Share News

IPL 2024: హార్దిక్‌ను కుక్కతో పోల్చిన అభిమానులు.. క్రికెట్ ప్రపంచమంతా రోహిత్ వైపే!

ABN , Publish Date - Mar 25 , 2024 | 03:23 PM

ఐపీఎల్ 2024లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. కెప్టెన్సీ మార్పు జరిగి 3 నెలలు గడిచినా అభిమానుల ఆగ్రహావేశాలు మాత్రం ఇంకా చల్లారడం లేదు.

IPL 2024: హార్దిక్‌ను కుక్కతో పోల్చిన అభిమానులు.. క్రికెట్ ప్రపంచమంతా రోహిత్ వైపే!

అహ్మదాబాద్: ఐపీఎల్ 2024లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు వివాదం ఇప్పట్లో సద్దు మణిగేలా లేదు. కెప్టెన్సీ మార్పు జరిగి 3 నెలలు గడిచినా అభిమానుల ఆగ్రహావేశాలు మాత్రం ఇంకా చల్లారడం లేదు. ఐపీఎల్ 2024లో భాగంగా ఆదివారం అహ్మదాబాద్ వేదికగా ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ ఆగ్రహావేశాలకు ప్రత్యక్ష వేదిక అయింది. రోహిత్ శర్మ, ముంబై ఇండియన్స్ అభిమానులకు గుజరాత్ టైటాన్స్ అభిమానులు కూడా తోడయ్యారు. మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ప్రవర్తన తీరు అభిమానులకు మరింత కోపం తెప్పించింది. ఈ ఆగ్రహావేశాలు హార్దిక్ పాండ్యాను కుక్కతో పోల్చే వరకు వెళ్లాయి. దీంతో విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, చెన్నైసూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇలా చెప్పుకుంటే సగటు క్రికెట్ అభిమాని రోహిత్ శర్మకు మద్దతుగా నిలుస్తున్నారు. రోహిత్ శర్మకు మద్దతుగా క్రికెట్ అభిమానులు పెడుతున్న పోస్టులతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. హార్దిక్ పాండ్యా తీరును తీవ్రంగా తప్పుబడుతున్నారు.

రోహిత్ నినాదాలతో మార్మోగిన స్టేడియం

అసలు ఏం జరిగిందంటే.. ఆదివారం రాత్రి 7:30 గంటలకు ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. మ్యాచ్ ప్రారంభమైన సమయం నుంచే లక్షకు పైగా సిట్టింగ్ కెపాటిసిటీ ఉన్న నరేంద్ర మోదీ స్టేడియం రోహిత్ శర్మ నినాదాలతో మార్మోగిపోయింది. టాస్ సమయం నుంచి మొదలైన నినాదాలు మ్యాచ్ ముగిసే సమయం వరకు కొనసాగాయి. తమ జట్టును మోసం చేసి ముంబైకి వెళ్లిపోయాడని ఇప్పటికే గుజరాత్ టైటాన్స్ అభిమానులు హార్దిక్ పాండ్యాపై కోపంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో వారు కూడా రోహిత్ శర్మ అభిమానులతో కలిసి హార్దిక్‌ను ఓ ఆట ఆడుకున్నారనే చెప్పుకోవాలి. ముఖ్యంగా హార్దిక్ పాండ్యా స్క్రీన్‌పై కనిపించినప్పుడల్లా హిట్‌మ్యాన్ నినాదాలతో స్టేడియం దద్దరిల్లింది. హార్దిక్‌ను ఓ రేంజులో హేళన చేశారు. ఇక రోహిత్ క్యాచ్ పట్టినప్పుడు, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో స్టేడియం మొత్తం ఆనందంతో కేరింతలు కొట్టింది.


అభిమానులకు కోపం తెప్పించిన హార్దిక్

అసలే రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించారనే బాధలో ఉన్న అభిమానులకు హార్దిక్ పాండ్యా మరింత కోపం తెప్పించే పని చేశాడు. మ్యాచ్‌లో ఫీల్డింగ్ సమయంలో రోహిత్‌ను హార్దిక్ పదే పదే మార్చడం అభిమానులకు కోపం తెప్పించింది. సాధారణంగా రోహిత్ శర్మ వలయం లోపల ఫీల్డింగ్ చేస్తుంటాడు. అలాంటి రోహిత్‌ను హార్దిక్ బౌండరీ లైన్ వద్దకు పంపించాడు. అంతటితో ఆగకుండా సీనియర్ ఆటగాడనే గౌరవం కూడా ఇవ్వకుండా పదే పదే రోహిత్ ఫీల్డింగ్ స్థానాన్ని మార్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా సాధారణ క్రికెట్ అభిమాని సైతం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనికి తోడు ఓ సందర్భంలో రోహిత్‌తో బుమ్రా మాట్లాడుతుంటే హార్దిక్ అసహనంతో వెళ్లిపోయాడు. హార్దిక్ అంతా చేస్తున్న రోహిత్ మాత్రం అతను చెప్పినట్టు తన బాధ్యతను నెరవేర్చడం గమనార్హం. మ్యాచ్ మొత్తంలో హార్దిక్ పాండ్యా ఓవరాక్షన్ చేశాడని అభిమానులు అంటున్నారు. ఫస్ట్ ఓవర్ కూడా పేస్ గన్ జస్ప్రీత్ బుమ్రా లేదా మరొక స్పెషలిస్ట్ పేసర్ చేత వేయించకుండా తానే వేశాడు. పైగా తాను వేసిన 3 ఓవర్లలో ఒక వికెట్ కూడా తీయకుండా 30 పరుగులిచ్చాడు. బ్యాటర్‌గాను విఫలమయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన జట్టును గెలిపించలేకపోయాడని అభిమానులు అంటున్నారు.


కుక్కను చూసి హార్దిక్.. హార్దిక్.. అని నినాదాలు

అప్పటికే హార్దిక్ పాండ్యాపై కోపంతో అతడిని హేళన చేస్తున్న అభిమానులకు మరో అస్త్రం దొరికింది. ఎలా వచ్చిందో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ మ్యాచ్ మధ్యలో ఓ కుక్క స్టేడియంలోకి వచ్చింది. దీంతో కుక్కను చూసి అభిమానులంతా హార్దిక్ పాండ్యా.. హార్దిక్ పాండ్యా అంటూ గట్టిగా అరిచారు. అంతటితో ఆగకుండా సోషల్ మీడియాలో పలువురు హార్దిక్‌ను కుక్కతో పోల్చొద్దు అని సూచిస్తున్నారు. ఎందుకంటే కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయని, కానీ హార్దిక్ పాండ్యా అలా కాదని రాసుకొస్తున్నారు. హార్దిక్ పాండ్యా కంటే కుక్కలు చాలా బెటరని, హార్దిక్‌ను వాటితో పోల్చి వాటిని అవమార్చవద్దని మరికొందరు అంటున్నారు. కాగా హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్‌ను మోసం చేసి ముంబై ఇండియన్స్‌లోకి వెళ్లాడని అభిమానులు కోపంతో ఉన్న సంగతి తెలిసిందే.


హార్దిక్ అభిమానులను చితకబాదారు

ఈ క్రమంలోనే స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ హార్దిక్ పాండ్యా అభిమానులను రోహిత్ శర్మ అభిమానులు చితకబాదారు. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి హార్దిక్ పాండ్యా స్వయంగా ముందుకు వస్తే ఏం జరుగుతుందో ఊహించండి అని రాసుకొచ్చాడు. ఏది ఏమైనా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఇంకా ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందో చూడాలి. అయితే మాజీ క్రికెటర్లు కూడా రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించడాన్ని తప్పుబడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ముంబై ఇండియన్స్‌పై గుజరాత్ టైటాన్స్ 6 పరుగుల తేడాతో గెలిచింది. రోహిత్ శర్మ(43) మంచి ఆరంభం ఇచ్చినా మిడిలార్డర్ వైఫల్యంతో ఆ జట్టు ఓడింది. దీంతో పలువురు అభిమానులు తాము రోహిత్ శర్మ బాగా ఆడాలని, కానీ ముంబై ఇండియన్స్ ఓడిపోవాలని కోరుకున్నామని చివరికి అదే జరిగిందని సంతోషంతో సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: ఎగిరి గంతేసిన కావ్య.. కానీ నిమిషాల్లోనే మాడిపోయిన మొహం.. అసలు ఏం జరిగిందంటే..

RR vs LSG: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్.. వరుసగా ఐదు సీజన్లలో..



Updated Date - Mar 25 , 2024 | 03:24 PM