Share News

India vs Afghanistan టీ20 సిరీస్‌ను ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలో తెలుసా?..

ABN , Publish Date - Jan 11 , 2024 | 08:12 AM

India vs Afghanistan: భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం మొదటి మ్యాచ్ జరగనుంది. మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది.

India vs Afghanistan టీ20 సిరీస్‌ను ఎప్పుడు? ఎక్కడ? ఎలా చూడాలో తెలుసా?..

మొహాలీ: భారత్, అఫ్ఘానిస్థాన్ మధ్య టీ20 సిరీస్‌కు సమయం ఆసన్నమైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా గురువారం మొదటి మ్యాచ్ జరగనుంది. మొహాలీ వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. జూన్‌లో జరిగే టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియా ఆడనున్న చివరి ద్వైపాక్షిక సిరీస్ ఇదే కావడంతో ఆసక్తి నెలకొంది. దీనికి తోడు చాలా రోజుల తర్వాత సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్‌లో బరిలోకి దిగుతున్నారు. దీంతో అందరి చూపు ఈ సిరీస్‌పై నెలకొంది. అయితే పలు కారణాలతో విరాట్ కోహ్లీ మొదటి మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు. దీంతో మొదటి మ్యాచ్‌లో అందరి చూపు కెప్టెన్ రోహిత్ శర్మ పైనే ఉండనుంది. అయితే ఇటీవల కాలంలో వేగంగా ఎదుగుతున్న అఫ్ఘానిస్థాన్‌ను ఏమాత్రం తేలికగా తీసుకోవడానికి వీలు లేదు. పైగా గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో ఆ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. బలమైన ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లను ఓడించింది. ఒకానొక దశలో సెమీస్ చేరేలా కనిపించింది. అయితే ఈ సిరీస్‌కు స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అందుబాటులో లేకపోవడం అఫ్ఘానిస్థాన్‌కు మైనస్‌గా చెప్పుకోవచ్చు.


మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో గురువారం జరిగే మొదటి మ్యాచ్ మొహాలీ వేదికగా జరగనుంది. ఇండోర్ వేదికగా జనవరి 14న రెండో టీ20 మ్యాచ్, 17న బెంగళూరు వేదికగా చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్నాయి. ఈ సిరీస్‌ను స్పోర్ట్స్ 18, జియో సినిమా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి. టీవీల్లో మ్యాచ్ చూడాలనుకునే వారు స్పోర్ట్స్ 18లో చూడొచ్చు. మొబైల్స్‌లో, ఓటీటీలో మ్యాచ్ చూడాలనుకునే వారు జియో సినిమా యాప్‌లో చూడొచ్చు. ఇందుకోసం జియో సినిమా యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే జియో సినిమాలో జియో నెట్‌వర్క్ వినియోగదారులు మాత్రమే మ్యాచ్ చూడొచ్చు. జియో సినిమా అయితే ఈ సిరీస్‌ను ఏకంగా 11 స్థానిక భాషల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. దీంతో ఏ భాషలో కావాలనుకునేవారు, ఆ భాషలో మ్యాచ్ చూడొచ్చు. ఇందుకోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి మనకు కావాల్సిన భాష ఎంచుకుంటే సరిపోతుంది. ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ, భోజ్‌పురి, పంజాబీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం వంటి బహుళ భాషల్లో భారత్, అఫ్ఘానిస్థాన్ టీ20 సిరీస్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్పోర్ట్స్ 18, జియో సినిమాతోపాటు కలర్స్ సినీప్లెక్స్‌లో కూడా ఈ సిరీస్ ప్రత్యక్ష ప్రసారం కానుందని వయోకామ్ 18 ప్రకటించింది. అన్నింటిలోనూ మ్యాచ్ ప్రారంభానికి గంట ముందే అంటే 6 గంటల నుంచే లైవ్ ప్రారంభంకానుంది.

Updated Date - Jan 11 , 2024 | 08:12 AM