Share News

Ranji Trophy 2024: అదరగొట్టిన పుజారా, భువి.. రహానే విఫలం.. సీనియర్ల ప్రదర్శన ఇదే!

ABN , Publish Date - Jan 13 , 2024 | 02:10 PM

రంజీ ట్రోఫీ 2024లో ఇప్పటివరకు జరిగిన లీగ్ దశ మ్యాచ్‌ల్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, భువనేశ్వర్ కుమార్ సత్తా చాటారు. 30+ వయసులోనూ అద్భుతంగా ఆడిన వీరిద్దరు తమలో సత్తా ఇంకా ఏం మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు.

Ranji Trophy 2024: అదరగొట్టిన పుజారా, భువి.. రహానే విఫలం.. సీనియర్ల ప్రదర్శన ఇదే!

రంజీ ట్రోఫీ 2024లో ఇప్పటివరకు జరిగిన లీగ్ దశ మ్యాచ్‌ల్లో టీమిండియా సీనియర్ ఆటగాళ్లు చటేశ్వర్ పుజారా, భువనేశ్వర్ కుమార్ సత్తా చాటారు. 30+ వయసులోనూ అద్భుతంగా ఆడిన వీరిద్దరు తమలో సత్తా ఇంకా ఏం మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. జార్ఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో వెటరన్ బ్యాటర్ చటేశ్వర్ పుజారా డబుల్ సెంచరీతో విశ్వరూపం చూపించాడు. సౌరాష్ట్ర తరఫున బరిలోకి దిగిన పుజారా 243 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 49 పరుగులతో రాణించాడు. దీంతో ఈ నెల చివరలో ఇంగ్లండ్‌తో ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్‌లో పుజారాకు చోటు దక్కుతుందని చాలా మంది భావించారు. కానీ సెలెక్టర్లు మాత్రం పుజారాను పట్టించుకోలేదు. కాగా పుజారా చివరగా భారత జట్టు తరఫున గతేడాది జూన్‌లో జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆడాడు.


ఇక టీమిండియా వెటరన్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ రంజీ మ్యాచ్‌లో చెలరేగాడు. ఉత్తరప్రదేశ్ తరఫున బరిలోకి దిగిన భువి బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి రోజు ఆటలోనే 5 వికెట్లతో సత్తా చాటాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి మొదటి ఇన్నింగ్స్‌లో బెంగాల్ జట్టు 95/5తో కష్టాల్లో పడింది. కాగా భువనేశ్వర్ కుమార్ భారత జట్టుకు చివరగా 2022లో ప్రాతినిధ్యం వహించాడు. ఇక ఆంధ్రతో జరిగిన మరో మ్యాచ్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ రాణించాడు. ముంబై తరఫున బరిలోకి దిగిన శ్రేయస్ 48 బంతుల్లోనే 48 పరుగులు చేశాడు. అయితే ఇదే మ్యాచ్‌లో మరో సీనియర్ బ్యాటర్ అజింక్యా రహానే మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. కాగా రహానే చివరగా భారత జట్టుకు వెస్టిండీస్ పర్యటనలో ప్రాతినిధ్యం వహించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 13 , 2024 | 02:18 PM