుణం.. ముళ్లపొదల్లో నవజాత శిశువు ఏడుపులు..
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:44 PM
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ధర్మవరం రోడ్డులోని గ్యాస్ గౌడన్ సమీపంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువు(ఆడబిడ్డ)ను గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ళపొదల్లో పడవేసి వెళ్లారు.
అనంతపురం: ప్రస్తుత సమాజంలో మగవారికి ధీటుగా.. ఆడవారు రాణిస్తున్నారు. మగవారితో సమానంగో పోటి పడుతూ.. దేనిలోనూ తాము తక్కువ కాదు అంటూ నిరూపిస్తున్నారు. సమాజంలో.. మహిళలు గొప్పగొప్ప స్థానాల్లో రాణిస్తున్నా.. కొందరికి ఇంకా కనువిప్పు కలగడం లేదు. ఈ మేరకు ఇప్పటికీ ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉందని చెప్పుకొవచ్చు. ఆడపిల్లలు పుడితే పెద్ద భారంగా ఉంటారని, వారిని పెంచి పెద్దచేయడం ఒక సమస్య భావిస్తున్నారు. వారికి పెళ్ళి చేయడం భారీ ఖర్చు, కష్టంతో కూడకున్నదని భావించే వారు ఇంకా ఉన్నారనడంలో అతిశయోక్తి లేదు. ఈ నేపథ్యంలో ఆడబిడ్డలపై అంతులేని వివక్ష చూపుతున్నారు. పుట్టేది ఆడపిల్ల అని తెలియగానే అబార్షన్ చేయిస్తున్న వారు లేకపోలేరు. అయితే.. తాజాగా అప్పుడే పుట్టిన ఆడబిడ్డని ఓ తల్లిదండ్రులు ముళ్లపొదల్లో పడవేసిన ఘటన స్థానికంగా అందరి హృదయాలను కలిచివేసింది.
వివరాల్లోకి వెళ్తే.. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణం ధర్మవరం రోడ్డులోని గ్యాస్ గౌడన్ సమీపంలో అప్పుడే పుట్టిన నవజాత శిశువు(ఆడబిడ్డ)ను గుర్తు తెలియని వ్యక్తులు ముళ్ళపొదల్లో పడవేసి వెళ్లారు. అయితే అటుగా వెళ్తున్న బిందెల కాలనీ వాసులకు పొదల్లో నుంచి ఏడుపులు వినిపించాయి. దీంతో చుట్టుపక్కల చూడగా.. ముళ్లపొదల్లో పసికందు బట్టల్లోచుట్టి పడిఉండటాన్ని గమనించారు. పసికందు పరిస్థితిని చూసి కాలనీ వాసులు కంటతడి పెట్టుకున్నారు. వెంటనే పసికందును చూసి చలించిపోయి.. అక్కున చేర్చుకున్నారు. వారి ఇంటికి తీసుకెళ్లి స్నానం చేయించి రెడీ చేశారు.
అనంతరం ఐసీడీఎస్ సిబ్బందికి, పోలీసులకు కాలనీ వాసులు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ప్రాంతం వారా లేక ఎక్కడినుంచో వచ్చి ఇక్కడ పసికందును పడవెసి వెళ్ళారా.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
పవన్ కల్యాణ్‌పై వ్యాఖ్యలు.. వైసీపీ కార్యకర్తను అదుపులోకి తీసుకున్న పోలీసులు
భవిష్యత్తులో సుపరిపాలన అందిస్తూ పెట్టుబడులు తీసుకొస్తాం: పల్లా శ్రీనివాసరావు