Share News

AP Elections: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. ఆ ఇద్దరూ ఎదురు తిరిగారు!

ABN , Publish Date - Apr 24 , 2024 | 02:06 PM

ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోతోంది.. దీంతో హైకమాండ్ దిక్కుతోచని స్థితిలో పడింది..

AP Elections: వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. ఆ ఇద్దరూ ఎదురు తిరిగారు!

ఒకరు మాజీ సర్పంచ్.. మరొకరు ప్రస్తుత సర్పంచ్ భార్య.. ఇద్దరికీ అధికార వైసీపీలో (YSR Congress) అవమానాలే ఎదురయ్యాయి. చేసిన కష్టానికి తగిన గుర్తింపు దక్కలేదని ఒకరు, సొంత పార్టీ నాయకుల భూ కబ్జాలు, దందాలు భరించలేక మరొకరు.. రెబల్‌ అభ్యర్థులుగా నిలిచారు. ఒకరు వైసీపీ అభ్యర్థిగానే నామినేషన్‌ వేస్తే మరొకరు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసి వైసీపీ ప్రకటిత అభ్యర్థి, ఎమ్మెల్సీ భరత్‌ను సవాల్‌ చేస్తున్నారు.

సీన్ రివర్స్!

ఎన్నికలు (AP Elections) సమీపిస్తున్నకొద్దీ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అంతకంతకూ పుంజుకుంటోంది. గ్రామగ్రామానా ఆ పార్టీకి ప్రజల మద్దతు పెరుగుతోంది. పార్టీ తలపెడుతున్న ప్రచారాలు, కార్యక్రమాలకు జనం వెల్లువెత్తుతున్నారు. ఈనెల 19న చంద్రబాబు తరఫున నామినేషన్‌ వేసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి పాల్గొన్న ర్యాలీకి స్వచ్ఛందంగా తరలివ్చన వేలాదిమంది జనమే దీనికి నిదర్శనం. దీనికి రివర్స్‌లో వైసీపీ పరిస్థితి నియోజకవర్గంలో నానాటికీ దిగజారుతోంది. ఎక్కడికక్కడ పార్టీ, విభేదాలతో కునారిల్లుతోంది. గోరుచుట్టుమీద రోకలిపోటులా ఇప్పుడు ఆ పార్టీ ప్రకటిత అభ్యర్థి భరత్‌కు ఇద్దరు రెబల్‌ అభ్యర్థులు తయారయ్యారు. కుప్పం మండలం వసనాడు వైసీపీ మాజీ సర్పం బి.మురళీధర్‌ అలియాస్‌ వసనాడు మురళి సోమవారం ఆ పార్టీ అభ్యర్థిగానే పేర్కొంటూ నామినేషన్‌ వేస్తే, శాంతిపురం మండలం మొరసనపల్లె వైసీపీ సర్పంచి అభ్యర్థి జగదీశ్‌ భార్య నీలమ్మ అలియాస్‌ నీలావతి మంగళవారం స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేశారు. ఇద్దరూ ఎటువంటి హంగామా, అట్టహాసం లేకుండా ఒకరిద్దరు మనుషులతో వచ్చి నామినేషన్‌ వేసేసి వెళ్లారు.


Rebals-YSRCP.jpg

పార్టీ నాయకుల తీరుపై తీవ్ర నిరసన

ఐదేళ్ల వైసీపీ పాలనలో కుప్పం నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికీ నోచులేకపోయింది. కుప్పం పట్టణంలో అక్కడక్కడా సిమెంటు రోడ్లు, కాలువలు నిర్మించడం తప్ప పంచాయతీల్లో అభివృద్ధి అనేదే కనిపించకపోవడంపై ప్రజల్లో ఔఅసంతృప్తి ఉంది. ఇక, వైసీపీ నాయకుల ఇసుక.. భూదందాలు, క్వారీ అక్రమాలు ప్రజలను చీకాకుపెట్టాయి. దాడులు, దౌర్జన్యాలు శాంతిభద్రతలకు విఘాతం కలిగించాయి. ఇప్పుడు ఇవే మాటలు వైసీపీ రెబల్‌ అభ్యర్థులు కూడా చెబుతున్నారు. పార్టీకోసం దీర్ఘకాలంగా కష్టపడినా గుర్తింపు లభించకపోగా, పైస్థాయిలోనే అక్రమాలు, దౌర్జన్యాలు తమను బాధించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం తమ పంచాయతీలకు, అక్కడి ప్రజలకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేకపోయామంటున్నారు. ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ప్రస్తుత అభ్యర్థి అయిన భరత్‌పైనే వారు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్నారు. నామినేషన్‌వేసి వచ్చాక వైసీపీ నేతల దందాలు, భూ కబ్జాలపై నీలావతి గళం విప్పారు. వైసీపీ నాయకుల దౌర్జన్యాలకు అమాయక ప్రజలు బలైపోతున్నారని ధ్వజమెత్తారు. వారి ఆగడాల నుంచి రక్షణ కావాలంటే తనకు ఓటేసి గెలిపించాలని అభ్యర్థించారు.

అంతర్గత విభేదాలూ ఎక్కువే

పేరుకు నామినేషన్‌ వేసిన రెబల్‌ అభ్యర్థులు ఇద్దరే అయినా, పార్టీలో అంతర్గతంగా ఉన్న నిరసనలు, విభేదాలు చాలా ఎక్కువే. పార్టీ నాయకుల దౌర్జన్యాలను సహించలేక, వారి నిరాదరణకు గురైన పలువురు కిందిస్థాయి నాయకులు, కార్యకర్తలు ఈ ఇద్దరు రెబల్స్‌ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు. రాబోయే రోజుల్లో వైసీపీలో మరింత నిరసన సెగ తగలక తప్పదని అటువంటివారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. - కుప్పం

Read Latest Telangana News And Telugu News


Updated Date - Apr 24 , 2024 | 02:14 PM