Share News

IND vs ENG: 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత.. ఒకే మ్యాచ్‌లో అశ్విన్, బెయిర్‌స్టో..

ABN , Publish Date - Feb 29 , 2024 | 05:42 PM

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్టు మ్యాచ్ ద్వారా వీరిద్దరు తమ తమ వ్యక్తిగత కెరీర్‌లో 100 టెస్టుల మైలురాయిని చేరుకోబోతున్నారు.

IND vs ENG: 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఘనత.. ఒకే మ్యాచ్‌లో అశ్విన్, బెయిర్‌స్టో..

టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, ఇంగ్లండ్ సీనియర్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. ధర్మశాల వేదికగా జరిగే ఐదో టెస్టు మ్యాచ్ ద్వారా వీరిద్దరు తమ తమ వ్యక్తిగత కెరీర్‌లో 100 టెస్టుల మైలురాయిని చేరుకోబోతున్నారు. ఇద్దరు ఆటగాళ్లు ఒకే మ్యాచ్ ద్వారా 100 టెస్టులను పూర్తి చేసుకోబోతుండడం విశేషం. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఒకే మ్యాచ్‌లో ఇద్దరు వేర్వేరు జట్ల ఆటగాళ్లు 100 టెస్టులను పూర్తి చేసుకోవడం ఇది మూడో సారి మాత్రమే. దీంతో భారత్, ఇంగ్లండ్ మధ్య ధర్మశాల వేదికగా జరగనున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకోనుంది. మరోవైపు మ్యాచ్ నిర్వాహకులు కూడా అశ్విన్, బెయిర్‌స్టోకు ఈ మ్యాచ్ ప్రత్యేకంగా నిలిచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


తన 13 ఏళ్ల టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 507 వికెట్లు తీశాడు. ఇందులో 35 సార్లు 5 వికెట్ల ప్రదర్శన.. 8 సార్లు 10 వికెట్ల ప్రదర్శన చేశాడు. బ్యాటుతోనూ సత్తా చాటిన అశ్విన్ 26 సగటుతో 3309 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలున్నాయి. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లోనూ సత్తా చాటిన అశ్విన్ 4 టెస్టుల్లో కలిపి 17 వికెట్లు తీశాడు. ఇప్పటివరకు 99 టెస్టులాడిన ఇంగ్లండ్ బ్యాటర్ జానీ బెయిర్‌స్టో 36 సగటుతో 5974 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలున్నాయి. అయితే ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో బెయిర్‌స్టో అంతగా ఫామ్‌లో లేడు. 8 ఇన్నింగ్స్‌ల్లో ఒకసారి కూడా హాఫ్ సెంచరీ మార్కు అందుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో బెయిర్ స్టో చేసిన పరుగులు 37, 10, 25, 26, 0, 4, 30, 38గా ఉన్నాయి. మొత్తం 170 పరుగులు మాత్రమే చేశాడు. ఇక ఐదు టెస్టుల సిరీస్‌ను భారత జట్టు ఇప్పటికే 3-1తో గెలుచుకున్న సంగతి తెలిసిందే.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 29 , 2024 | 05:42 PM