Share News

IND vs ENG: ఐదో టెస్టులో విజయానికి చేరువలో టీమిండియా.. లంచ్ బ్రేక్‌కే సగం ఇంగ్లండ్ టీం ఔట్!

ABN , Publish Date - Mar 09 , 2024 | 12:15 PM

ఐదో టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. మూడో రోజు ఆటలో తొలి సెషన్‌లో 259 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు లంచ్ విరామ సమయానికే సగం వికెట్లు కోల్పోయింది.

IND vs ENG: ఐదో టెస్టులో విజయానికి చేరువలో టీమిండియా.. లంచ్ బ్రేక్‌కే సగం ఇంగ్లండ్ టీం ఔట్!

ధర్మశాల: ఐదో టెస్టులో టీమిండియా విజయానికి చేరువలో ఉంది. మూడో రోజు ఆటలో తొలి సెషన్‌లో 259 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ జట్టు లంచ్ విరామ సమయానికే సగం వికెట్లు కోల్పోయింది. టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్(4/53) దెబ్బకు ఇంగ్లండ్ టాపార్డర్ పెవిలియన్‌కు పరుగులు పెట్టింది. లంచ్ విరామ సమయానికి 22.5 ఓవర్లు బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 5 వికెట్లు కోల్పోయి 103 పరుగులు మాత్రమే చేసింది. క్రీజులో జో రూట్(34) ఉన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంగ్లీష్ జట్టు ఇన్నింగ్ ఓటమి తప్పించుకుంటే అదే ఎక్కువ అని చెప్పుకోవాలి. రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్‌ను సెకండ్ ఓవర్‌లోనే టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ దెబ్బ తీశాడు. ఓపెనర్ బెన్ డకెట్‌ను 2 పరుగులకే ఔట్ చేశాడు. ఆ కాసేపటికే మరో ఓపెనర్ జాక్ క్రాలేను డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత ఓలీ పోప్(19)ను కూడా త్వరగా పెవిలియన్ చేర్చాడు. దీంతో 36 పరుగులకే ఇంగ్లండ్ టాప్ 3 వికెట్లు కోల్పోయింది.


ఇలాంటి సమయంలో ఇంగ్లండ్‌ను జోరూట్, జానీ బెయిర్‌స్టో ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 56 పరుగుల హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని 18వ ఓవర్‌లో కుల్దీప్ యాదవ్ విడదీశాడు. ధాటిగా ఆడి 3 ఫోర్లు, 3 సిక్సులతో 31 బంతుల్లోనే 39 పరుగులు చేసిన బెయిర్‌స్టోన్‌ను లెగ్‌బైస్‌లో పెవిలియన్ చేర్చాడు. ఆ కాసేపటికే ఇంగ్లండ్ కెప్టెన్ స్టోక్స్(2)ను అశ్విన్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 103 పరుగులకే ఇంగ్లండ్ సగం వికెట్లు కోల్పోయింది. ఆ జట్టు ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోవాలంటే మరో 160 పరుగులు చేయాలి. కాగా అంతకుముందు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 477 పరుగులకు ఆలౌట్ అయింది. మూడో రోజు ఆటలో ఓవర్‌నైట్ స్కోర్‌కు భారత జట్టు మరో 4 పరుగులు మాత్రమే జోడించింది. కాగా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 218 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టుకు 259 పరుగుల భారీ ఆధిక్యం లభించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Viral Video: ఇలాంటి క్యాచ్ నబూతో.. నభవష్యతి.. మీరు క్రికెట్ ఫ్యాన్స్ అయితే కచ్చితంగా చూడాల్సిందే..

IND vs ENG: ఐదో టెస్టులో టీమిండియా ఖాతాలో అరుదైన రికార్డు



Updated Date - Mar 09 , 2024 | 12:22 PM