Share News

Hyderabad: బాలాపూర్‌లో సీఎం సభ గ్రాండ్‌ సక్సెస్‌

ABN , Publish Date - May 01 , 2024 | 11:21 AM

చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం రంజిత్‌రెడ్డి(Gaddam Ranjith Reddy)కి మద్దతుగా మంగళవారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని బాలాపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు.

Hyderabad: బాలాపూర్‌లో సీఎం సభ గ్రాండ్‌ సక్సెస్‌

- పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు

- నేతలు, కార్యకర్తలతో కోలాహలం

- భారీ జెండాలతో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తల సందడి

- ఉత్సాహంగా, ఆసక్తిగా సాగిన సీఎం ప్రసంగం

హైదరాబాద్: చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం రంజిత్‌రెడ్డి(Gaddam Ranjith Reddy)కి మద్దతుగా మంగళవారం రాత్రి మహేశ్వరం నియోజకవర్గం మీర్‌పేట్‌ కార్పొరేషన్‌లోని బాలాపూర్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. సీఎం రేవంత్‌ మాట్లాడుతున్నంత సేపూ ప్రజలు, కార్యకర్తలు ఈలలు, చప్పట్లతో సందడి చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు ప్రజలను భారీగా సమీకరించడంతో సీఎం సభ విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి, చేవెళ్ల ఇన్‌చార్జి వేం నరేందర్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిగిరింత పారిజాతానర్సింహారెడ్డి, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తీగల కృష్ణారెడ్డి, కె.లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్మన్‌ అనితాహరినాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: TG News: రాజేంద్రనగర్, నార్సింగీలో కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్

సబితమ్మ ఉదయం కారు గుర్తుకు, రాత్రి కమలం గుర్తుకు

- సీఎం రేవంత్‌రెడ్డి ప్రోగ్రామ్‌ 7గంటలకు అని చెప్పగా, ఆయన సరిగ్గా ఎనిమిది గంటలకు వేదిక (ఓపెన్‌ టాప్‌ వాహనం)వాహనం వద్దకు చేరుకున్నారు. ముందుగా ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్‌రెడ్డి మాట్లాడగా, ఆ తర్వాత సీఎం 25 నిమిషాల పాటు ప్రసంగించారు.

- బడంగ్‌పేట్‌ మేయర్‌ పారిజాతానర్సింహారెడ్డితో ప్రచార రథంపై ఆయన కాసేపు ముచ్చటించారు.

- మాజీ మంత్రి సబితారెడ్డిని ఉద్దేశించి.. సీఎం మాట్లాడుతూ మా అక్క ఉదయం కారు గుర్తుకు, రాత్రి కమలం గుర్తుకు ప్రచారం చేస్తున్నదని వ్యాఖ్యానించినపుడు సభికుల నుంచి అనూహ్య స్పందన కనిపించింది. కారు, కమలం దోస్తీ చేస్తున్నాయని ఆయన అన్నారు.

- బీజేపీ అభ్యర్థి తానేదో పెద్ద ‘కొండ’ను అనుకుంటున్నారని, కానీ, తమ కార్యకర్తల అండ ఉండగా ఎంతటి కొండనైనా, బండనైనా బద్దలుకొట్టగలుగుతామని సీఎం పేర్కొనగా కార్యకర్తలు గట్టిగా ఈలలు వేశారు.

- కొండా గతంలో అధికార బీఆర్‌ఎస్‌లో ఎంపీగా ఉండి వెలగబెట్టిందేమీ లేదని సీఎం ఎద్దేవా చేశారు.

- చేవెళ్ల నుంచి తమ అభ్యర్థి లక్ష ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నాడని, అందులో మహేశ్వరం నుంచే 25వేల ఓట్ల ఆధిక్యత ఉండాలని ఆయన నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.

- మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎల్లార్‌ గెలిచిఉంటే ఈ పాటికి మహేశ్వరం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెంది ఉండేదని ఆయన వ్యాఖ్యానించారు. అప్పుడు మిస్‌ అయింది.. ఇప్పుడు మిస్‌ కానివ్వొద్దని సూచించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్‌ కార్నర్‌ మీటింగ్‌లు.. నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

విశ్వేశ్వర్‌రెడ్డి పొలిటికల్‌ టూరిస్టు: రంజిత్‌రెడ్డి

మాజీ ఎంపీ, బీజేపీ అభ్యర్థి విశ్వేశ్వర్‌రెడ్డి చేవెళ్లకు ఓ పొలిటికల్‌ టూరిస్టులా మారారని కాంగ్రెస్‌ అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి విమర్శించారు. గతంలో ఐదేళ్లు అధికారంలో ఉండి ఆయన నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. ఆయనను కలవాలంటే అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలని, అలాంటి నేత ప్రజలకు ఏం సేవ చేస్తాడని రంజిత్‌ ప్రశ్నించారు. తాను నిరంతరం ప్రజల్లో ఉంటానని, తన వద్దకు వచ్చిన ప్రతి ఒక్కరికీ చేతనైౖన సాయం చేస్తానని పేర్కొన్నారు. తనను మరోసారి ఆశీర్వదించాలని ఆయన కోరారు.

మార్మోగిన ‘మూడు రంగుల జెండాబట్టి’..

సభకు ముందు, సభానంతరం ‘మూడు రంగుల జెండాబట్టి, సింగమోలే కదలీనాడు’.. అనే పాట మార్మోగింది. సీఎం ప్రసంగించడానికి మైకు చేతిలోకి తీసుకోగానే 30 సెకన్ల పాటు మళ్లీ ఆ పాటను ప్లే చేయడంతో కార్యకర్తలు ఉత్సాహంగా స్టెప్పులేశారు. ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలు పాటకు అనుగుణంగా భారీ జెండాలను ఊపుతూ సందడి చేశారు. మొత్తంమీద సీఎం సభ సక్సెస్‌ కావడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారు.

ఇదికూడా చదవండి: BRS: బీఆర్‌ఎస్‏కు గుర్తుల గుబులు..! రోడ్‌ రోలర్‌, చపాతి మేకర్‌ ఎఫెక్ట్‌ భయం

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 01 , 2024 | 11:21 AM