Share News

Bharat Ratna: తెలుగు ఠీవీ పీవీకి భారత‘రత్న’.. ఇంట్రెస్టింగ్ విషయాలివే..

ABN , Publish Date - Feb 09 , 2024 | 02:46 PM

భారతమ్మ బంగారు ముద్దు బిడ్డ, రాజనీతిజ్ఞుడు, బహూ బాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహానేత. పీవీ నరసింహా రావును దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు వరించింది.

Bharat Ratna: తెలుగు ఠీవీ పీవీకి  భారత‘రత్న’.. ఇంట్రెస్టింగ్ విషయాలివే..

ఆంధ్రజ్యోతి ఇంటర్నెట్ డెస్క్: భారతమ్మ బంగారు ముద్దు బిడ్డ, రాజనీతిజ్ఞుడు, బహూ బాషా కోవిదుడు, ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిన మహానేత. రూపాయి విలువ పడిపోకుండా కాపాడిన మేధావి. తెలుగు బిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ పాములపర్తి వెంకట నరసింహా రావును (పీవీ నరసింహా రావు) మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న అవార్డు వరించింది. ఈ సందర్భంగా పీవీ జననం మొదలుకుని.. జీవితంలో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం..

ప్రధానిగా సేవలు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దేశ ప్రధాన మంత్రి పదవి చేపట్టి, సుపరిపాలన అందించారు పీవీ నరసింహా రావు (P V Narasimha_Rao). గాంధీ- నెహ్రూ కుటుంబానికి నమ్మిన బంటుగా ఉంటూనే ప్రధాని పదవిని సమర్థంగా నిర్వహించారు. పీవీ నరసింహారావుకు మన్మోహన్ సింగ్ జత కలిశారు. వీరిద్దరూ దేశంలో ఆర్థిక సంస్కరణలను అమలు చేశారు. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోకుండా కాపాడారు. ఈ రోజు నరేంద్ర మోదీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలకు ఆ నాడు పీవీ ప్రభుత్వం పునాది వేసిందని చెప్చొచ్చు.

నేపథ్యం

సీతారామా రావు- రుక్మా బాయ్ దంపతులకు 1921 జూన్ 28వ తేదీన పీవీ నరసింహా రావు జన్మించారు. వీరి స్వస్థలం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి. పీవీ నరసంహా రావుకు మూడేళ్ల వయస్సు ఉన్నప్పుడు మరొకరు దత్తత తీసుకున్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరకు చెందిన పాములపర్తి రంగా రావు- రుక్మిణమ్మ దంపతులు పీవీని తీసుకెళ్లారు. అలా అతని పేరు ముందు పాములపర్తి వెంకట (పీవీ) అని ముద్ర పడింది. ఆ పేరు దేశంలో ఓ చరిత్రను లిఖించింది. భీమదేవర పల్లి మండలం కట్కూరు గ్రామంలో పీవీ ప్రాథమిక విద్య కొనసాగింది. ఉస్మానియా వర్సిటీలో డిగ్రీ చేశారు. 1930లో వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. నాగ్ పూర్ యూనివర్సిటీలో ‘లా’ పూర్తి చేశారు. 1940లో కజిన్ పాములపర్తి సదాశివరావు, స్నేహితులతో కలిసి ‘కాకతీయ పత్రిక’ మ్యాగజైన్ ఏర్పాటు చేశారు. పీవీ, సదాశివరావు ఇద్దరు జయ-విజయ కలం పేరుతో వార్తలు రాసేవారు.

కుటుంబం

పదేళ్ల వయస్సులో పీవీ నరసింహా రావుకు సత్యమ్మతో పెళ్లి జరిగింది. ఆ దంపతులకు ముగ్గురు కుమారులు, ఐదుగురు కుతూళ్లు ఉన్నారు. ఇద్దరు కుమారులు పీవీ రంగా రావు, పీవీ రాజేశ్వర్ రావు ఇద్దరు రాజకీయాల్లో కొనసాగారు.

ముఖ్యమంత్రిగా..

పీవీ నరసింహా రావు భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా అంకితం అయ్యారు. 1957లో మంథని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా విధులు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1971లో నాలుగవ ముఖ్యమంత్రిగా పనిచేశారు. భూ సంస్కరణలు, భూ సీలింగ్ చట్టాలను అమలు చేసి ప్రజల ఆధరణ పొందారు.

ప్రధానమంత్రిగా..

రాష్ట్రంలో పీవీ నరసింహా రావు తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. తర్వాత దేశ రాజకీయాల్లోకి వెళ్లారు. ఇందిరా గాంధీకి నమ్మిన బంటుగా ఉన్నారని చెప్పొచ్చు. తర్వాత రాజీవ్ గాంధీతో కలిసి సన్నిహితంగా మెలిగారు. ఇందిరా, రాజీవ్ గాంధీ ప్రభుత్వాల్లో కేంద్ర మంత్రిగా పీవీ నరసింహా రావు పనిచేశారు. హోం శాఖ, రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖలను పర్యవేక్షించారు. 1991 నుంచి 1996 వరకు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. పీవీ నరసింహా రావు 1991లో రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ హత్య తర్వాత తిరిగి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. 1991లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. మిత్రపక్షాలను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ సమయంలో గాంధీ కుటుంబం నుంచి ప్రధాని పదవి చేపట్టేందుకు సుముఖంగా లేకపోవడం, ఇతర కారణాల వల్ల పీవీ ప్రధాని పదవి చేపట్టారు. విజయవంతంగా ఐదేళ్లు పాలనను కొనసాగించారు. పీవీ మంత్రివర్గంలో ఉద్దండ నేతలు పనిచేశారు. ప్రధాని పదవి కోసం పోటీ పడిన శరద్ పవార్ కూడా పీవీ మంత్రివర్గంలో ఉన్నారు. మన్మోహన్ సింగ్, సుబ్రమణ్య స్వామి తదితర నేతలతో పీవీ ప్రభుత్వాన్ని నడిపారు.

హైలైట్స్

  • పీవీ నరసింహా రావు బహుబాషా కోవిదుడు. ఆయన 17 బాషలను అనర్గళంగా మాట్లాడగలరు. తెలుగుతోపాటు మరాఠి, బెంగాలి, గుజరాతి, హిందీ, కన్నడ, మళయాళం, ఒడియా, సంస్కృతం, తమిళ్, ఉర్దూ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, అరబిక్, స్పానిష్, జర్మన్, పెర్షియ భాషలు మాట్లాడే వారు.

  • జాతీయ భద్రతకు పీవీ నరసింహా రావు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విదేశాలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. దేశంలో సంక్షోభ సమయంలోనూ సమర్థంగా పరిపాలించారు.

  • పీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జై ఆంధ్ర ఉద్యమం జరిగింది. ఆ సమయంలో శాంతి భద్రతల దృష్ట్యా రాష్ట్రపతి పాలన విధించాల్సి వచ్చింది.

  • పీవీ నరసింహా రావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. తర్వాత అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే.

మరిన్ని ప్రత్యేక కథనాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 09 , 2024 | 03:11 PM