Share News

Lok Sabha Elections: నాన్న గెలిపించాడు!

ABN , Publish Date - Jun 05 , 2024 | 05:59 AM

ఖమ్మంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి తనయుడు రఘురాంరెడ్డి 4.62 లక్షల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. సురేందర్‌రెడ్డి క్రియాశీల రాజకీయాల్లో లేకున్నా.. తండ్రి రాజకీయ నేపథ్యం.. నేతల బంధువుత్వం సురేందర్‌ రెడ్డికి కలిసి వచ్చింది.

 Lok Sabha Elections: నాన్న గెలిపించాడు!

  • నల్లగొండలో జానా తనయుడు రఘువీర్‌రెడ్డి

  • పెద్దపల్లిలో ఎమ్మెల్యే వివేక్‌ కొడుకు వంశీకృష్ణ

  • వరంగల్‌లో కడియం కూతురు కావ్య

  • తొలిసారి ఎన్నికల బరిలో విజయబావుటా

  • ఖమ్మం గుమ్మంలో రఘురాంరెడ్డి

హైదరాబాద్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): అవును.. లోక్‌సభ ఎన్నికల్లో ఆ ముగ్గురి అభ్యర్థుల విజయం వెనక ‘నాన్నే’ ఉన్నారు. రాజకీయాల్లో తలలు పండిన తమ తండ్రులనే ఆ వారసులు ఆదర్శంగా తీసుకొని.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన విజయం సాధించారు. వారంతా ఎన్నికల బరిలో దిగడం ఇదే మొదటిసారి. నల్లగొండలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్‌రెడ్డి, వరంగల్‌లో మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి కూతురు కావ్య, పెద్దపల్లిలో చెన్నూర్‌ ఎమ్మెల్యే గడ్డం వివేక్‌ తనయుడు వంశీకృష్ణ.. పార్లమెంటు సభ్యులుగా గెలుపొందారు. వీరంతా కాంగ్రెస్‌ అభ్యర్థులే కావటం గమనార్హం. ఆ తండ్రులు ఎన్నికల ప్రచారం, గెలుపు బాధ్యతలను తమ భుజాలకెత్తుకొని వారసులను గెలిపించుకున్నారు.

ఖమ్మంలో రఘురాంరెడ్డి

ఖమ్మంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ రామసహాయం సురేందర్‌రెడ్డి తనయుడు రఘురాంరెడ్డి 4.62 లక్షల పైచిలుకు ఓట్లతో ఘన విజయం సాధించారు. సురేందర్‌రెడ్డి క్రియాశీల రాజకీయాల్లో లేకున్నా.. తండ్రి రాజకీయ నేపథ్యం.. నేతల బంధువుత్వం సురేందర్‌ రెడ్డికి కలిసి వచ్చింది. ఖమ్మం టికెట్‌ కోసం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్‌, మరో మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి పోటీపడగా.. చివరిక్షణాల్లో రఘురాంరెడ్డిని టికెట్‌ వరించింది. తొలిసారి ఎన్నికల బరిలో దిగిన రఘురాంరెడ్డి.. మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, సినీ నటుడు వెంకటేశ్‌కు వియ్యంకుడు కావడం గమనార్హం.


‘జానా’ వారసుల జయకేతనం

నల్లగొండ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలుపొందిన కుందూరు రఘువీర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తనయుడు. జానారెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇద్దరు కొడుకులను రాజకీయాల్లోకి దించారు. చిన్న కొడుకు జయవీర్‌రెడ్డిని నాగార్జునసాగర్‌లో ఎమ్మెల్యేగా పోటీ చేయించి, గెలిపించారు. నల్లగొండ ఎంపీ టికెట్‌ను పెద్ద కొడుకు రఘువీర్‌రెడ్డికి ఇప్పించుకుని.. ఆయననూ గెలిపించుకున్నారు. ఇద్దరు కొడుకులూ ఇప్పుడు ప్రజాప్రతినిధులయ్యారు. జానారెడ్డితోపాటు కోమట్‌రెడ్డి బ్రదర్స్‌, ఉత్తమ్‌ దంపతులు కాంగ్రెస్‌ విజయానికి కృషిచేయటంతో.. రఘువీర్‌ సుమారు 5.59 లక్షల మెజారిటీ సాధించారు.


వివేక్‌ కుటుంబానికి ‘పెద్దపల్లి’ ఆదరణ

పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి కాకా(గడ్డం వెంకటస్వామి) మనవడు వంశీ ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. గత ఎన్నికల్లో వంశీ తండ్రి వివేక్‌.. చెన్నూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వంశీ పెద్ద నాన్న వినోద్‌ బెల్లంపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. వెంకటస్వామి కూడా నాలుగు సార్లు పెద్దపల్లి ఎంపీగా గెలిచారు. కేంద్ర మంత్రిగానూ పనిచేశారు. 2009లో వివేక్‌ కూడా పెద్దపల్లి ఎంపీగా గెలుపొందారు. ఇప్పుడదే లోక్‌సభ స్థానం నుంచి వారి రాజకీయ వారసుడిగా బరిలో దిగిన వంశీకృష్ణ 1.32 లక్షల ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.


ఫలించిన కడియం వ్యూహం

వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో దిగిన డాక్టర్‌ కడియం కావ్య.. 2.17 లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల వేళ క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన కావ్య.. తన తండ్రి కడియం శ్రీహరి ఉన్న బీఆర్‌ఎ్‌సలో చేరారు. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థినిగా కావ్యను ప్రకటించిన తర్వాత.. తండ్రీ, కూతుళ్లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్‌ గూటికి వెళ్లారు. ఆ పార్టీ కావ్యకు ఎంపీ టికెట్‌ ఇచ్చింది. కడియం వ్యూహం ఫలించడంతో కూతురు ఎంపీగా విజయం సాధించారు.

Updated Date - Jun 05 , 2024 | 05:59 AM