Share News

Lok Sabha Elections:హైదరాబాద్ సీటుపై కాంగ్రెస్ నిర్ణయం అదేనా.. ?

ABN , Publish Date - Apr 13 , 2024 | 11:23 AM

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తెలంగాణలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం హైదరాబాద్. ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించగా.. ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు.

Lok Sabha Elections:హైదరాబాద్ సీటుపై కాంగ్రెస్ నిర్ణయం అదేనా.. ?
Carminar

తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో పోలింగ్ జరగనుంది. ఈనెల 18వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో తెలంగాణ(Telangana)లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం హైదరాబాద్. ఇప్పటికే బీజేపీ (BJP), బీఆర్ఎస్ (BRS) తమ అభ్యర్థులను ప్రకటించగా.. ఎంఐఎం నుంచి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేయనున్నారు. కాంగ్రెస్ ఇంకా తన అభ్యర్థిని ప్రకటించలేదు. 2004 నుంచి ప్రతి ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు గెలుస్తూ వస్తున్న ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ ఐదోసారి ఇక్కడి నుంచి గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. ఓల్డ్ సిటీలో నియోజకవర్గాలన్నీ హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తాయి. దీంతో ముస్లిం సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటంతో.. ఓవైసీకి ఇక్కడ సునాయసంగా గెలుస్తున్నారు. మరోవైపు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంఐఎంకు పరోక్షంగా మద్దతు తెలుపుతారు. దీంతో తెలంగాణలో 16 నియోజకవర్గాల్లోనే ఇతర పార్టీలు పోటీ పడతాయి. అభ్యర్థిని పెట్టలేదన్నట్లు.. మైనార్టీయేతర వ్యక్తిని ఇక్కడి నుంచి బరిలోకి దించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో 1989 నుంచి ఎంఐఎం విజయం సాధిస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ కట్టర్ హిందూగా పేరొందిన మాధవీలతను పోటీగా దింపడంతో ఓ మతానికి చెందిన ఓట్లను పూర్తిస్థాయిలో పొందే వీలుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీల నుంచి ఎవరినైనా ముస్లిం అభ్యర్థిని పోటీకి దింపితే ఓట్లు చీలి తన గెలుపు కష్టం అవుతుందనే ఆలోచనలో ఓవైసీ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి బలహీనమైన అభ్యర్థులను బరిలో దింపాలని ఓవైసీ కోరినట్లు తెలుస్తోంది.


Asaduddin Owaisi: ‘అసద్‌’ ప్రచారం ఆరంభం.. కార్యకర్తలతో కలిసి ఒవైసీ పాదయాత్ర

అసెంబీ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా

వాస్తవానికి ఎన్నికల ముందు వరకు కాంగ్రెస్, ఎంఐఎం ఎన్నికల్లో ప్రత్యర్థులుగా కొట్లాడాయి. బీఆర్‌ఎస్‌కు ఓవైసీ పరోక్ష మద్దతు తెలిపారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మెజార్టీ కంటే నాలుగు సీట్లు మాత్రమే ఎక్కువుగా ఉండటంతో.. ఎంఐఎం మద్దతు ఉంటే ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందనే ఆలోచనలో కాంగ్రెస్ ఎంఐఎంకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించిందన్న చర్చ జరుగుతోంది. మరోవైపు కొనేళ్లుగా అధికారంలో ఉన్న పార్టీకి దగ్గరగా ఉంటూ వస్తున్న ఓవైసీ.. కాంగ్రెస్‌కు ఈ మధ్య కాలంలో దగ్గరైనట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలో మొదట బలమైన అభ్యర్థిని నిలబెడదామని భావించిన కాంగ్రెస్.. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఇక్కడ ఎంఐఎంకు పరోక్ష మద్దతు తెలిపాలని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బలహీనమైన అభ్యర్థిని ఇక్కడి నుంచి బరిలో దింపుతారనే ప్రచారం జరుగుతోంది.


బీజేపీ నుంచి..

ఈలోక్‌సభ ఎన్నికల్లో ఒవైసీ కోటను బద్దలు కొట్టేందుకు బీజేపీ తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. మొదటి లిస్ట్‌లోనే హైదరాబాద్ అభ్యర్థిని ప్రకటించడంతో పాటు.. ప్రచారాన్ని ముందుగానే ప్రారంభించింది. దీంతో ఓవర్గం ఓట్లను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డిని ఆర్‌ఎస్‌ఎస్‌ ఏజెంట్‌గా పిలిచే అసదుద్దీన్‌ ఒవైసీ స్వరంలో ప్రస్తుతం కొంత మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌ లోక్‌సభ సీటు విషయంలో కాంగ్రెస్, ఒవైసీ మధ్య కెమిస్ట్రీ వర్కౌట్ అయిందనే ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి ఇటీవల కాలంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఒవైసీల మధ్య సత్సంబంధాలు ఉన్నాయని తెలిపే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇఫ్తార్ విందు సందర్భంగా ఓవైసీపై రేవంత్ ప్రసంశలు కురిపించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు పూర్తై 5 నెలలు పూర్తి కాకుండానే.. కాంగ్రెస్, ఎంఐఎం మధ్య స్నేహం బలపడటానికి హైదరాబాద్ సీటు కారణమనే చర్చ నడుస్తోంది. హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఐదవసారి తన విజయం ఖాయమని ఓవైసీ భావించారు, కానీ బిజెపి మాధవి లతను రంగంలోకి దించడంతో ఓవైసీ గెలుపు కోసం కష్టపడాల్సిన పరిస్థితి వచ్చింది. బీజేపీ అభ్యర్థి ప్రకటన తర్వాత కాంగ్రెస్, ఒవైసీల వ్యూహం మారినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా ప్రముఖ డెయిరీ వ్యాపారి అలీ మస్కాడి, ఫిరోజ్ ఖాన్ పేర్లు తొలుత వినిపించాయి. ఆ తర్వాత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పేరు వినిపించింది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.


కాంగ్రెస్ వ్యూహం..

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలమైన ముస్లిం అభ్యర్థిని నిలబెడితే ముస్లిం ఓట్లు కాంగ్రెస్ , ఎంఐఎం మధ్య చీలిపోయి బీజేపీకి లాభం జరిగే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో.. బీజేపీని నిలువరించేందుకు కాంగ్రెస్ ఓవైసీకి పరోక్ష మద్దతు తెలిపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మరోవైపు ముస్లిమేతర వ్యక్తిని బరిలోకి దించినా ఓవైసీతో ఒప్పందం చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. బీజేపీ ఈ ప్రచారాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌కు కొంత నష్టం చేకూరే అవకాశం ఉంటుందనే ప్రచారం ఉంది. అందుకే ముస్లిం వర్గానికి చెందిన ఓ బలహీనమైన అభ్యర్థిని పోటీలో పెట్టాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


Danam Nagender: కాంగ్రెస్ అభ్యర్థి ‘దానం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే...

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 13 , 2024 | 11:31 AM