Share News

Hyderabad: భగ్గుమన్న భానుడు.. బంజారాహిల్స్‏లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

ABN , Publish Date - Apr 24 , 2024 | 01:16 PM

భానుడి భగ.. భగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో వడగాలుల తీవ్రత పెరిగింది.

Hyderabad: భగ్గుమన్న భానుడు.. బంజారాహిల్స్‏లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

- వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి

- 85 ఎంయూలు దాటిన విద్యుత్‌ డిమాండ్‌

హైదరాబాద్‌ సిటీ: భానుడి భగ.. భగలతో నగరవాసులు అల్లాడిపోతున్నారు. వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్నారు. గ్రేటర్‌లో పలు ప్రాంతాల్లో రెండు రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటడంతో వడగాలుల తీవ్రత పెరిగింది. మంగళవారం బంజారాహిల్స్‌, సికింద్రాబాద్‌, న్యూ మెట్టుగూడ(Banjara Hills, Secunderabad, New Mettuguda)లో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గతేడాది ఏప్రిల్‌ నాలుగో వారం నమోదైన ఉష్ణోగ్రతలతో పోల్చితే ఈ ఏడాది 4-5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల పాటు ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, సాయంత్రం, రాత్రి సమయంలో ఉరుములు, మెరుపులతో అక్కడక్కడ జల్లులు కురిసే అవకాశముందని చెప్పారు. దక్షిణ- తూర్పు దిశలో ఉపరితల గాలులు 4-8 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలుంటాయని తెలిపారు.

ఇదికూడా చదవండి: ఖమ్మంలో రఘురాంరెడ్డి నామినేషన్‌

రికార్డుస్థాయిలో విద్యుత్‌ డిమాండ్‌

నగరంలో ఎండల ప్రభావంతో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డుస్థాయిలో పెరుగుతోంది. వారం రోజులుగా 82-85 మిలియన్‌ యూనిట్లు (ఎంయూ) నమోదవుతున్నది. ఏప్రిల్‌ 19న అత్యధికంగా రికార్డుస్థాయిలో 85.38 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ డిమాండ్‌ నమోదైంది. ఇప్పటివరకు ఇదే అధికమని, ఉష్ణోగ్రతలు ఇదే తరహాలో కొనసాగితే మే మొదటివారంలో 90 ఎంయూల డిమాండ్‌ నమోదయ్యే అవకాశాలుంటాయని విద్యుత్‌శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. విద్యుత్‌ డిమాండ్‌ రికార్డుస్థాయిలో పెరుగుతుండటంతో నందనవనం సబ్‌స్టేషన్‌లో కొత్తగా 12.5 ఎంవీఏ సామర్థ్యంతో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, సైబర్‌సిటీ కొత్తగూడ సబ్‌స్టేషన్‌లో 8 ఏంవీఏ (మెగావాట్స్‌ పర్‌ యాంప్‌) ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశారు. విద్యుత్‌ డిమాండ్‌ అంచనాలకు మించి పెరుగుతుండటంతో శివారు ప్రాంతాల్లో 8కి పైగా సబ్‌స్టేషన్లలో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంచినట్లు అధికారులు తెలిపారు.

ఇదికూడా చదవండి: తెలంగాణ నీటిని ఏపీకి దోచిపెట్టినోళ్లు నీతులు చెప్పడమా?

Read More Crime News and Telugu News

Updated Date - Apr 24 , 2024 | 01:16 PM