Share News

Shreyas Iyer: విశ్రాంతి అన్నారు.. కానీ రంజీ ట్రోఫీలో బరిలోకి..

ABN , Publish Date - Jan 10 , 2024 | 09:07 AM

ఈ నెల 11 నుంచి భారత్, అప్ఘానిస్థాన్ మధ్య జరిగే టీ20 సిరీస్‌లో స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. శ్రేయాస్‌కు విశ్రాంతి కల్పిస్తున్నామని, అందుకే అప్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదని సెలెక్టర్లు తెలిపారు.

Shreyas Iyer: విశ్రాంతి అన్నారు.. కానీ రంజీ ట్రోఫీలో బరిలోకి..

ముంబై: ఈ నెల 11 నుంచి భారత్, అప్ఘానిస్థాన్ మధ్య జరిగే టీ20 సిరీస్‌లో స్టార్ ఆటగాడు శ్రేయాస్ అయ్యర్‌కు చోటు దక్కలేదు. శ్రేయాస్‌కు విశ్రాంతి కల్పిస్తున్నామని, అందుకే అప్ఘానిస్థాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేయలేదని సెలెక్టర్లు తెలిపారు. కానీ పలు నివేదికల ప్రకారం శ్రేయాస్ అయ్యర్ ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో బరిలోకి దిగుతున్నాడు. జనవరి 11 నుంచి భారత్, అప్ఘానిస్థాన్ టీ20 సిరీస్ ప్రారంభంకానుండగా ఆ మరుసటి రోజు అంటే 12 నుంచి శ్రేయాస్ రంజీ ట్రోఫీలో ఆడనున్నాడు. రంజీ ట్రోఫీలో ముంబై తరఫున బరిలోకి దిగుతున్న శ్రేయాస్ అయ్యర్.. బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ మైదానంలో ఈ నెల 12 నుంచి ఆంధ్రాతో జరిగే మ్యాచ్‌లో ఆడనున్నాడు. దీంతో సెలెక్టర్లు శ్రేయాస్‌ను విశ్రాంతి పేరుతో టీ20 సిరీస్ నుంచి పక్కనపెట్టారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై రంజీ జట్టులో కీలక ఆటగాడైన సర్ఫరాజ్ ఖాన్ ఇండియా ‘ఏ’ తరఫున ఆడడానికి వెళ్తున్నాడు. దీంతో సర్ఫరాజ్ ఖాన్ స్థానంలో శ్రేయాస్ ముంబై జట్టులోకి రానున్నాడు.


సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ ఓ హాఫ్ సెంచరీతో రాణించాడు. కీలక సమయంలో సత్తా చాటాడు. కానీ టెస్ట్ సిరీస్‌లో మాత్రం విఫలమయ్యాడు. తొలి టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 31, రెండో ఇన్నింగ్స్‌లో 6 పరుగులు చేశాడు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్‌లో 4 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రంజీ ట్రోఫీలో సత్తా చాటి ఈ నెల 25 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభంకాబోయే టెస్ట్ సిరీస్‌లో ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగాలని శ్రేయాస్ అయ్యర్ భావిస్తున్నాడు. మరోవైపు తమ తొలి మ్యాచ్‌లో బీహార్‌పై ఇన్నింగ్స్‌ 51 పరుగుల తేడాతో గెలిచిన ముంబై టోర్నీలో శుభారంభం చేసింది. దీంతో ఆంధ్రాతో జరిగే మ్యాచ్‌లోనూ సత్తా చాటాలని భావిస్తోంది. పైగా ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ కూడా జట్టులో చేరడంతో ముంబై బలం మరింత పెరిగింది.

ముంబై జట్టు: అజింక్యా రహానే (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్, జే బిస్తా, భూపేన్ లల్వానీ, అమోఘ్ భత్కల్, సువేద్ పార్కర్, ప్రసాద్ పవార్ (వికెట్ కీపర్), హార్దిక్ తమోర్ (వికెట్ కీపర్), షామ్స్ ములానీ, తనుష్ కోటియన్, అథర్వ అంకోలేకర్, మోహిత్ అవస్తి, రాయ్‌స్టన్ డయాస్, సిల్వెస్టర్ డిసౌజా.

Updated Date - Jan 10 , 2024 | 09:07 AM