Share News

Tourist Spots: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అదిరిపోయే న్యూస్ మీకోసం..!

ABN , Publish Date - Apr 05 , 2024 | 02:33 PM

రోజువారీ పనులు, వ్యాపారాలతో ఒత్తిడికి గురవుతున్న వారు ఉపశమనం పొందేందుకు కుటుంబంతో కలిసి సరదాగా వివిధ ప్రాంతాలకు(Tourist Spots) వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొంతమంది తెలంగాణ(Telangana), ఏపీలోని(Andhra Pradesh) ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లనుండగా..

Tourist Spots: సమ్మర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అదిరిపోయే న్యూస్ మీకోసం..!
Telangana Tourism Department

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 05: రోజువారీ పనులు, వ్యాపారాలతో ఒత్తిడికి గురవుతున్న వారు ఉపశమనం పొందేందుకు కుటుంబంతో కలిసి సరదాగా వివిధ ప్రాంతాలకు(Tourist Spots) వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటున్నారు. కొంతమంది తెలంగాణ(Telangana), ఏపీలోని(Andhra Pradesh) ప్రఖ్యాతిగాంచిన ఆలయాలు, దర్శనీయ స్థలాలకు వెళ్లనుండగా.. మరికొందరు దేశంలో ప్రత్యేకత కలిగిన చల్లని ప్రదేశాలు, ఎత్తయిన కొండల వద్దకు వెళ్లి తన్మయత్వం పొందనున్నారు. ఇందుకోసం నగరంలోని ట్రావెల్‌ ఏజెన్సీలు ప్రత్యేక ప్యాకేజీలను అందుబాటులో ఉంచాయి. బస్సులు, రైళ్లు, విమాన సర్వీసుల్లో ముందస్తు బుకింగ్‌ చేసుకుంటున్న వారికి 20 నుంచి 30 శాతం స్పెషల్‌ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. చాలామంది అడ్వాన్స్‌ బుకింగ్‌లకు ఆసక్తి చూపిస్తున్నారు. మరోవైపు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ సైతం వేసవి యాత్రలను నిర్వహించేందుకు సిద్ధమైంది.


చల్లని ప్రాంతాలకు..

వేసవికాలం రాగానే సాధారణంగా చాలామంది పిల్లలతో కలిసి తీర్థయాత్రలకు వెళ్తుంటారు. అయితే, నగరంలో ఈ సారి ఎక్కువమంది చల్లని ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బంధువులు, స్నేహితులు, అపార్ట్‌మెంట్‌వాసులు సమూహంగా ఏర్పడి ముందస్తుగా టూర్‌ను ఎంచుకుంటున్నారు. కేరళ, ఊటీ, అరకు, సిమ్లా, చిక్‌మగలూర్‌, కశ్మీర్‌, డార్జిలింగ్‌, మౌంట్‌ అబు, అండమాన్‌ నికోబార్‌, లోనావాలా, షిల్లాంగ్‌ లాంటి వాటిని ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే తెలంగాణ, ఏపీలోని అనంతగిరిహిల్స్‌, హార్సిలీహిల్స్‌, లంబసింగి, చింతపల్లి, కోనసీమ, మారేడుమిల్లి, అహోబిలం, పాడేరుకు వెళ్లాలని చూస్తున్నారు. వారం నుంచి పది రోజుల నిడివితో కూడిన టూర్‌లో చల్లని ప్రదేశాలను సందర్శించడంతోపాటు చారిత్రక, దర్శనీయ స్థలాలను కూడా చూసేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.


తెలంగాణ టూరిజం ప్యాకేజీలు..

తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రస్తుతం అరకు, ఊటీ ప్యాకేజీలను నిర్వహిస్తున్నారు. ఐదు రోజుల టూర్‌లోని అరకు ప్యాకేజీలో కైలాసగిరి, సింహాచలం, రుషికొండ, సబ్‌మెరైన్‌ మ్యూజియం, వైజాగ్‌ బీచ్‌ను చూపించనున్నారు. ఇందులో పెద్దలకు రూ.6,999, పిల్లలకు రూ.5,599 టికెట్‌ ధర ఉంది. కాగా, ఈ ప్యాకేజీలో నాన్‌ ఏసీ, ఏసీ రవాణా, అరకులో వసతి, గైడ్‌ సౌకర్యం ఉండగా.. భోజనం, ఆయా చోట్ల ప్రవేశ టికెట్లు, దర్శనం టికెట్లు, బోటింగ్‌ చార్జీలు పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీ ప్రతీ బుధవారం అందుబాటులో ఉంది. ఇదిలా ఉండగా, బెంగళూరు- ఊటీ-మైసూర్‌ ప్యాకేజీని ప్రతీ సోమవారం నిర్వహిస్తున్నారు. ఆరు రోజుల నిడివితో కూడిన ఈ టూర్‌లో టికెట్‌ ధర పెద్దలకు రూ.11,999, పిల్లలకు రూ.9,599 ఉంది. హోటల్‌ గదిలో ఒక్కరే ఉంటే టికెట్‌ ధరకు అదనంగా రూ.3వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఓల్వో బస్సులో ప్రయాణం, నాన్‌ ఏసీ హోటల్‌లో వసతి ఉంటుంది. మరిన్ని వివరాలకు tourism.telangana.gov.in సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా, మరికొన్ని రోజుల్లో గోవా టూర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు.


ఇవికూడా చదవండి:

వైసీపీ నుంచి టీడీపీలోకి నేడు పెద్ద ఎత్తున చేరికలు..

7 స్థానాల్లో అభ్యర్థులు గెలిచి మోదీ, బాబు, పవన్‌లకు కానుకగా ఇస్తాం: కేశినేని చిన్ని

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 05 , 2024 | 02:33 PM