Share News

IND vs ENG: కెప్టెన్‌గా మైలురాయిని చేరుకున్న రోహిత్ శర్మ.. అన్ని ఫార్మాట్లలో..

ABN , Publish Date - Mar 08 , 2024 | 11:01 AM

ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటు జట్టు కెప్టెన్‌గా, అటు బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు. తన నాయకత్వ ప్రతిభతో జట్టుకు అద్భుత విజయాలు అందిచడంతోపాటు బ్యాటుతోనూ టీంకు మంచి ఆరంభాలను అందిస్తున్నాడు.

IND vs ENG: కెప్టెన్‌గా మైలురాయిని చేరుకున్న రోహిత్ శర్మ.. అన్ని ఫార్మాట్లలో..

ధర్మశాల: ప్రస్తుతం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇటు జట్టు కెప్టెన్‌గా, అటు బ్యాటర్‌గా సత్తా చాటుతున్నాడు. తన నాయకత్వ ప్రతిభతో జట్టుకు అద్భుత విజయాలు అందిచడంతోపాటు బ్యాటుతోనూ టీంకు మంచి ఆరంభాలను అందిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టులో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు సెంచరీతో చెలరేగిన రోహిత్ భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. నాలుగో టెస్టులో లక్ష్య చేధనలో టీమిండియాకు బలమైన పునాది వేశాడు. హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. తాజాగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లోను రోహిత్ చెలరేగుతున్నాడు. మొదటి రోజే హాఫ్ సెంచరీ కొట్టిన హిట్‌మ్యాన్ టీమిండియాకు బలమైన పునాది వేశాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో కెప్టెన్‌గా 1,000 పరుగులను పూర్తి చేసుకున్నాడు.


ఈ క్రమంలో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఓ మైలురాయిని చేరుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఓ జట్టు కెప్టెన్‌గా అన్నీ ఫార్మాట్లలో(వన్డే, టెస్టు, టీ20) వెయ్యి పరుగుల చొప్పున పూర్తి చేసుకున్న ఆరో ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా తరఫున మూడో కెప్టెన్‌గా నిలిచాడు. భారత్ తరఫున రోహిత్ కంటే ముందు ధోని, విరాట్ కోహ్లీ కూడా ఈ రికార్డును అందుకున్నారు. అలాగే సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాప్ డుప్లిసెస్, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్, పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ కూడా ఈ మైలురాయిని చేరుకున్నారు. కాగా 2022 నుంచి టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ టెస్టుల్లో 27 ఇన్నింగ్స్‌ల్లో 1,039 పరుగులు.. 54 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 1,648 పరుగులు.. 44 వన్డే ఇన్నింగ్స్‌ల్లో 2,047 పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విషయానికొస్తే ఐదో టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లు ముగిసే సమయానికి భారత జట్టు 206/1 స్కోర్ చేసింది. క్రీజులో రోహిత్ శర్మ(80), శుభ్‌మన్ గిల్(65) ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. దీంతో భారత జట్టు ఇంకా 12 పరుగులు మాత్రమే వెనుకబడి ఉంది.

IND vs ENG: సచిన్, కోహ్లీ, రోహిత్ ఆల్‌టైమ్ రికార్డులను బద్దలుకొట్టిన జైస్వాల్


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 08 , 2024 | 11:01 AM