Share News

Lok Sabha election: తొలి రౌండ్‌కు గంటన్నర...

ABN , Publish Date - May 31 , 2024 | 04:05 AM

లోక్‌ సభ ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు మొదలైనా.. తొలి రౌండ్‌ ఫలితం కోసం కొంత ఎదురుచూపులు తప్పవు. ఈవీఎంలు తెరవడం.. వాటిని టేబుళ్లపై చేర్చడం.. లెక్కించడం.. సరిపోల్చుకోవడం.. వాటిని రిటర్నింగ్‌ అధికారి నిర్ధారించుకొని ఫలితాన్ని ప్రకటించడం.. వీటన్నింటికీ గంటన్నర పట్టే అవకాశం ఉంది.

 Lok Sabha election: తొలి రౌండ్‌కు గంటన్నర...

  • ఆ తర్వాత రౌండ్లన్నీ అరగంటలోపే హైదరాబాద్‌లో గరిష్ఠంగా 7 కేంద్రాలు

  • కౌంటింగ్‌ విధుల్లో

  • 10,798 మంది సిబ్బంది 4న లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు

  • ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు

  • 4న లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు ఈసీ ఏర్పాట్లు

హైదరాబాద్‌, మే 30 (ఆంధ్రజ్యోతి): లోక్‌ సభ ఎన్నికల కౌంటింగ్‌ ఉదయం 8 గంటలకు మొదలైనా.. తొలి రౌండ్‌ ఫలితం కోసం కొంత ఎదురుచూపులు తప్పవు. ఈవీఎంలు తెరవడం.. వాటిని టేబుళ్లపై చేర్చడం.. లెక్కించడం.. సరిపోల్చుకోవడం.. వాటిని రిటర్నింగ్‌ అధికారి నిర్ధారించుకొని ఫలితాన్ని ప్రకటించడం.. వీటన్నింటికీ గంటన్నర పట్టే అవకాశం ఉంది. అయితే మొదటి రౌండ్‌ ఫలితం తర్వాత వేగం పెరుగుతుంది. అరగంటలోపే ఒక్కో రౌండ్‌ ఫలితం వెల్లడి కానుంది. క్రమంగా ఏడు, ఎనిమిదో రౌండ్‌ వచ్చే సరికి ఒక్కో రౌండ్‌ 20 నిమిషాల్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. మరోవైపు, తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల లెక్కింపు చేపట్టినా.. అది పూర్తవడానికి గంటన్నర సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తంగా తొలి రౌండ్‌ ఫలితం లేదంటే పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితం.. ఏది రావాలన్నా 9.30 గంటల వరకు ఆగాల్సిందే. సాయంత్రం 4 గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.


జూన్‌ 4న జరగనున్న లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. 10,798 మంది ఉద్యోగులు, సిబ్బంది కౌంటింగ్‌ విధుల్లో పాల్గొననున్నారు. ఓట్ల లెక్కింపునకు మొత్తం 34 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో అత్యధికంగా హైదరాబాద్‌లో ఏడు, సికిందరాబాద్‌లో ఆరు చోట్ల ఓట్ల లెక్కింపు చేయనున్నారు. ఆదిలాబాద్‌, మల్కాజిగిరి స్థానాలకు మూడుచోట్ల.. మెదక్‌, పెద్దపల్లి నియోజకవర్గాలకు రెండు చోట్ల లెక్కింపు కేంద్రాలను సిద్ధం చేస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌, భువనగిరి, నల్లగొండ, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌, చేవెళ్ల, జహీరాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ పార్లమెంటు నియోజకవర్గ కేంద్రాల్లో ఒక్కో కౌంటింగ్‌ కేంద్రం పెట్టాలని నిర్ణయించారు. . కాగా, ఓట్ల లెక్కింపు పూర్తికాగానే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లా కేంద్రాల్లోని స్ట్రాంగ్‌ రూమ్‌లకు ఈవీఎంలను తరలించనున్నారు.


ఎన్నికల నియమావళి ప్రకారం ఆరు నెలల్లో ఆయా పార్లమెంటు స్థానాలు, పోలింగ్‌ స్టేషన్ల పరిధిలో ఎలక్షన్‌ పిటిషన్లు, ఇతర అభ్యంతరాలు రాకుంటే.. అందులోని సమాచారాన్ని తొలగిస్తారు. అంతలోపు ఏవైనా అభ్యంతరాలు వస్తే.. న్యాయస్థానాల్లో ఆ సమస్య పరిష్కారం అయ్యే వరకు సదరు పోలింగ్‌ స్టేషన్‌ పరిధిలోని ఈవీఎం స్టోరేజీని యధాతథంగా ఉంచనున్నట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి.

Updated Date - May 31 , 2024 | 04:05 AM