Share News

Hardik Pandya: ముంబై జట్టులో ముదిరిన ‘పాండ్యా’ వివాదం.. తిలక్ వర్మతోనే మొదలు!

ABN , Publish Date - May 09 , 2024 | 04:36 PM

ఈ ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యాకు ఏమాత్రం కలిసిరాలేదు. అసలు రోహిత్ శర్మ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా అతడిని నియమించినప్పటి నుంచే విమర్శలు వస్తున్నాయి. ఐదు ఐపీఎల్ టైటిల్స్‌ని..

Hardik Pandya: ముంబై జట్టులో ముదిరిన ‘పాండ్యా’ వివాదం.. తిలక్ వర్మతోనే మొదలు!

ఈ ఐపీఎల్ సీజన్ హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) ఏమాత్రం కలిసిరాలేదు. అసలు రోహిత్ శర్మ (Rohit Sharma) స్థానంలో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కెప్టెన్‌గా అతడిని నియమించినప్పటి నుంచే విమర్శలు వస్తున్నాయి. ఐదు ఐపీఎల్ టైటిల్స్‌ని తెచ్చిపెట్టిన రోహిత్‌ని కాదని, పాండ్యాను కెప్టెన్‌గా ఎందుకు నియమించారంటూ అభిమానులు ట్రోల్స్ చేస్తూ వస్తున్నారు. ఇది చాలదన్నట్టు.. పాండ్యా అత్యంత పేలవంగా ప్రదర్శన కనబరచడం అతనికి మరింత మైనస్‌గా మారింది. కెప్టెన్‌గా, ఆటగాడిగా విఫలమవ్వడంతో.. అతనిపై మరింత వ్యతిరేకత పెరిగేలా చేసింది. ఇలాంటి తరుణంలో.. ముంబై జట్టులో ఉన్న అసంతృప్తులు బయటపడుతున్నాయి.

ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించిన కథనం ప్రకారం.. గతంలో మాదిరిగా ముంబై జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఇప్పుడు సందడి వాతావరణం ఏమాత్రం లేదని, హార్దిక్ పాండ్యా నాయకత్వం కూడా ఇబ్బందికరంగా ఉందని కొందరు సీనియర్ ఆటగాళ్లు కోచింగ్ సిబ్బందికి ఫిర్యాదు చేశారట. రీసెంట్‌గా రోహిత్, సూర్య, బుమ్రా లాంటి సీనియర్లతో పాటు మరికొందరు జట్టు ఆటగాళ్లు.. కోచింగ్ సిబ్బందితో సమావేశం అయ్యారని తెలిసింది. ఈ క్రమంలోనే.. ఒక్కొక్కరు పాండ్యా కెప్టెన్సీ శైలిపై తమ అసంతృప్తులు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదండోయ్.. ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న తిలక్ వర్మ (Tilak Varma), హార్దిక్ మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుందని సమాచారం. ఓ మ్యాచ్ ఓటమికి తనని తప్పు పట్టినట్టు పాండ్యా చేసిన వ్యాఖ్యలే అందుకు కారణమని తేలింది.


చరిత్ర సృష్టించిన సన్‌రైజర్స్.. టీ20 క్రికెట్‌లో ఆల్‌టైం రికార్డ్

ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో.. ముంబై ఇండియన్స్ దాదాపు గెలుపు అంచుల దాకా వెళ్లి ఓటమి పాలైంది. ఆ మ్యాచ్‌లో తిలక్ వర్మనే హయ్యస్ట్ స్కోరర్‌గా నిలిచాడు. కెప్టెన్ హార్దిక్‌తో పాటు ఇతర ఆటగాళ్లంతా ఆ మ్యాచ్‌లో విఫలమవ్వగా.. తిలక్ ఒక్కడే ఒంటరి పోరాటంతో జట్టుని నడిపించాడు. కానీ.. చివరికి మ్యాచ్ ఓడిపోవడంతో అతని పోరాటం వృధా అయ్యింది. అయితే.. తిలక్ ఆడిన తీరుని మెచ్చుకోవాల్సింది పోయి, మ్యాచ్ పరిస్థితిపై అతనికి అవగాహన లేకపోవడమే ఓటమికి కారణమని పాండ్యా వ్యాఖ్యానించాడు. అక్షర్ బౌలింగ్‌లో తిలక్ దూకుడుగా ఆడి ఉంటే బాగుండేదన్నాడు. దీంతో నొచ్చుకున్న తిలక్.. డ్రెస్సింగ్ రూమ్‌లో హార్దిక్‌ని నిలదీశాడని, అప్పుడు ఇద్దరి మధ్య వాగ్వాగం జరిగిందని వార్తలొచ్చాయి.

కేఎల్ రాహుల్‌పై లక్నో ఓనర్ మండిపాటు.. నెటిజన్ల కౌంటర్ ఎటాక్

మరోవైపు.. హార్దిక్ పాండ్యా నాయకత్వంతో జట్టు సభ్యులు ఏమాత్రం సంతృప్తిగా లేరనే వాదనలను బలం చేకూరిస్తూ ఓ అధికారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ నాయకత్వంలో ముంబై జట్టు పదేళ్లు ఆడిందని.. అందుకే కొత్త మార్పుకు ఇంకా అలవాటు పడలేదని పేర్కొన్నారు. అయితే.. నాయకత్వ మార్పు జరిగినప్పుడు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం సర్వసాధారణమేనని ఆయన చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టి.. ముంబై జట్టులో లుకలుకలు ఉన్నాయన్న మాట నిజమేనని అర్థం చేసుకోవచ్చు.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 09 , 2024 | 04:36 PM